అఫ్ఘనిస్థాన్ దాదాపు తాలిబాన్ల వశమైంది. అధ్యక్షుడే దేశం విడిచి పారిపోవడంతో ఇక వారు హస్తగతం చేసుకోవడం లాంఛనమే కానుంది. ప్రభుత్వం సైన్యం ఇప్పటికే చేతులు ఎత్తేసింది. అయినప్పటికీ.. శాంతియుతంగానే అధికారాన్ని చేపట్టాలని భావిస్తున్నారు తాలిబాన్లు. ఈక్రమంలో అసలు తాలిబాన్ సైన్యాన్ని ఎవరు నడిపిస్తున్నారు.. వారి వెనుక ఎవరు ఉన్నారు? ఎవరి ఆదేశాలను వారు పాటిస్తారనే ఆసక్తి చాలా మందిలో ఉంది.
అసలు తాలిబాన్ వ్యవస్థాపకుడు ముల్లా మహమ్మద్ ఒమర్. తాలిబాన్‌ను శక్తివంతమైన వ్యవస్థంగా తయారు చేసిన ఆయన సెప్టెంబర్ 11, 2001 అమెరికాపై దాడుల తర్వాత ఆయన అజ్ఞాతంలో ఉండిపోయారు. 2013లో ఆయన చనిపోగా… రెండు సంవత్సరాల తర్వాత ఆయన మరణించినట్టు బయటి ప్రపంచానికి తెలిసింది. ఆయన తర్వాత తాలిబాన్‌ను ఆరుగురు ముఖ్యులు నడిపిస్తారని అంతర్జాతీయ మీడియా సంస్థలు చెబుతున్నాయి. వారి వివరాలు.. విధులు ఇలా ఉన్నాయి.
హైబతుల్లా అఖుంజాదా
తాలిబాన్ అత్యున్నత నాయకుడు ఈయన. ఒకరకంగా ఆయన మాటే వేదం. తాలిబాన్ల రాజకీయ, మత, సైనిక వ్యవహారాలపై పూర్తి అధికారాలు ఈయనకే ఉన్నాయి. అఖుంజాదాకు ప్రస్తుతం 60 ఏళ్లు అని చెబుతుంటారు.
2016లో ఆఫ్ఘాన్-పాకిస్తాన్ సరిహద్దుల్లో యూఎస్ వైమానిక దాడుల్లో అప్పటి తాలిబాన్ అధినేత అక్తర్ మన్సూర్ మరణించినప్పుడు.. ఆ తర్వాత ఆయన బాధ్యతలను అఖుంజాదా స్వీకరించారు. ఈయన ఎప్పుడూ పెద్దగా కనిపించరు. గతంలో 15 సంవత్సరాల పాటు అజ్ఞాతంలో ఉండి.. చివరిగా మే 2016 కనిపించారు. ఆ సమయంలో అఖుంజాదా నైరుతి పాకిస్తాన్‌లోని కుచ్‌లాక్ పట్టణంలో ఒక మసీదులో బోధించాడని చెబుతుంటారు. ఇప్పుడు కూడా ఆయన ఎక్కడ ఉన్నారనేది తెలియదు.
ముల్లా మహమ్మద్ యాకూబ్
తాలిబాన్ వ్యవస్థాపకుడు ముల్లా ఒమర్ కుమారుడే ఇతను. యాకూబ్ సైనిక కార్యకలాపాలను పర్యవేక్షిస్తాడు. ప్రస్తుతం ఆఫ్ఘనిస్థాన్‌లో ఉన్నట్టు స్థానిక మీడియా చెబుతోంది. తాలిబాన్ గ్రూప్‌లోవారసత్వ తగాదాలు తలెత్తినపుడు.. అంతా కలిసి ఇతన్నే ఉద్యమ నాయకుడిగా ఎన్నుకున్నారు.
ఓ సమాచారం ప్రకారం.. ముల్లాకు యుద్ధభూమి అనుభవం లేదు. అలాగే చాలా చిన్నవాడు. అతని వయసు ప్రస్తుతం 30 ఏళ్లకుపైబడి ఉండొచ్చని అంచనా. దీంతో అతను సైనిక కార్యకలాపాల బాధ్యతలను అఖుంజాదాకు అప్పగించారు. త్వరలో ఈయన్నే మళ్లీ తాలిబాన్ అధినేతగా ఎన్నుకునే అవకాశముంది.
సిరాజుద్దీన్ హక్కానీ
ముజాహిద్దీన్ సంస్థ కమాండర్ జలాలుద్దీన్ హక్కానీ కుమారుడే సిరాజుద్దీన్. హక్కానీ నెట్‌వర్క్‌కు నాయకత్వం వహిస్తుంటాడు. ఈ విభాగం పాకిస్తాన్-ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దుల్లో తాలిబాన్ల ఆర్థిక, సైనిక ఆస్తులను పర్యవేక్షిస్తుంది.
హక్కానీలోని సభ్యులు ఆఫ్ఘనిస్థాన్‌లో చాలాసార్లు ఆత్మాహుతి బాంబు దాడులకు పాల్పడ్డ ఘటనలు ఉన్నాయి. కొన్నాళ్లుగా ఆ దేశంలో జరుగుతున్న పెద్ద పెద్ద దాడుల వెనుక వీరే ఉన్నారని చెబుతుంటారు. ఆ మధ్య కాబూల్‌లోని టాప్ హోటల్‌పై దాడి, అప్పటి అధ్యక్షుడు హమీద్ కర్జాయ్‌పై హత్యాయత్నం అలాగే భారత రాయబార కార్యాలయంపై ఆత్మాహుతి దాడి వీరు చేసినవేనన్న వాదనలు ఉన్నాయి. సిరాజుద్దీన్ వయస్సు ప్రస్తుతం 40- 50 ఏళ్ల మధ్య ఉండొచ్చని అంచనా. ప్రస్తుతం అతను ఎక్కడ ఉన్నాడో తెలియదు.
ముల్లా అబ్దుల్ ఘనీ బరదార్
తాలిబాన్ సహవ్యవస్థాపకులలో ఒకరియన. ప్రస్తుతం తాలిబాన్ రాజకీయ కార్యాలయానికి నాయకత్వం వహిస్తున్నారు. దోహాలో ఉన్న తాలిబాన్ ప్రతినిధులు బృందంలో కీలకంగా ఉన్న ఈయన.. కాల్పుల విరమణకు, శాశ్వత శాంతికి మార్గం సుగమం చేసే రాజకీయ ఒప్పందానికి ప్రయత్నిస్తున్నారు.బరాదర్, ముల్లా ఒమర్ నమ్మే అత్యంత విశ్వసనీయ కమాండర్‌లలో ఒకరు.
షేర్ మొహమ్మద్ అబ్బాస్ స్టానిక్జాయ్
తాలిబాన్ ప్రభుత్వ తొలగింపునకు ముందు ఇయన మాజీ డిప్యూటీ మంత్రి. స్టానిక్జాయ్ దాదాపు ఒక దశాబ్దం పాటు దోహాలో నివసించారు.2015లో తాలిబాన్ గ్రూప్ రాజకీయ కార్యాలయానికి అధిపతి అయ్యారు. ఆఫ్ఘాన్ ప్రభుత్వంతో చర్చలలో కీలకంగా వ్యవహరించిది ఇతనే. తాలిబాన్ల తరపున ఇతర దేశాల్లో దౌత్య పర్యటనలు చేస్తున్నాడు.
అబ్దుల్ హకీమ్ హక్కానీ
తాలిబాన్లలో మరో ముఖ్యమైన వ్యక్తి ఆయన. ఆప్ఘాన్ ప్రభుత్వంతో జరిపే చర్చల బృందానికి నాయకుడు ఇతను. అఖుంజాదా ఎక్కువగా విశ్వసించే వ్యక్తి కూడా ఈయనే.