తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ పేరు అనౌన్స్ చేయగానే.. హైకమాండ్ మంచి నిర్ణయం తీసుకుందని పార్టీ శ్రేణులు తెగ ఖుషీ అయ్యాయ్. మంచి ఫైర్ ఉన్న లీడర్‌నే లైన్‌లో పెట్టిందని.. పార్టీ ఇక గాడీలో పడ్డట్టేనని సంబరపడ్డాయ్. బండి సంజయ్ ఊపు చూసి.. వచ్చే ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించడం ఖాయమేనంటూ అనేక విశ్లేషణలు వినిపించాయి. అయితే తెలంగాణ బీజేపీ రథసారథిగా సంజయ్‌ని నియమించి హైకమాండ్ రైట్ డెసిషనే తీసుకున్నా.. సంజయ్ మాత్రం తన సైన్యాన్ని ఏర్పాటు చేసుకోవడంలో తడబడ్డారంటున్నారు విశ్లేషకులు.
బండి సంజయ్ ప్రకటించిన బీజేపీ తెలంగాణ రాష్ట్ర కొత్త కమిటీ అస్సలు బ్యాలెన్స్ కాలేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. కొత్త కమిటీలో సంజయ్ యువతకు పెద్దపీఠ వేయాలనుకోవడం సరైన నిర్ణయమే అయినా.. ఇందులో చాలా మంది జనానికి తెలియని వారు కావడం మైనస్ అయ్యే అవకాశాలున్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
రాజకీయాల్లో డైలాగ్ వార్ అనే ప్రాసెస్ చాలా ఇంపార్టెంట్. ఓ లీడర్ మైక్ ముందు ఎంత బాగా మాట్లాడారు అనేది ఒక్కటే ప్రధానం కాదు..అతనికి ప్రజల్లో ఎంత ఇమేజ్ ఉన్నదన్నది కూడా ఎంతో ముఖ్యం. సాధారణంగా అధికార పార్టీ నేతల నుంచి ఎన్ని ఎక్కువ కౌంటర్లు పడితే అపొజిషన్ అంత బలంగా ఉన్నట్టు ఓ లెక్క. కానీ బీజేపీ కొత్త కమిటీ చూస్తోంటే.. ఇందులో కొందరు ప్రభుత్వాన్ని తిట్టిపోసినా.. అధికార పార్టీ నుంచి తిరిగి తిట్టించుకునే ఇమేజ్ కూడా లేదన్న కామెంట్లు వినిపిస్తున్నాయి.
మాజీ మంత్రులు డీకే అరుణ, బాబుమోహన్, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి వంటి చాలా మంది సీనియర్లు ప్రస్తుతం బీజేపీలోనే ఉన్నారు. కమలం గుర్తుపై గత ఎన్నికల్లో పోటీ చేసి దురదృష్టవశాత్తు ఓటమిపాలైనా…వీరంతా బలమైన నేతలు. కానీ తాజా కమిటీలో వీరెవ్వరికీ చోటు దక్కకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఈ సీనియర్లను జాతీయ కమిటీలోకి తీసుకుంటారని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతున్నప్పటికీ.. ముందు రాష్ట్రంలో పార్టీ బలోపేతం చేయడం మానేసి వారిని అక్కడికి పంపడం ఎందుకన్న ప్రశ్నలూ వినిపిస్తున్నాయి. ఏదేమైనా కొత్త సైన్యంతో బండి సంజయ్.. కాకలు తీరిన కారుయోధులను ఢీకొట్టడం కష్టమేనంటున్నారు విశ్లేషకులు. బండి… బీజేపీ కొత్త బండితో ఎలా ముందుకెళ్తారో చూడాలి మరి !