కొడంగల్ నియోజకవర్గంలో పోలీసుల ఆగడాలు మితిమీరుతున్నాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. స్థానిక ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి సపోర్ట్‌తో పోస్టింగ్ తెచ్చుకున్న కొందరు ఖాకీలు.. ఉద్యోగాన్ని కూడా పక్కనబెట్టి ఇసుక దందాలు, ఇతర అక్రమాలే ఎక్కువ చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికార పార్టీ నేతల అండాదండలు ఉండటంతో.. కొడంగల్‌లో పోలీసులు ఆడిందే ఆట, పాడిందే పాటగా మారిందని స్థానికులు చెప్పుకుంటున్నారు.
మరోవైపు అధికార పార్టీ చేస్తున్న సాయానికి కృతజ్ఞతగా.. పోలీసులు కొడంగల్ నియోజకవర్గంలోని కాంగ్రెస్ నేతలను టార్గెట్ చేయడమే పనిగా పెట్టుకున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా నారాయణపేట్ జిల్లాలో ఉన్న మద్దూర్, కోస్గి పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్సైలు, సీఐ పోటీపడుతూ తమ స్వామిభక్తిని చాటుకుంటున్నారని పలువురు విమర్శిస్తున్నారు. మరోవైపు మద్దూరు, కోస్గి పోలీసుల ఆగడాలు, అక్రమాలపై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసిన ఫలితం లేకుండాపోతోందని స్థానిక కాంగ్రెస్ నేతలు వాపోతున్నారు. విచారణ చేయిస్తా అని ఎస్పీ హామీ ఇస్తున్నా.. అడుగు ముందుకు పడలేదని వారు ఆరోపిస్తున్నారు.
కొడంగల్ ఎమ్మెల్యేగా పట్నం నరేందర్ రెడ్డి గెలిచిన తరువాత.. ఇసుక అక్రమ రవాణాతో సహా సహా ప్రతి పనిలో కమిషన్ తీసుకోవడం తప్పనిసరిగా మారిందన్న ఆరోపణలు ఎప్పటి నుంచో ఉన్నాయి. తన మాట విననివాళ్లను, తన దోపిడి గురించి ప్రశ్నించిన వాళ్లను కేసుల పేరుతో బెదిరించి లొంగదీసుకుంటున్నారని, దానికి స్థానిక పోలీసులు పూర్తిగా సహకరిస్తున్నారని కాంగ్రెస్ నేత తిరుపతి రెడ్డితో సహా పలువురు స్థానికులు ఆరోపిస్తున్నారు. కోస్గి సీఐతో పాటు కోస్గి ఎస్సై, అలాగే మద్దూర్ ఎస్సై.. ఈ ముగ్గురూ ఇసుకతో పాటు ప్రతిపనిలో కమిషన్ తీసుకొని .. అందులో కొంత నరేందర్ రెడ్డికి ముట్టచెప్తున్నారని స్థానిక కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారు. ఇక నియోజకవర్గంలో ఏ పని చేపట్టాలన్నా.. ముందు టీఆర్ఎస్ కండువా కప్పుకోవాలని మద్దూర్, కోస్గి పోలీస్ సిబ్బంది భయపెడుతున్నారని ఆరోపిస్తున్నారు.
కోస్గి మండలంలోని హకీంపేట్, పోలేపల్లి గ్రామాల్లో చేపలు పట్టే విషయంలో కూడా స్థానిక ఎస్సై, సీఐ వ్యవహారశైలిపై విమర్శలు వస్తున్నాయి. హకీంపేట్ గ్రామంలోని పట్టా భూముల్లో ఉన్న కుంటల్లో కూడా స్థానిక ఎస్సై దగ్గర ఉండి పట్టాదారుకు సంబంధం లేకుండా వేరే వాళ్ళతో చేపలు పట్టించడం పెద్ద దుమారమే రేపింది .స్థానిక ఎస్పీకి కలెక్టర్ కు ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదనే విమర్శలు ఉన్నాయి. ఏడీ స్థాయి వ్యక్తికి లంచాలు ముట్టజెప్పి.. పట్టా భూముల్లో ఉండే కుంటల్లో కూడా చేపలు పట్టుకునేందుకు స్థానిక పోలీసులు సహకరిస్తున్నారని అంటున్నారు. ఇక పోలెపల్లి గ్రామంలో చేపలు పట్టే విషయంలో జరిగిన చిన్న గొడవలో స్థానిక ఉండే ఇద్దరు యువకులపై 307 కింద కేసు నమోదు చేసి.. వాళ్లను అరెస్ట్ చేయడానికి పోలీసులు ఏకంగా టీములనే ఏర్పాటు చేయడంపై చర్చకు దారి తీసింది. వాస్తవానికి ఆ యువకులు సోషల్ మీడియా వేదికగా కొడంగల్‌లో జరుగుతున్న అవినీతిని ప్రశ్నిస్తుంటారని.. అందుకే వాళ్లపై చేపల గొడవను సాకుగా చూపి హత్యాయత్నం కేసు బుక్ చేశారు అనే వాదన ఉంది.
రాష్ట్రంలో ఫ్రెండ్లీ పోలీసింగ్ డీజీపీ గొప్పగా చెప్తున్నా.. కొడంగల్‌లో మాత్రం అది దోపిడీ, దౌర్జన్యాలకు కేరాఫ్‌గా మారిందని స్థానికులు వాపోతున్నారు. జిల్లాకు ఎస్పీ, కలెక్టర్‌గా ఇద్దరు మహిళలే ఉన్నారని గర్వంగా చెప్పుకుంటామని.. కానీ కనీసం వాళ్లు జోక్యం కూడా చేసుకోకపోవడం బాగాలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు ఫ్రెండ్లీ పోలీసింగ్ అక్కర్లేదని.. తమ పనిని తాము సక్రమంగా చేసుకోనిస్తే చాలని వారంతా కోరుతున్నారు.