ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చేసింది. కార్పొరేటర్ సీటులో కూర్చుంటామా అని తహతహలాడుతున్న నేతల కోరిక ఎట్టకేలకు తీరబోతోంది. అయితే ఇన్నాళ్లు ఏ ప్రమాణ స్వీకారం కోసమైతే ఎదురుచూశారో.. ఇప్పుడదే కార్యక్రమం కొత్త కార్పొరేటర్లను వణికిస్తోంది. ప్రమాణ స్వీకార ముహూర్తం ఏ మాత్రం బాగోలేదని నేతలంతా వణికిపోతున్నారు. ఐదేళ్లపాటు ఉండాల్సిన పదవి కోసం .. పోయి పోయి అమావాస్య రోజు పెట్టడమేంటని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆదిలోనే ఎదురైన ఈ అపశకునం.. భవిష్యత్తులో ఎలాంటి ఉపద్రవాన్ని తెచ్చిపెడుతుందోనని వారు ఆందోళన చెందుతున్నారు.
ఇప్పటికే గ్రేటర్ ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాలేదు. కావాల్సిన బలం లేకపోయినా అధికార పార్టీ మేయర్, డిప్యూటీ మేయర్లను నిలబెడుతోంది. దీంతో పాలక మండలిలో ఎప్పుడు ఎలాంటి ముసలం పుడుతుందో.. తమ పదవులకు గండం ముంచుకొస్తుందోనని టెన్షన్‌పడుతున్నారు. ఇప్పటికే ప్రమాణ స్వీకార ముహుర్తంపై అభ్యంతరాలను అధికారుల దృష్టికి తీసుకెళ్లాయి పార్టీలు. కానీ అది ఈసీ నిర్ణయమని, తామేం చేయలేమని వారు చేతులెత్తేశారు. కనీసం.. రాహుకాలం ముగిసేంత వరకైనా ఆగాలని కోరారు. కానీ అధికారులు దానిపై కూడా ఏ హామీ ఇవ్వలేకపోయారు. దీంతో కార్పొరేటర్లే గుండె రాయి చేసుకొని.. ప్రమాణస్వీకారానికి సిద్దమవుతున్నారు.