ఇంటర్ పరీక్షలను ఈ నెల 15 నుంచి బోర్డు నిర్వహించనున్నది. పరీక్షల నిర్వాహణకు పకడ్బందీ ఏర్పాట్లను బోర్డు చేస్తోంది. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలను నిర్వహించనున్నారు. ఏప్రిల్ 4 వరకు పరీక్షలు కొనసాగనున్నాయి.
ఇక హాల్ టికెట్ల పంపిణీ ప్రక్రియ ఊపందుకుంది. విద్యార్థుల నంచి పాఠశాలల యాజమాన్యాలు బకాయి ఫీజులు రాబట్టుకుంటున్నాయి. కొన్ని కళాశాలల్లో విద్యార్థులు కొంత మేర ఫీజులు చెల్లిస్తున్నారు. కానీ వారికి పాఠశాలలు హాల్ టికెట్స్ ఇచ్చేందుకు నిరాకరిస్తున్నాయి.
బకాయిలను క్లియర్ చేస్తేనే హాల్ టికెట్లు ఇస్తామంటూ కొర్రీలు పెడుతున్నాయి. మరోవైపు హాల్ టికెట్లను ఇంటర్నెట్ నుంచి డౌన్ లోడ్ చేసుకునే సౌకర్యాన్ని ఇంటర్ బోర్డు అధికారులు కల్పించారు. అయితే డౌన్ లోడ్ ప్రక్రియను కేవలం కళాశాల లాగిన్ కి మాత్రం పరిమితం చేశారు.
దీంతో విద్యార్థులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హాల్ టికెట్ల డౌన్లోడ్ ప్రక్రియ కేవలం కాలేజీల లాగిన్ కే పరిమితం చేయడంతో ఆన్ లైన్ సెంటర్ల నుంచి విద్యార్థులు నిరాశతో వెనక్కి తిరుగుతున్నారు. ఇదే అవకాశంగా భావిస్తున్న పలు కళాశాలలు విద్యార్థులను ఇబ్బందులు పెడుతున్నాయి.
ఈ క్రమంలో చేసేదేమి లేక విద్యార్థుల తల్లి దండ్రులు అప్పులు చేస్తున్నారు. నానా తిప్పలు పడి ఫీజులు కట్టాల్సిన పరిస్థితి నెలకొందని విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు. కళాశాలల యాజమాన్యానికి ఇంటర్ బోర్డు అనుకూలంగా వ్యవహరిస్తోందంటూ విమర్శలు గుప్పిస్తున్నారు.