తెలంగాణలో కరోనా కేసులు గత కొన్ని రోజుల నుంచి పెరుగుతున్నాయి. నాలుగు వేలకు పైగా రోజువారీ కేసులు వెలుగు చూస్తున్నాయి. ఇప్పటివరకు నగరానికే పరిమితమైన ఈ వైరస్ ఇప్పుడు గ్రామాలకు కూడా పాకింది. కరోనాకు తోడు ఒమిక్రాన్ కేసులు కూడా రాష్ట్రంలో భారీగానే నమోదవుతున్నాయి. దీంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఆరోగ్యశాఖ కీలక నిర్ణయం తీసుకుంది.
క్వారంటైన్ లో ఉన్న రోగులకు ఏవైనా సమస్యలు తలెత్తితే.. నేరుగా ప్రభుత్వాసుపత్రుల్లోని డాక్టర్లను కలిసేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. అన్ని ఆసుపత్రుల్లో ప్రత్యేకంగా కోవిడ్ ఓపీలు నిర్వహించాలని ఆరోగ్యశాఖ ఆస్పత్రులకు సూచించింది. రాష్ట్రం చిన్నా, పెద్ద ఆస్పత్రుల్లో కూడా ఈ ఏర్పాట్లు చేయాలని తెలిపింది. సాదారణ రోగులతో కాకుండా కోవిడ్ బాధితులకు ప్రత్యేకంగా ఓపీలు నిర్వహించాలని.. చికిత్స అందించాలని ప్రభుత్వం డాక్టర్లకు ఆదేశాలిచ్చింది.
ఇప్పటి వరకు కరోనా స్వల్ప లక్షణాలు ఉండే వారికి మెడికిల్ కిట్లు ఇచ్చి క్వారంటైన్ కి వెళ్లాలని అధికారులు సూచించేవారు. వారికి తలెత్తిన సమస్యలపై టెలీ మెడిసిన్ విధానంలో అడిగి తెలుసుకునేవారు. సలహాలు ఇచ్చేవారు. తీవ్రమైన లక్షణాలు ఉంటేనే ఆసుపత్రుల్లో చేర్చుకొని చికిత్స అందించేవారు. కానీ.. ఇప్పుడు ప్రభుత్వం రోగులకు ఇబ్బందులు కలుగకుండా అన్ని ఆసుపత్రుల్లో కొవిడ్ ఓపీలు నిర్వహించాలని ఆదేశించింది.
ఐసోలేషన్ పీరియడ్లో ఐదు రోజుల పాటు ప్రభుత్వం ఇచ్చే మందులు వాడినా.. కరోనా తీవ్రత తగ్గకపోతే వెంటనే స్థానికంగా ఉండే కొవిడ్ ఓపీ కేంద్రాన్ని సందర్శించాలి. అక్కడ డాక్టర్లు పూర్తి స్థాయిలో పరిశీలించి తర్వాత ట్రీట్మెంట్ విధానాన్ని అమలు పరుస్తారు. ప్రతీ జిల్లాలోని పీహెచ్సీ, సీహెచ్ సీ, ఏహెచ్ఎస్, డీహెచ్ఎస్, టీచింగ్ ఆసుపత్రులన్నింటిలో ఈ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొని వచ్చారు.