– కేసీఆర్ పెద్ద అవినీతిపరుడన్న ఆప్ నేతలు
– టీఆర్‌ఎస్ సర్కార్ ను కూల్చుతామని ప్రకటనలు
– నానా తిట్లు తిట్టిన పార్టీ నేతల్నే కలిసిన కేసీఆర్
– కేజ్రీవాల్ సూపర్ అంటూ కితాబు!
– ఇంతకీ.. ఇద్దరిలో ఎవరు తగ్గినట్టు!
ఒకే ఒరలో రెండు కత్తులు ఇమడవనేది పెద్దల మాట. మరి.. కేసీఆర్, కేజ్రీవాల్ ఒకటి కావడం అంటే మామూలు విషయం కాదు. ఎందుకంటారా? వారు విభిన్న ధృవాల మాదిరి. కానీ.. ఇద్దరి ఆశ, లక్ష్యం ఒక్కటే. జాతీయ రాజకీయాలు అని తిరుగుతున్న కేసీఆర్ ఏ విధంగా ప్రధాని కావాలని చూస్తున్నారో.. కేజ్రీవాల్ కూడా అవే అడుగులు వేస్తున్నారని చెబుతున్నారు రాజకీయ పండితులు. అయితే.. కేసీఆర్ తో తనకు ఎప్పటికైనా ఇబ్బందేనని గ్రహించిన కేజ్రీవాల్.. తన పార్టీ నాయకుల ద్వారా తెలంగాణ సీఎంను టార్గెట్ చేయించారనే విమర్శలు ఉన్నాయి. ఈ క్రమంలోనే కేసీఆర్ పెద్ద అవినీతిపరుడని మాట్లాడడం.. ప్రభుత్వాన్ని కూల్చేస్తామని ఆప్ నేతలు హడావుడి చేయడం చూశామని గుర్తు చేస్తున్నారు. కానీ.. సడెన్ గా వీరిద్దరూ వేదికను పంచుకోవడం చర్చనీయాంశంగా మారింది.
జాతీయ పర్యటనలో భాగంగా వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పోరాడి చనిపోయిన రైతులు, బార్డర్ లో మరణించిన జవాన్లకు ఆర్థిక సాయం అందజేశారు సీఎం కేసీఆర్. ఇచ్చింది పంజాబ్ రైతులకు కాబట్టి అక్కడ ఉన్న ఆప్ ప్రభుత్వాన్ని ప్రసన్నం కేసుకోవాల్సిందే. లేకపోతే పని జరగదు. అందుకే నానా తిట్లు తిట్టిన పార్టీ దగ్గరకే వెళ్లారు కేసీఆర్. నిజానికి కేసీఆర్ టూర్ ను పంజాబ్ సీఎం తిరస్కరిస్తూ వస్తున్నారు. చాలా రోజులుగా దీనిపై చర్చలు సాగుతూ వచ్చాయి. అయితే.. ఆయన కేజ్రీవాల్ అనుమతి కోసం ఎదురుచూస్తూ వచ్చారు. దీన్ని గ్రహించిన కేసీఆర్.. కేజ్రీవాల్ ను కలవడం.. మీ ప్రభుత్వం సూపర్, బంపర్ అంటూ కితాబు ఇవ్వడం చేశారు. దీంతో కేజ్రీ మనసు ఉప్పొంగి.. కేసీఆర్ చండీగఢ్ టూర్ కు పచ్చజెండా ఊపారని చెబుతున్నారు విశ్లేషకులు.
గత ఢిల్లీ పర్యటన సమయంలో కేజ్రీవాల్ ను కలిసేందుకు కేసీఆర్ తెగ ప్రయత్నించారు. కానీ.. ఆయన బిజీ బిజీ అంటూ తిరస్కరించారు. సీన్ కట్ చేస్తే.. 24 గంటలు తిరగకముందే కేసీఆర్ పై తీవ్ర ఆరోపణలు చేశారు ఆప్ నేతలు ఆయనంత అవినీతి సీఎం ఎవరూ లేరని ధర్నాలు, నిరసనలు ఇలా చాలా హడావుడి జరిగింది. దీంతో ఇద్దరి మధ్య వార్ పీక్స్ కు చేరుతుందని అంతా భావించారు. కానీ.. అప్పటికే కేసీఆర్ సాయంపై అనౌన్స్ మెంట్ చేశారు. దానివల్ల కేజ్రీవాల్ ను కలవడం అనివార్యమైంది. చేసేదేం లేక, మనసు ఒప్పకపోయినా.. రాజకీయ మైలేజ్ కోసం ఢిల్లీ సర్కార్ ను పొగిడేసి.. అక్కడి విద్యావిధానం భేష్ అంటూ కితాబిచ్చి.. తన పని జరిపించుకున్నారని అంచనా వేస్తున్నారు విశ్లేషకులు.
ఇక్కడ ఇంకో చర్చ ఏంటంటే.. చెక్కుల పంపిణీ అయితే జరిగింది.. కానీ.. ఇంత సాయం చేసిన కేసీఆర్ ను కేజ్రీవాల్ మాటవరుసకు కూడా పెద్దగా పొగడలేదు. రైతు ఉద్యమం గురించే అధికంగా మాట్లాడారు. దీన్నిబట్టి ఎవరు తగ్గారో అర్థం చేసుకోవాలని అంటున్నారు విశ్లేషకులు. ఇటు జాతీయ రాజకీయాల్లో ప్రాధాన్యం కోసం తహతహలాడుతున్న కేసీఆర్.. తెలంగాణ రైతుల్ని గాలికొదిలేసి ఇతర రాష్ట్రాల వారికి సాయం చేయడాన్ని తప్పుబడుతున్నారు. ఇటీవలి కాలంలో రోజుకు ఇద్దరు వరకు రైతులు చనిపోయిన రికార్డులు ఉన్నాయి. కానీ.. కేసీఆర్ ఏ కుటుంబాన్నయినా పరామర్శించారా? అంటే నో కామెంట్. వారిని ఆదుకున్నారా? పంటకు బీమా అందుతుందా? నష్టపరిహారం చేరుతుందా? ఇలా ఏది అడిగినా నో కామెంట్ అనే పరిస్థితి ఉందని వివరిస్తున్నారు. కేవలం తన స్వార్ధం కోసం మాత్రమే కేసీఆర్ చెక్కుల పంపిణీ చేశారని అంటున్నారు. అదికూడా తనను తిట్టిన పార్టీ దగ్గరకు వెళ్లి మరీ తల వంచారని విశ్లేషణ చేస్తున్నారు రాజకీయ పండితులు.