మెఘా కృష్ణారెడ్డి.. ప్రస్తుతం ఆ పేరు వింటే రెండు రాష్ట్రాల్లో అధికారులు హడలిపోతారు. రెండు రాష్ట్ర ప్రభుత్వాలు అతని కనుసన్నల్లో నడుస్తాయంటారు. పట్టిసీమ దగ్గర మొదలెట్టి.. కాళేశ్వరం దగ్గర వేల కోట్లకు పడగలెత్తే స్థాయికి ఎదిగాడు. తన పనులు నిరాటంకంగా చేసుకుంటూ పోవడానికి అతనికి వున్న ఒకే ఒక్క అడ్డు-మీడియా. వాటిని గంపగుత్తగా కొనేయడం, లేదా లొంగకపోతే ప్రభుత్వాల సాయంతో ప్రసారాలు నిలిపి వేయించడం, తద్వారా మొత్తం మీడియాని గుప్పిట్లో పెట్టుకోవాలనుకోవడం.. ఇదే ఇతని గేమ్ ప్లాన్. మీడియాపై ‘కాళేశ్వర మర్ధనం’ చేయడంతో ఇప్పుడు ఇతని పేరు రెండు రాష్ట్రాలు దాటి జాతీయ స్థాయిలో మార్మోగిపోతోంది.
పాలకుల అండదండలతో తెలుగునాట వున్న మీడియా సంస్థలన్నింటినీ.. ఒక్కొక్కటిగా కొనుగోలు చేయడం, లేదా భయపెట్టి బలవంతంగా టేకోవర్ చేయడం.. వంటి తాజా దుర్మార్గాల ద్వారా కృష్ణారెడ్డి పేరు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యింది. మరో బడా కాంట్రాక్టరు రామేశ్వరరావుతో కలిసి మీడియా సంస్థల్ని భయపెట్టి హస్తగతం చేసుకోవడం, కొనుగోలు చేసిన మీడియా సంస్థల్ని నిర్వీర్యం చేయడం, లేదా మూసేయడంలో వీరిద్దరిదీ మాస్టర్ మైండ్… అని జాతీయస్థాయి మీడియాలో చర్చ జరుగుతోంది.
మెఘా ఇంజనీరింగ్. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశంలోనే ఇప్పుడు ఈ పేరు తెలియని వారు ఉండరు. ఎందుకంటే అతి తక్కువ సమయంలో ఆ కంపెనీ అలా ‘ఎదిగింది’. తెలంగాణ, ఏపీల్లో అయితే ఏ కాంట్రాక్ట్ అయినా ఈ సంస్థకే. ఆ సంస్థ కాదనుకుంటే తప్ప.. వేరే వాళ్లకు దక్కని పరిస్థితి ఉందని ఉన్నతాధికారులే చేతులెత్తేస్తున్నారు.
ఈ కంపెనీ యజమానుల వికృత ఛేష్ఠలు ఎలా వుంటాయో చెప్పడానికి ఒక ఉదాహరణ చెబుతుంటారు. ఆమధ్య మెఘా ఇంజనీరింగ్ ఛైర్మన్ పిచ్చిరెడ్డి తన పుట్టిన రోజుకు ఏకంగా కోటి రూపాయలు ఖర్చు పెట్టి మరీ ‘సన్నిలియోన్’తో డ్యాన్స్ కార్యక్రమం ఏర్పాటు చేశాడని, సన్నిలియోన్‌తో కలసి పిచ్చిరెడ్డి స్టెప్పులు కూడా వేశాడని అప్పట్లో మీడియాలో వార్తలు వచ్చాయి. తర్వాత తన భార్య సుధారెడ్డి పుట్టినరోజు కోసం కృష్ణారెడ్డి ఏకంగా 70 కోట్ల రూపాయలు పైనే ఖర్చు పెట్టినట్లు కార్పొరేట్ వర్గాల్లో ప్రచారం జరిగింది. మెఘా కృష్ణారెడ్డి తన భార్యకు 55 కోట్ల రూపాయలు విలువ చేసే ప్రత్యేకంగా డిజైన్ చేసిన హై ఎండ్ రోల్స్ రాయిస్ కారును బహుకరించారని మీడియాలో వార్తలు వచ్చాయి.
కేవలం ఫంక్షన్ పైనే దాదాపు 9 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినట్లు, దేశంలోనే ఎంతో పేరున్న ఫ్యాషన్ డిజైనర్ రీతూ దాల్మియా ఆధ్వర్యంలో పుట్టిన రోజు వేడుకలు జరిగినట్టు వార్తలు గుప్పుమన్నాయి. ఏకంగా సింగపూర్ నుంచి మోడల్స్‌ను రప్పించారని మీడియాలో వచ్చింది. ఒక్క రీతూ దాల్మియానే తన విజిట్‌కు 50 లక్షల రూపాయలు ఛార్జ్ చేస్తుందని.. సింగపూర్ మోడల్స్‌తో కలుపుకుంటే ఈ వ్యయం అంతా 1.5 కోట్ల రూపాయల వరకూ ఉంటుందని ఆ బర్త్‌డే వేడుకలలో పాల్గొన్న ఒక వ్యక్తి ద్వారా బయటికి పొక్కడంతో అప్పట్లో ఇది మీడియాలో బాగా నలిగింది. దాంతో ‘కేంద్రం’ మెఘా సంస్థపై ప్రత్యేకంగా దృష్టి పెట్టడంతో దీనికంతటికీ కారణమైన మీడయాపై కృష్ణారెడ్డి కక్షగట్టాడని, అప్పటి నుంచి అతని మీడియా దండయాత్ర కొనసాగుతోందని చెబుతారు.
మొదట కృష్ణారెడ్డి ఎన్‌టీవీ, భక్తి ఛానెళ్లకు పరిమితమై వుండేవాడు. తనకు వ్యతిరేకంగా వున్న మీడియా సంస్థల్ని కూడా కొనుగోలు చేయడం ద్వారా జర్నలిస్టులందర్నీ తన గుమ్మంలో కట్టిపడేస్తానని అతనొక ఛాలెంజ్ చేసినట్టు టాక్. ఆ క్రమంలో మొదట అతని దృష్టి టీవీనైన్ సంస్థపై పడింది. ఒకనాడు టీవీనైన్ అంటే అవినీతిపరుల వెన్నులో వణుకుపుట్టేంది. అలాంటి దాన్ని అతను చిడతలు వాయించే స్థాయికి దిగజార్చాడు. ఇప్పుడది పాలకుల భజనతో మైమరచిపోతోంది.
వెంచర్ క్యాపిటలిస్ట్ చేతుల్లోంచి తన చేతుల్లోకి అలా అవలీలగా టీవీనైన్‌ను తీసుకోగలిగిన కృష్ణారెడ్డికి దాని వ్యవస్థాపకుడిగా వున్న రవిప్రకాశ్‌ను లొంగదీసుకోవడం సాధ్యం కాలేదు. ఒక్క మాటలో చెప్పాలంటే, మీడియా సూరీడు అతనికి కొరకరాని కొయ్యగా తయారయ్యడు. దాంతో కుట్రలు చేసి రవిప్రకాశ్‌ను బయటకు పంపగలిగాడు. మళ్లీ తొలివెలుగు ద్వారా మళ్లీ ప్రమాదం ముంచుకొస్తుండటంతో ప్రభుత్వం అండదండలతో కోర్టులకు వరుస సెలవులు చూసుకుని మరీ రవిప్రకాశ్‌ను అరెస్టు చేయించారని జర్నలిస్టులు తిట్టిపోస్తున్నారు. దీనిపై జాతీయస్థాయిలో పెద్ద చర్చ జరుగుతోంది. దాంతో ‘మెఘా’ వ్యవహారాలపై ‘కేంద్రం’ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టినట్టు సమాచారం. ఈనేపథ్యంలో కృష్ణారెడ్డి ఇల్లు, కార్యాలయాలపై ఐటీ దాడులు జరుగుతున్నాయి.