– కేంద్రంపై కేసీఆర్ యుద్ధం నిజమేనా?
– లేక.. అంతా మ్యాచ్ ఫిక్సింగా?
– ఆస్కార్ లెవల్ లో అంతా నటిస్తున్నారా?
– శిలాఫలకంపై కేసీఆర్ పేరు ఎందుకు లేదు?
– కేసీఆర్ రారని చినజీయర్, రామేశ్వరరావుకు ముందే తెలుసా?
సమతామూర్తి విగ్రహం చుట్టూ ఎంతటి వివాదం నడిచిందో చూశాం. సరిగ్గా ప్రధాని వచ్చే టైమ్ కి కేసీఆర్ జ్వరమంటూ డుమ్మా కొట్టారు. తలసాని శ్రీనివాస్ ను పంపి ఒకరోజు గ్యాప్ తర్వాత యాదాద్రి వెళ్లారు. అరె.. అంతలోనే జ్వరం తగ్గిందా? అనే సందేహాలు, తిట్లు ఎన్నో వినిపించాయి. అయితే.. ప్రస్తుతం సమతామూర్తి శిలాఫలకంపై అటు రాజకీయ వర్గాల్లో ఇటు టీఆర్ఎస్ శ్రేణుల్లో చర్చ జరుగుతోంది.
సమతామూర్తి విగ్రహావిష్కరణ సందర్భంగా ఓ శిలాఫలకాన్ని ఏర్పాటు చేశారు. దానిపై ఏమున్నాయని చూస్తే.. మోడీ, చినజయర్ ఫోటోలు కనిపించాయి. అలాగే ప్రధాని పేరుతో పాటు రామేశ్వరరావు అండ్ ఫ్యామిలీ అని ఉంది. కేసీఆర్ ఫోటోగానీ, పేరుగానీ ఎక్కడా కనిపించలేదు. దీంతో అనేక అనుమానాలు తెరపైకి వస్తున్నాయి. నిజానికి ఏదైనా శిలాఫలకాన్ని ఏర్పాటు చేయాలంటే చాలారోజుల ముందే రెడీ చేస్తారు. సమతామూర్తి విగ్రహ శిలాఫలకం మీద కేసీఆర్ పేరు లేదు. అంటే.. అంటే ఆయన ఈ కార్యక్రమానికి రారని ముందే తెలుసా? అనే ప్రశ్న బలంగా వినిపిస్తోంది.
మోడీ పర్యటనకు రెండు రోజుల ముందు ప్రెస్ మీట్ లో పీఎంకు స్వాగతం చెప్తానన్న సీఎం.. సడెన్ గా రాకపోవడం వెనుక ఏ కారణం ఉందనే దాని చుట్టూ అనేక ప్రశ్నలు వినిపిస్తున్నాయి. చినజీయర్, రామేశ్వరరావు ముందే డిసైడ్ అయి కేసీఆర్ ను పిలవొద్దని అనుకున్నారా? లేక ఇదంతా నటనా? మోడీకి, కేసీఆర్ కి మధ్య దూరం ఉందని చూపించే డ్రామానా? ముందే తెలిస్తే నేనే వెళ్లి ఆహ్వానిస్తానని కేసీఆర్ ఎందుకన్నారు? పైగా ఈ కార్యక్రమం కోసం ఎన్నో చెట్లు నరికించారు.. ఏర్పాట్లపై రివ్యూ చేశారు కేసీఆర్. మరి.. అప్పటికే శిలాఫలకంలో పేరు లేదని తెలిసుండాలి. అయినా చేశారు. మరి.. ఇదంతా ప్లానా? అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.
టీఆర్ఎస్ వర్గాల్లో వినిపిస్తున్న ప్రశ్నలు
1. కేవలం మోడీని మాత్రమే కార్యక్రమానికి పిలవాలని చినజీయర్, రామేశ్వరరావు భావించారా?
2. మోడీ మాత్రమే వచ్చే కార్యక్రమానికి.. కేసీఆర్ ను రావొద్దని చినజీయర్, రామేశ్వరరావు చెప్పారా?
3. చెట్లు నరికించారు.. రోడ్లు వేయించారు.. ఈ కార్యక్రమంలో తన పేరు లేదని తెలియక చెప్పులు విప్పి, చొక్కా చింపుకుని కార్యక్రమం విజయవంతానికి నానా పాట్లు పడ్డారా?
4. కార్యక్రమంలో తన పేరు లేదన్న విషయం ఒకరోజు ముందు మాత్రమే తెలిసి కేసీఆర్ హర్టయ్యారా?
5. అసలు.. తనకు జ్వరం వచ్చిందని.. మోడీకి కనపడకూడదని కేసీఆర్ కు ఎప్పుడు అనిపించింది?
6. శిలాఫలకంలో తన పేరు లేదని కేసీఆర్ కు ఎప్పుడు తెలిసింది?
7. నెలల క్రితం తయారైన శిలాఫలకంలో సారు పేరు లేకపోవడం జర్నలిస్టులకు, సామాన్య ప్రజలను వేధించే ఇంటెలిజెన్స్ వారికి కనిపించ లేదా?
8. కార్యక్రమానికి కేసీఆర్ రారని చినజీయర్, రామేశ్వరరావుకి ముందే తెలుసు.. ఈ విషయం ముందుగా తెలియని కేసీఆర్ ఆఖరి నిమిషంలో అలకపాన్పు ఎక్కారా?
9. మోడీకి, కేసీఆర్ ఏదో ఆత్మీయ బంధం ఉందని సగటు తెలంగాణ పౌరుడిని అనుమానం రాదా?
ప్రస్తుతం ఈ ప్రశ్నలపై బలంగా చర్చ జరుగుతోంది. మరి.. వీటికి చినజీయర్, రామేశ్వరరావు మాత్రమే సమాధానాలు చెబుతారని అంటున్నారు రాజకీయ పండితులు.