మాటలు కోటలు దాటుతున్నాయ్.. చేతలు గడపలు దాటడం లేదు. కరోనా వ్యవహారంలో ఏపీ సర్కార్ తీరు అలాగే ఉంది. రివ్యూ మీటింగులు జరపడం.. మంచి డైలాగ్స్, ప్రసంగం రెడీ చేసి.. అవి ప్రెస్ కు రిలీజ్ చేయడం.. అవి ప్రెస్ అంతా హెడ్ లైన్స్ లో వేయడం.. ఇంకేముంది సీఎంగారు చెప్పారు.. అంతా ఓకె అని అందరూ చప్పట్లు కొట్టుకోవడం.. ఇదొక మామూలు రొటీన్ తంతు అయిపోయింది రాష్ట్రంలో.
కరోనాపై రివ్యూ చేసి.. అన్ని ఆస్పత్రుల్లో సౌకర్యాలు పెంచాలని ఆదేశాలిస్తారు ఒక రోజు.. మరో రోజు బెడ్ అవసరమైతే.. అరగంటలో అలాట్ చేయాలని ఓ ఆదేశం.. ఒక్కరు కూడా ఇబ్బందిపడకుండా చూడాలని అధికారులకు మరో ఆదేశం.. 108, 104 అద్భుతంగా సర్వీసులు అందిస్తున్నాయి.. ఇంకా అలాగే కొనసాగాలని ఇంకో ఆదేశం.. ఇలా ఆదేశాలు రాసుకుంటూ పోతే చాంతాడంత అయితాయి.. అందులో జరిగినవి రాయాలంటే ఒక్క లైను కూడా రాయలేం… అదీ పరిస్ధితి.
స్వయంగా వైసీపీ ఎమ్మెల్యే అనంతవెంకట రామిరెడ్డి (అనంతపురం) కోవిడ్ సమీక్షలో మంత్రి ఆళ్ల నాని మొహం మీదే అడిగేశారు. ‘‘అందరూ ఏదో అంతా బాగానే ఉంది. అన్నీ సవ్యంగా చేస్తున్నామని అధికారులు చెబుతున్నారు. కాని అది నిజం కాదు. ఒక్క ఆస్పత్రి తప్ప.. మిగతా అన్నిటిలోనూ జనానికి వైద్య సేవలు సరిగా అందడం లేదు. ఎక్కడా సరైన సౌకర్యాలు లేవు. పేషెంట్లకు అందించే ఫుడ్ కూడా బాగోటం లేదు. అసలు డాక్టర్లు, నర్సులు పేషెంట్లు ఉన్న రూముల్లోకే వెళ్లటం లేదు. ఇలా అయితే కష్టం‘‘ అంటూ మొత్తం ఉన్నదున్నట్లు కడిగిపారేశారు. దీంతో షాకైన మంత్రి.. ఎమ్మెల్యే గారు చెప్పారు కదా.. చర్యలు తీసుకోండి అని ముగించేశారు. అంతకంటే ఏమనగలరు.. ఎందుకంటే ఆయనకు కూడా తెలుసు వాస్తవ పరిస్ధితేమిటో.
రాష్ట్రంలో కరోనా కేసుల లెక్కలు కూడా తేడాలొస్తున్నాయని మీడియాలో కథనాలొస్తున్నాయి. జిల్లా అధికారులు ఇచ్చే రిపోర్టుకు.. సీఎంఓ నుంచి వచ్చే రిపోర్టుకు కూడా తేడాలుంటున్నాయని బయటపడింది. ఈ లెక్కన.. ఇంకెన్ని కేసులు ఉన్నాయో.. అనే అనుమానాలు వస్తున్నాయి. అంతే కాకుండా.. కేసుల సంఖ్య పెరిగిపోవడంతో ఉన్న యంత్రాంగం.. ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్ వారిని గుర్తించి టెస్టులు చేయడమనేది జరగడం లేదు. కేవలం ఎవరికైనా అనుమానం ఉందో వారే వచ్చి టెస్ట్ చేయించుకుంటున్నారు.. లేదు కేసులొచ్చిన చుట్టుపక్కలవారు.. వారంతట వారే భయంతో వచ్చి టెస్ట్ చేయించుకుంటున్నారు. ఈ టెస్టుల రిపోర్టులు కూడా ఎప్పటికో వస్తున్నాయి. అవి కూడా సక్రమంగా జరగడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి.అదేమంటే టెస్టులు ఎక్కువగా చేస్తున్నామనే కథ తప్ప ఇంకోటి చెప్పడం లేదు. చాలాచోట్ల పేషెంట్లు.. గవర్నమెంట్ ఆస్పత్రికి వెళ్లడానికి భయపడి.. ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లి లక్షలు లక్షలు సమర్పించుకుంటున్నారు. తెలిసినవాళ్లు అయితే రోజుకు 20 వేలు.. లేదంటే 40 వేలు.. ఇలా వసూలు చేసేస్తున్నారు. మినిమమ్ పది, పదిహేను రోజులు ఆస్పత్రుల్లో ఉండాల్సిందే. ఎదురుగా ఢిల్లీ, కేరళ సక్సెస్ అయిన ఉదాహరణలు కనపడుతున్నా అవి పట్టించుకోకుండా ఇంట్లోనే ఉండండి.. కరోనాతో సహజీవనం తప్పదు.. అందరికీ రాక తప్పదు లాంటి డైలాగులు చెబుతూ జగన్మోహన్ రెడ్డిగారు కాలం గడిపేస్తున్నారు. ఆయన పార్టీ నేతలకు ఎవరికి వచ్చినా.. అందరూ హైదరాబాద్ పరిగెడుతున్నారు.. అంటే ఇక్కడ నమ్మకం లేకే గదా అని విమర్శలు వస్తున్నాయి. ఇప్పుడు లేటెస్టుగా ఎమ్మెల్యే కరణం బలరాం హైదరాబాద్ స్టార్ ఆస్పత్రిలో చేరి.. చికిత్స పొందుతున్నారు.