కొంతమందికి అదొక ఆధ్యాత్మిక అపురూపం.. కొంతమందికి అదొక అద్భుతఘట్టం. ఇంకొంతమందికి ఒక వివాదానికి ముగింపు.. కాని కొంతమందికి అదొక అవమానం.. రామజన్మభూమి.. అయోధ్య.. ఈ రెండు పదాలు వినగానే సగటు రాజకీయ మనిషికి గుర్తొచ్చేది బిజెపి.. అద్వానీ రథయాత్ర. ఒక్క రథయాత్ర.. దేశమంతా కలకలం రేపింది.. రెండు సీట్ల దగ్గరున్న బిజెపిని 88 సీట్లకు ఎకాఎకిన నిచ్చెనలు వేసి మరీ ఎక్కించేసింది. అలాంటి వివాదం మొత్తానికి ముగిసి.. అక్కడ ఇప్పుడు రామాలయం కడుతున్నారు. ఆ చారిత్రక ఘట్టానికి నరేంద్ర మోదీ శ్రీకారం చుట్టారు.
ఈ కార్యక్రమంపై కొన్ని విమర్శలున్నాయి. ఒకటి కరోనా టైములో ఎక్కడా వెనక్కు తగ్గకుండా 300 కోట్లు పెట్టి ఈ ప్రాజెక్టు ఏంటని… ఒక పక్క అమిత్ షాకి కరోనా వచ్చినా.. ఆయనతో కలిసిన నరేంద్ర మోదీ క్వారంటైన్ కి వెళ్లకుండా.. ఎలా వస్తారని.. దళితుడైన రాష్ట్రపతికి ఆహ్వానం ఇవ్వలేదని.. ఈ భూమిని రామాలయానికి ఇవ్వాలంటూ తీర్పిచ్చిన రంజన్ గొగొయ్ బిజెపి ఎంపీగా కొలువు దీరడం వెనక ఏం జరిగిందని.. ఇలా రకరకాలు వచ్చాయి.. అవన్నీ పక్కన పెడితే.. దీని ప్రభావం రాజకీయంగా ఎలా ఉంటుందనే చర్చ ఇప్పుడు మొదలైంది.
బిజెపికి సంప్రదాయక బలం హిందూత్వమే. ఎవరు అవునన్నా కాదన్నా.. ముందు వారికి మద్దతిచ్చేది హిందూత్వ వాదనను సమర్ధించేవారే. వారి ఎజెండాలోని ఒక్కొక్క అంశాన్ని టిక్కులు పెట్టేసుకుంటూ మోదీ – అమిత్ షా ద్వయం.. మిగతా విషయాల్లో ఆర్ఎస్ఎస్ కలగచేసుకోకుండా చూసుకుంటున్నారు. కాశ్మీర్ స్వయంప్రతిపత్తి రద్దు చేయడం.. తలాఖ్ సంప్రదాయాన్ని రద్దు చేయడం.. ఇప్పుడు అయోధ్యలో రాముడి గుడి కట్టడం.. ఇవన్నీ ఎప్పటి నుంచో ఉద్యమాంశాలుగా హిందూత్వ వాదులు పోరాడుతున్నారు. అవన్నీ నెరవేరుస్తూ వారి దగ్గర ఫుల్లు మార్కులు కొట్టేస్తున్నారు నరేంద్ర మోదీ.
మరోవైపు ఆర్ధిక సంస్కరణలు వేగంగా అమలు చేస్తూ.. సంప్రదాయక స్వదేశీ నినాదం వినిపించే ఆర్ఎస్ఎస్ వారికి నచ్చనివాటిని కూడా శరవేగంగా తెర మీదకు తెచ్చేస్తున్నారు. దాని వలన ఆర్ధిక విధానాల్లో వచ్చే మార్పులు.. ఇవన్నీ కూడా నచ్చినా నచ్చకపోయినా.. వారి హిందూత్వ అజెండాను సమాంతరం అమలు చేస్తూ.. వారిని సైలెంట్ చేసేస్తున్నారు నరేంద్ర మోదీ.
ఇప్పుడు కరోనా కట్టడిలో విఫలమైనా.. ఆర్ధిక విధానాల్లో నోట్ల రద్దు వంటి వాటి మంచి కాన్సెప్టు అయినా అమలులో ఘోరంగా దెబ్బ తిన్నా.. జీఎస్టీ వంటివాటితో.. అకౌంటబులిటీ పెరిగినా బిజినెస్ సర్కిల్స్ ని ఇబ్బంది పెట్టినా.. ఏం జరిగినా.. హిందూత్వం అనే సెంటిమెంట్ ముందు.. ఇవన్నీ ఓడిపోవాల్సిందే.. లొంగిపోవాల్సిందే.. పైగా దేశభక్తి అనే మరో సెంటిమెంట్ కూడా వారి అమ్ముల పొదిలో ఉంది. ఎఫ్పుడు ఏ టెర్రర్ అటాక్ జరిగినా.. పాకిస్తాన్ ఏ పాపం చేసినా.. దానికి వ్యతిరేకంగా ఏం చేసినా పుణ్యమే కాబట్టి.. ఆ మార్కులు కూడా వీరి అకౌంట్లోనే పడిపోతాయి. అన్నిటికి మించి.. ప్రత్యర్ధి కాంగ్రెస్ లో నాయకత్వ కొరత.. నాయకత్వ వైఫల్యం.. గ్రూపులు.. అన్నీ బాగా కలిసి వస్తున్నాయి బిజెపికి.
అలా ఇవన్నీ కలిపి చూస్తే.. అయోధ్యలో రాముడి గుడి కట్టడమనే కాన్సెప్టు.. అన్ని సంక్షోభాలను మరిపించేలా.. అన్ని వైఫల్యాలను మర్చిపోయేలా ప్రజలను కట్టిపడేయటం ఖాయమే అని చెప్పొచ్చు. పైగా దీనిని అద్భుత ఘట్టంగా వర్ణిస్తూ మీడియా అదే పనిగా ఆకాశానికి ఎత్తేయడం.. సోషల్ మీడియా అంతా వాట్సప్ స్టేటస్ లతో సహా రాముడి బొమ్మతో నిండిపోవడం చూస్తుంటే.. ఆ మేనియా బాగానే పని చేసిందనే చెప్పాలి.