– ఐటీ దాడుల తర్వాత రెచ్చిపోతున్నగులాబీ బీ టీం
– మొన్న మైహోం.. నిన్న ఫినిక్స్, మేఘా.. నేడు కేఎన్ఆర్
– బ్లాక్ మనీ దారి మళ్లించే అడ్డాగా రియల్ ఎస్టేట్
– శేరిలింగంపల్లిలో వెయ్యి కోట్ల భూమి కబ్జాకు ప్లాన్
– కేఎన్ఆర్ కి అన్నీ క్లియర్ చేస్తున్న గులాబీలు
– అధికార పక్షం తీరుతో నివ్వెరపోతున్న జనాలు
ప్రజాస్వామ్య పద్దతిలో గెలిచిన నాయకుడంటే ఎలా ఉండాలి.. అందర్నీ సమానంగా చూసుకుంటూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథాన నడిపించాలి. అదేంటో.. తెలంగాణలో మాత్రం రివర్స్ లో జరుగుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఓవైపు ప్రభుత్వం భూములు అమ్మేస్తున్నారు.. వాటిని కూడా సొంతవారికే కట్టబెడుతున్నారు. ఇంకోవైపు అప్పులు తెచ్చి ప్రాజెక్టుల పేరుతో దోచుకుంటున్నారు.. ఇంకోవైపు సర్కార్ బండిని నడిపించేందుకు పన్ను రూపంలో సామాన్యుడి జేబు ఖాళీ చేస్తున్నారని కేసీఆర్ సర్కార్ ను ప్రతిపక్షాలు తిట్టిపోస్తున్నాయి. ముఖ్యంగా భూముల విషయంలో ప్రభుత్వ తీరుపై ఆందోళనకరంగా ఉందని అంటున్నాయి. తమ కాంట్రాక్టర్లు, బినామీలను లిటిగేషన్ భూములపై ఎగదోస్తోందని ఆరోపిస్తున్నాయి.
వంద రూపాయలు పెట్టుబడితో వెయ్యి రూపాయలు సంపాదించిన తీరుగా.. లిటిగేషన్ సైట్స్ మాటున కాంట్రాక్టర్లు, బినామీలను రంగంలోకి దింపి డబ్బు మూటలు వెనకేసుకుంటోందని కేసీఆర్ సర్కార్ పై విరుచుకుపడుతున్నాయి ప్రతిపక్షాలు. దానికోసం సర్కార్ సైడ్ నుంచి ఎలాంటి ఉత్తర్వులు కావాలో తీసుకోవాలని ఆఫర్స్ కూడా ఇస్తున్నట్లుగా చెబుతున్నాయి. గత మూడేళ్లుగా జరుగుతున్న తంతుపై ఆరా తీస్తే.. ఫినిక్స్ కంపెనీకి 14 ప్రాజెక్ట్స్ లో ప్రభుత్వం మేలు చేసేలా వ్యవహారించిందని వివరిస్తున్నాయి. అలాగే మైహోం సంస్థకు అసైన్డ్ భూములను రైతుల వద్ద నుంచి అప్పనంగా ఇచ్చేసిందని.. ఇక మేఘా కంపెనీ ఏది కోరుకుంటే అది బంగారు పళ్లెంలో పెట్టి ఇస్తోందని చెబుతున్నాయి. ఈ కంపెనీల దోపిడీ చాలదన్నట్లు.. కేఎన్ఆర్ కన్సస్ట్రక్షన్ కూడా సైబరాబాద్ లో వివాదాస్పద భూమి కోసం సై అంటోంది. అన్ని వ్యవస్థలను అక్రమంగా వాడుకొని అత్యంత విలువైన భూమిని కోట్టేయాలని చూస్తోందని అంటున్నాయి ప్రతిపక్షాలు.
కేఎన్ఆర్ మ్యాటర్ ఏంటంటే?
ఆ భూమి రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లిలో ఉంది. అత్యంత ఖరీదైన భూమి ఇది. ఒక వైపు సెంట్రల్ యూనివర్సటీ మరోవైపు ప్రపంచ స్థాయికి చెందిన ఐటీ కంపెనీలు ఉన్నాయి. 1961లోనే అల్యూమినియం ఇండస్ట్రీ పెట్టేందుకు 45 ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించింది. స్థలం సరిపోకపోవడంతో 1967లో మరో ఎనిమిది ఎకరాలు కావాలని విన్నవించుకోగా.. ప్రభుత్వం ప్రైవేట్ వ్యక్తుల వద్ద నుంచి కొనుగోలు చేసుకుని మొత్తం 53 ఎకరాలు ఆల్దీవ్ కంపెనీకి ఇచ్చేసింది. సర్వే నెంబర్ 90 నుంచి 96 వరకు ప్రభుత్వం ఇవ్వగా.. 99/1, 99/2, 100/1, 100/2, 101/1, 101/2, 101/3లో కొనుగోలు చేసుకున్నారు. మొత్తం కలిపి 98 ఎకరాల భూమికి 1970లో చుట్టూ పహరీ గోడ నిర్మించుకుని కార్మికులు, ఉద్యోగుల కోసం క్వార్టర్స్ కూడా కట్టుకున్నారు. ఇందులోని 15 ఎకరాల స్థలాన్ని తాము కోనుగోలు చేశామని 52 ఏళ్ల తర్వాత చెప్తున్నారు.
ఒక్కో కంపెనీకి ఒక్కో తీరు
తన బీ టీంకి భూములు ఇస్తే ఒక రకంగా.. లేకుంటే మరో రకంగా టీఆర్ఎస్ సర్కార్ వ్యవహరిస్తోందని ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికే ఇలాంటి కంపెనీలకు ఇచ్చి వేల ఎకరాల భూములను తన బినామీలకు క్లియర్ చేసిందని ప్రతిపక్ష నేతలు విమర్శలు చేస్తున్నారు. పటాన్ చెరులోని కోకకోలా కంపెనీ భూముల మొదలు ఐడీఎల్, ఐడీపీఎల్ భూములను సైతం అప్పనంగా బంగారు ప్లేట్ లో పెట్టి ఇచ్చిందని ఆరోపిస్తున్నారు. వాటి విలువ లక్షల కోట్ల వరకు ఉంటుందని వివరిస్తున్నారు. ఇదే క్రమంలో తొలివెలుగు క్రైంబ్యూరో ఆరా తీయగా.. తీగ లాగితే డొంకంతా కదిలింది. ఆధారాలతో సహా అన్ని వివరాలు దొరికాయి. శేరిలింగంపల్లిలోనివి కంపెనీ భూములు. వాటిని ప్రభుత్వం కేటాయించింది. ఆ భూములను ఎవరూ అమ్ముకోకూడదని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. ముంబై బెస్ట్ కంపెనీ నుంచి తాము కొనుగోలు చేశామని చెప్పుకుంటున్న కేఎన్ఆర్ సంస్థ.. 52 ఏళ్లుగా ఎక్కడ కోర్టుల్లో కేసులు వేయకుండా.. కనీసం పొజిషన్ పై అర్జీలు కూడా పెట్టుకోకుండా.. ఏకంగా కబ్జా చేసేందుకు బుల్డోజర్స్, ట్రక్కులతో వెళ్లి కబ్జా పెట్టింది. భూముల్లో మట్టిపోసి తమదేనని రౌడీయిజం చేస్తోంది. ప్రభుత్వ పెద్దల హస్తంతో స్థానిక టీఆర్ఎస్ ఎమ్మెల్యే అండదండలతో ఈ వ్యవహారం జరుగుతోంది.
కార్పొరేట్ కబ్జా ఎలా ఉంటుందంటే..?
50 ఏళ్లకు పైగా అక్కడ క్వార్టర్స్ లో కొందరు ఉంటున్నారు. ఇప్పుడు కేఎన్ఆర్ కబ్జా తర్వాత భూమి తమదే అంటూ కంచె వేశారు. ఫిజికల్ పొజిషన్ లేకుండానే అక్కడ నివాసం ఉండే వారిని ఇండ్లలోకి వెళ్లనివ్వడం లేదు. ఇళ్లు ఖాళీ చేయాల్సిందేనని రాత్రి, పగలు వచ్చి హెచ్చరిస్తున్నారు. కరెంట్, నీళ్లు నిలిపివేశారు. డ్రైనేజ్ పైప్ లైన్ లు పగులగొట్టి అక్కడ నుంచి వెళ్లిపోయేలా ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఇన్ని జరుగుతున్నా పోలీసులు, రెవెన్యూ అధికారులు గులాబీ నోట్ల మత్తులో మూలుగుతున్నారు తప్ప చట్టాన్ని గౌరవించడం లేదు. మీకు ఇంకా క్లియర్ గా చెప్పాలంటే.. రఘువరన్ సినిమాలో చిన్న భూమి కోసం కార్పొరేట్ కంపెనీ ఓ సామాన్యుడిని ఎలా వేధిస్తుందో.. అచ్చం అలాంటి సీనే ఇక్కడ జరుగుతోంది.