దర్శనం మొగులయ్య.. ఈ పేరు పెద్దగా ఎవరికి తెలయదేమో. కిన్నెర మొగులయ్య అంటేనే గుర్తు పడతారేమో. కిన్నెర పాటలతో ఎంతోమందిని ఆకట్టుకున్నారు. ఆఖరికి కేంద్ర ప్రభుత్వాన్ని కూడా తన నైపుణ్యంతో మెప్పించారు. ఈ ఏడాది పద్మ పురస్కారాల్లో మొగులయ్యకు పద్మశ్రీ వరించింది.
నాగర్ కర్నూల్ జిల్లా అవుసపల్లి గ్రామానికి చెందిన కిన్నెర వాద్య కళాకారుడు మొగులయ్య. కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డ్ కు ఎంపిక కావడంతో ఒక్కసారిగా ఆయన పేరు తెలుగు రాష్ట్రాల్లో మార్మోగుతోంది. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న ఆయనకు జనసేన అధ్యక్షుడు, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా రూపొందుతున్న చిత్రం ‘బీమ్లా నాయక్’లో టైటిల్ సాంగ్ పాడే అవకాశం వచ్చింది. పవన్ కూడా కాస్త ఆర్థిక సాయం చేశారు.
మొగులయ్యకు ఎంతగా ప్రాముఖ్యత వచ్చినా పేదరికంలో కొట్టుమిట్టాడుతున్నారు. సైదాబాద్ సింగరేణి కాలనీ గుడిసెలో పది మంది కుటుంబ సభ్యులతో జీవనం సాగిస్తున్నారు. ఈయనను ముందుగా ప్రభుత్వ సలహాదారు రమణాచారి, సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ గుర్తించారు. సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. ఆ తర్వాత ప్రభుత్వ ఉగాది పురస్కారంతో ఘనంగా సత్కరించారు. పన్నెండు మెట్ల కిన్నెర ప్రాముఖ్యం నేటి తరానికి తెలిసేలా ఎనిమిదో తరగతి విద్యార్థులకు పాఠ్యాంశంలో చేర్చింది ప్రభుత్వం.
కరోనా పరిస్థితుల్లో ఊరూరా ప్రదర్శనలు ఇవ్వలేక మొగులయ్య కుటుంబ పోషణకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కొద్ది నెలల క్రితం ప్రభుత్వం స్పందించి నెలకు రూ.10వేల చొప్పున పెన్షన్ మంజూరు చేసింది. ఇప్పుడు కేంద్రం పద్మశ్రీతో సత్కరించనుంది.
ఇటు పద్మ పురస్కారానికి మొగులయ్య ఎంపిక కావడంపై పవన్ కల్యాణ్ సంతోషం వ్యక్తం చేశారు. తెలుగువారి తరఫున జనసేన పక్షాన హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.