టీఆర్ఎస్, బీజేపీ మధ్య ఫైట్ అంతా నాటకమేనా? తెలంగాణలో సై అంటే సై అని సవాళ్లు విసురుకోవడమే కానీ.. ఢిల్లీలో రెండు పార్టీలు ఒకటేనా? పార్లమెంట్ సమావేశాల సందర్భంగా ఇరు పార్టీల మధ్య సాగుతున్న వ్యవహారం చూస్తోంటే ఇప్పుడు అందరికి అదే అనుమానం వస్తోంది.
నువ్వు కొట్టినట్లు చేయి.. నేను ఏడ్చినట్లు చేస్తానన్నట్టు కనిపిస్తోంది టీఆర్ఎస్, బీజేపీల తీరు. టీఆర్ఎస్ గద్దె కూలుస్తాం.. కేసీఆర్ను జైలుకు పంపిస్తాం అంటూ ఇక్కడనేమో తెలంగాణ బీజేపీ నేతలు వీరావేశంతో ఊగిపోతోంటే.. ఢిల్లీలో మాత్రం అందుకు విరుద్ధమైన దృశ్యాలు కనబడుతున్నాయి. కేసీఆర్ గ్రేట్.. టీఆర్ఎస్ గ్రేట్ అంటూ కేంద్ర పెద్దలు భుజాన్ని తడుతున్నారు. పార్లమెంట్ సమావేశాల్లో.. TRS ను ఉక్కిరిబిక్కిరి చేయాలని టీబీజేపీ ఎంపీలు బండెడు ప్రశ్నలతో బయలుదేరితే.. వాటికి కేంద్రం ఇస్తున్న సమాధానాలు మాత్రం బండి అండ్ కో ఉత్సాహాన్ని నీరుగార్చేలా ఉంటున్నాయి.
TRS ను టార్గెట్ చేయాలని బండి సంజయ్ ప్రశ్న సంధించడం.. దానికి కేంద్ర మంత్రులు టీఆర్ఎస్ భేష్ అంటూ సమాధానం ఇవ్వడం పరిపాటిగా మారిపోయింది. మొన్నటికి మొన్న కాళేశ్వరం, పాలమూరు ప్రాజెక్టుల్లో అవినీతి గురించి బండి సంజయ్ లోక్ సభలో ప్రశ్న లేవెనెత్తగా.. అలాంటిదేమీ జరగలేదని, ఇప్పటివరకు ఎలాంటి అవినీతి జరిగినట్టు తమ దృష్టికి రాలేదని కేంద్రం చావు కబురు చల్లగా చెప్పింది. ఇక కేంద్ర పథకాలకు సంబంధించిన తెలంగాణలో నిధులు దారి మళ్లుతున్నాయా ? అయితే ఎన్ని కోట్లను టీఆర్ఎస్ ప్రభుత్వం పక్కదారి పట్టించింది? అని బండి ప్రశ్నిస్తే.. అలాంటిది ఏం జరగలేదని కేంద్రం మళ్లీ తమ సమాధానంతో తుస్సుమనిపించింది. ఇక తాజాగా మిషన్ భగీరథ పథకంపై అయితే కేంద్రం ప్రశంసల వర్షం కురిపించింది.
మిషన్ భగీరథ పథకం దేశానికే స్ఫూర్తిదాయకం అని.. మిగిలిన రాష్ట్రాలు కూడా తెలంగాణను చూసి నేర్చుకోవాలని పార్లమెంట్లో ప్రకటించి దండోరా వేసినంత పనిచేసింది కేంద్రం. ఇలా బీజేపీ, టీఆర్ఎస్ల తీరు చూస్తోంటే.. రాష్ట్రంలోనే వీరి పౌరుషాలే తప్ప.. ఢిల్లీ వెళ్తే అంతా ఒక్కటేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. టీఆర్ఎస్ ప్రభుత్వంపై బీజేపీ అడుగుతున్న ప్రశ్నలు.. ఇరుకున పెట్టడానికి కాకుండా.. టీఆర్ఎస్ గొప్పతనాన్ని చాటి చెప్పేలా ఉంటున్నాయన్న చర్చ జరుగుతోంది. ఈ వ్యవహారం అంతా చూస్తోంటే.. కేంద్రంలో బీజేపీ- టీఆర్ఎస్ మధ్య చీకటి ఒప్పందం ఏదో ఉందన్న అనుమానాలే అందరిలో కలుగుతున్నాయి.