– ఏడేళ్లలో చేతులు మారిన 3 లక్షల ఎకరాలు
– కార్డుల్లో నిషేధభూమి..
– ధరణిలో పట్టా భూములుగా చలమణి
– రిజిస్ట్రేషన్ చేసుకుని మరీ రియల్ ఎస్టేట్
– అసైన్డ్ భూముల్లో గులాబీ గ్యాంగ్ అరాచకాలు
– ఒకేచోట ల్యాండ్ బ్యాంకు-తక్కువ ధరతో రెచ్చిపోతున్న మాఫియా
– జీ.వో. 58,59 గడువు పెంపు..ఈ దందా కోసమేనా..!
– అసైన్డ్ దారునికి అమ్ముకునే హక్కు ఎప్పుడు..?
– పొరుగు రాష్ట్రాలను చూసి బుద్ధి తెచ్చుకోరా..?
– అసైన్డ్ భూముల్లో గులాబీ దండు కబ్జాపై..
– తొలివెలుగు క్రైం బ్యూరో స్పెషల్ స్టోరీ పార్ట్ – 3
ఒకనాటి ఏలికలు నిస్వార్థంగా..ప్రజల అవసరాల కోసం..వాళ్ల బతుకుతెరువు కోసం వాళ్లకు భూములు కేటాయిస్తే..నేటి రాజకీయ నాయకులు మాత్రం, మరీ ముఖ్యంగా బంగారు తెలంగాణ పేరుతో తమ కుటుంబాలను బంగారుమయం చేసుకుంటున్నగులాబీ గ్యాంగ్ విచ్ఛలవిడిగా భూకబ్జాలు చేసేస్తోంది. ఏ భూమైనా సరే వీళ్ల కన్నుపడితే అంతే. ఇక అది సర్కారీ భూమైతే వీళ్లకు పండుగే. అలాంటి అసైన్డ్ ల్యాండ్స్ పై సదరు గులాబీ గ్యాంగ్ ఎలా కన్ను వేసిందో..ఎలా అడ్డగోలుగా తమ పేర్లపైకి మార్చుకుని కోట్ల వ్యాపారం చేస్తుందో తొలివెలుగు అందిస్తున్న మరో ప్రత్యేక కథనమిది.
ఇప్పటిదాకా.. ప్రజాప్రతినిధుల చేతిలో ఉన్నప్రభుత్వ భూమిని ఎలా రెగ్యులరైజ్ చేసుకుంటున్నారు.రాములవారి భూముల నుంచి పోడు భూముల వరకు గిరిజనేతరులు ఎలా కబ్జా పెట్టారు.. ఈ తతంగాల వెనుక రాజకీయ ఒత్తిళ్లు ఏంటని గత రెండు కథనాల్లో ఆధారాలతో సహా తొలివెలుగు క్రైంబ్యూరో బట్టబయలు చేసింది. తాజాగా అసైన్డ్ భూములను రాజకీయ పలుకుబడి ఉన్న అధికారపార్టీ నేతలు ఎలా ఇబ్బడిముబ్బడిగా కొనుగోలు చేస్తున్నారో తేటతెల్లం చేస్తోంది తొలివెలుగు క్రైంబ్యూరో.రాష్ట్రంలో 24 లక్షల ఎకరాల అసైన్డ్ భూమి 14 లక్షల మంది రైతుల వద్ద ఉంది. ఇటీవల కాలంలోనే 3 లక్షల ఎకరాలు చేతులు మారాయి.నాయకులు రెవెన్యూ రికార్డులను మార్చి ధరణిలో పట్టా భూములుగా చెప్పుకుంటూ..రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుండటంతో లబ్దిదారుల కళ్ల ముందే అసైన్డ్ భూమి పై కోట్లాది రూపాయలు సంపాదిస్తూ.. చేతులు మార్చేస్తున్నారు.
అసలు అసైన్డ్ అంటే ఏంటి.. ఎవరికి ఇస్తారు.?
భూమి లేని నిరుపేదలు సాగు చేసుకునేందుకు, ఇండ్లు నిర్మించుకునేందుకు ప్రభుత్వం మంజూరు చేసిన భూమిని అసైన్డ్ భూమి అంటారు. దీనిని వారసత్వ సంపదగా అనుభవించాల్సిందే తప్ప..ఇతరులకు అమ్మడం..బదలాయించడం చెల్లదు. పీ.ఓ.టీ యాక్ట్ 1977లో వాటి పరిధి గురించి చాల స్పష్టంగా ఉంది. ఇలా జీవనోపాధిని పొందుతున్నవారిలో అత్యధికంగా దళితులు,గిరిజన కుటుంబాలే ఉన్నాయి.
1958 కంటే ముందు అసైన్డ్ పై టీ.ఆర్.ఎస్ పక్షపాత ధోరణి
ఏ.పి.లో 1954 నుంచి తెలంగాణలో 1958 కంటే ముందు ఎవ్వరైతే అసైన్డ్ భూములు కల్గి ఉన్నారో వారికి పట్టా భూమిగానే పరిగణించి..వారి కుటుంబ అవసరాల నిమిత్తం శాశ్వత హక్కులు ఇవ్వాలని 2012లో ఉమ్మడి రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం రిట్ పిటిషన్ నెంబర్. 30526జ/2012 మరియు 15438జ/2012 ల పై స్పష్టమైన తీర్పునిచ్చింది.అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీ.వో నెంబర్ 575తో 2018న ఉత్తర్వులు ఇచ్చింది.దీంతో సుమారు 2.5 లక్షల ఎకరాల ఆసైన్డ్ భూమి పట్టా భూమిగా మార్చారు. నిషేధిత జాబితా నుంచి తొలగించారు.వారి కుటుంబం ఎవరికైనా అమ్మకం జరుపుకోవచ్చు.మార్కెట్ ధర ప్రకారం ఆయా భూములకు డిమాండ్ ఉంటుంది.కాని తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఇప్పటికీ జీ.వో. జారీ చేయలేదు.అలా చేస్తే సుమారు 2 లక్షల ఎకరాల భూమి వల్ల దళిత,గిరిజనల కుటుంబాలకు న్యాయం జరుగుతుంది. అలా చేయకుండా కేవలం మార్కెట్ రేట్ కంటే 50శాతం తక్కువగా రాజకీయ నాయకులు కొనుగోలు చేసుకుని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నారు. రియల్ ఎస్టేట్ తో వందల కోట్లకు పడగలెత్తుతున్నారు. ఒకవేళ వాళ్లు చెప్పినట్టు వినకుంటే.. భయాందోళనకు గురి చేసి లాగేసుకుంటున్నారు.
ఇతర రాష్ట్రాల్లో అసైన్డ్ భూముల పై హక్కులు ఇలా..!
తెలంగాణకు పక్కనే ఉన్న కర్నాటకలో అసైన్డ్ చేసిన 15 సంవత్సరాలకు వారికి శాశ్వత పట్టాలు ఇస్తారు. అధికారులను నుంచి నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్ పొంది అమ్మకం జరుపుకోవచ్చు. తమిళనాడులో అసైన్డ్ చేసిన తర్వాత 20 సంవత్సరాలకు అమ్ముకునే హక్కులు ఉన్నాయి.మధ్యప్రదేశ్ ,ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాల్లో రైతులకు ఆపద సమయంలో మార్కెట్ రేట్ కు అమ్ముకునేందుకు హక్కులు కల్పించారు. కాని తెలంగాణలో మాత్రం దళిత,గిరిజనుల,బడుగుబలహీన వర్గాలకు 1958 కి ముందు కేటాయించిన భూములను అమ్ముకునే హక్కు ఇవ్వలేదు. అలా ఇవ్వకపోవటం వెనుక కుట్ర కూడా కళ్లకు కట్టినట్టు కనబడుతూనే ఉంది.
రాబోయే ఇన్వెస్టిగేషన్ కథనాలు !
తెలంగాణ ప్రభుత్వం తలచుకుంటే చాలు. తమవాళ్లు అనుకున్నవారికి, తమ అనుయాయుల కోసం ప్రత్యేక జీ.వోలు ఇచ్చిఅసైన్డ్ భూములను బలిసిన దొరలకూ, రియల్ ఎస్టేట్ వ్యాపారులకూ కట్టబెడుతుంది. ఎవ్వరు పొజిషన్ లో ఉంటే వారికే అంటూ..లీకులు ఇచ్చి క్రమబద్దీకరణ చేస్తామని హామీలు ఇచ్చింది. దీంతో 1958 కంటే ముందు ఉన్న భూములకు క్లియరెన్స్ ఇవ్వకుండా.. గత ప్రభుత్వాలు ఇచ్చిన లక్షాలాది ఎకరాల భూములను తక్కువ ధరకు కొల్లగొట్టి అగ్రవర్ణాలకు మేలు చేసేలా ప్రయత్నాలు మొదలయ్యాయి.సంగారెడ్డి జిల్లాలో అసైన్డ్ భూములు ఎలా కబ్జా చేసుకున్నారు.ఉమ్మడి వరంగల్ లో టీ.ఆర్.ఎస్. నేతల పాత్ర ఎంటి..? మహబూబ్ నగర్ లో ఎలా కొనుగోలు చేస్తున్నారు. ఒకే చోట అసైన్డ్ భూమి బల్క్ గా దొరకడంతో ఏ ఏ లీడర్స్ ఎన్నివందల ఎకరాలు బినామి పేర్లతో తీసుకుని రాబోయే రోజుల్లో ఎలా రెగ్యులరైజ్ చేసుకోబోతున్నారో..అందుకు ఎవరెవరు..ఎలాంటి కుట్రలు చేశారో, తొలివెలుగు క్రైం బ్యూరో మీ ముందు ఉంచబోతోంది.
అంతేకాదు.. అసైన్డ్ భూమి కొంటే ఎలాంటి కేసులు పెట్టవచ్చో..వారికి ఎలాంటి శిక్షలు పడతాయో పార్ట్ 4 లో చూద్దాం.