– ఆ వందల కోట్ల ఆస్తులపై గులాబీ నేతల కన్నుపడిందా..?
– ఖాకీలతో సెలైంట్ గా పని కానిచ్చేస్తున్నారా..?
– దొరికిన రూ.16 కోట్లు ఎక్కడ..?
– వారం రోజుల విచారణలో ఏం తేలింది..?
– పటాన్ చెరులో బంగారు బాతులా మారిన మనీ సర్క్యులేషన్ కేసు
సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు వారం రోజులుగా ఓ కేసులో తలమునకలయ్యారు. సుమారు రూ.16 కోట్లు సీజ్ చేసినట్లు సమాచారం. ఇంత జరిగినా మీడియాలో హడావుడి లేదు. అంతా గప్ చుప్. సైలెంట్ విచారణ. ఓ మంత్రి గారి అదేశాలు ఉండటంతోనే పోలీసులు విషయాన్ని లీక్ చేయడం లేదు. కొద్ది రోజుల క్రితం రామచంద్రాపురం పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసులో పటేల్ గూడ సర్పంచ్ నితీష ఇంట్లో తనిఖీలు జరుగుతున్నాయి. నాలుగు రోజులుగా సైబరాబాద్ కమిషనరేట్ లో వ్యక్తిగత దర్యాప్తు చేస్తున్నారు. సోదాల్లో రూ.16 కోట్లు దొరికినట్లు తెలుస్తోంది. వాటితో పాటు నగలు, పలు పత్రాలు, బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. సర్పంచ్ భర్త శ్రీకాంత్, అతని మామ, అమీన్ పూర్ ఎంపీపీ దేవానంద్ ని విచారించారు సైబరాబాద్ పోలీసులు.
అంత సొమ్ము ఎక్కడిది..? ఎలా వచ్చింది..?
2018లో కలిస్తే గెలుస్తాం అంటూ.. మనీ సర్క్యులేషన్ ద్వారా అధిక వడ్డీ ఆశ చూపించి బడా మోసానికి పాల్పడ్డాడు మెతుకు రవీందర్. ప్రభుత్వ టీచర్ అయి ఉండి.. తక్కువ కాలంలోనే ఎక్కువ డబ్బులు సంపాదించాలనే కోరికతో.. అధిక వడ్డీలు ఆశ చూపించి.. ప్రజల దగ్గర నుంచి రూ.150 కోట్ల వరకు వసూలు చేశాడు. శామీర్ పేటలో కేసు నమోదైంది. దీంతో.. రవీందర్ నిర్వహిస్తున్న సన్ పరివార్ గ్రూప్ ఆఫ్ కంపెనీల వ్యవహారాలు అన్నింటినీ పోలీసులు సీజ్ చేశారు. ఆస్తులయితే పెద్ద ఎత్తున ఉన్నాయి. బాధితులకు డబ్బులు సెటిల్ మెంట్ చేసినట్లు తెలుస్తోంది. అప్పుడే గులాబీ నేతల ఎంట్రీ మొదలైంది.
వివాదం రూ.16 కోట్ల కోసమేనా..? లేక.. వందల కోట్ల కోసమా..?
హత్నూర మండలం ప్రజాప్రతినిధి, పటేల్ గూడ సర్పంచ్ నితీషకు సమీప బంధువు. వ్యాపారంలో భాగస్వాములుగా ఉన్నారు. నితీష తండ్రికి ఓ గులాబీ నేత రూ.16 కోట్లు ఇచ్చాడు. వాటిని ఆయన ఇతరత్రా పెట్టుబడులు పెట్టాడు. ఈ డబ్బు పఠాన్ చెరుకు చెందిన గులాబీ లీడర్ ది. ఆ నగదుతో పాత స్కాం సెటిల్ మెంట్ చేసుకుంటే వందల కోట్లు రావొచ్చని ఆశ పడ్డారు. కానీ.. సర్పంచ్ తండ్రి డబ్బులను మరో విధంగా వాడుకోవడంతో సమస్య మొదలైంది. దీనిపై అమీన్ పూర్ ఎంపీపీ దేవానంద్ మధ్యవర్తిత్వం వహించారు. తర్వాత ఆ ప్రజా ప్రతినిధి అందరినీ ఏకిపడేశారు. ఇష్యూ పోలీస్ స్టేషన్ కు చేరుకుంది. మాదాపూర్ డీసీపీ ఆఫీస్ లో ప్రాథమిక దర్యాప్తు చేసి నిందితుల జాబితాలో నితీష తండ్రి, తల్లి, అన్నల పేర్లు నమోదు చేశారు. నాలుగో పేరు సర్పంచ్ నితీష, ఆ తర్వాత భర్త శ్రీకాంత్, ఎంపీపీ దేవానంద్ పేర్లు కూడా ఉన్నట్లు సమాచారం.
అంతా రహస్యమే..అరెస్టులు ఉంటాయా..? సెటిల్ మెంటేనా..?
ఈ కేసు విషయం పోలీసులు అత్యంత గోప్యంగా ఉంచుతున్నారు. డబ్బులు ఎక్కడివి..? ఎందుకు ఇచ్చారు..? ఎవరిచ్చారు..? దేనికోసం ఇచ్చారనేది ఇప్పుడు తేల్చాల్సి ఉంది. అమీన్ పూర్ లోని ఓ బిల్డర్ ఈ కేసుకు సంబంధించి చక్రం తిప్పుతున్నట్టు సమాచారం. పాత స్కాంని అడ్డుపెట్టుకొని సంపాదించాలనుకుంటున్న గులాబీ నేతల కోసమే వారం నుంచి నిందితులను రిమాండ్ చేయకుండా చిత్ర హింసలు పెడుతున్నారని సర్పంచ్ బంధువులు ఆరోపిస్తున్నారు. ఒకవేళ పాత స్కాంకు సంబంధం లేదని చెబితే.. ఈ వ్యవహారం అంతా సివిల్ వివాదంగా మారే అవకాశం ఉంది. సో.. ఎదిఏమైనా ఇందులో పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది.