– లెక్క తేలని నయీం సంపద
– పది వేల కోట్ల అస్తులు అంటూ హడావుడి
– 130 డైరీల్లో ఎముందో ఇప్పటికీ రహాస్యమే..!
– సిట్ కు వచ్చిన ఫిర్యాదులను బయటపెట్టని ఐజీ
– ఐదేళ్లు గడుస్తున్నా బాధితులకు అందని న్యాయం
– నయీంకి నీడలా బతికిన ఖద్దర్, ఖాకీలు సేఫ్
గ్యాంగ్ స్టర్ నయీం అస్తుల చిట్టా మూడేళ్ల క్రితమే బయటపడింది. 2వేల కోట్ల అస్తులు ఉన్నట్లు సిట్ అధికారులు మీడియా ముందు ప్రకటించారు. మూడు నెల్లల్లోనే అంతా పూర్తి చేస్తామని చెప్పారు. నయీంతో అంటకాగిన 25 మంది పోలీసులకు మాత్రం క్లీన్ చిట్ ఇచ్చి.. కొద్దిమంది ఉన్నతాధికారులను సస్పెండ్ చేసి వారి పాత్ర కూడా లేదని మళ్లీ పోస్టింగ్ లు ఇచ్చుకున్నారు. అయితే ఐదేళ్లు గడిచినా బాధితులకు న్యాయం జరగడం లేదు.
పోలీసుల లెక్కల ప్రకారం 2 వేల కోట్ల అస్తుల్లో 1019 ఎకరాల వ్యవసాయ భూమి.. 29 కమర్షియల్, రెసిడెన్స్ ప్లాట్స్, రెండు కిలోల బంగారం, 2 కోట్ల నగదు ఉంది. అయితే దాదాపు 850 మంది బాధితులు సిట్ ఎర్పాటు చేసిన టోల్ ఫ్రీ నెంబర్ కి ఫిర్యాదు చేసి తమ గోడు వెల్లబోసుకున్నారు. అలా 251 కేసుల వరకు నమోదయ్యాయి. అయితే 90 రోజుల్లో చార్జ్ షీట్ దాఖలు చేసి తేల్చాల్సిన పోలీసులు.. 18వందల రోజులైనా ఒక్కరికీ శిక్ష పడేలా చేయలేదు. 175 కేసుల్లో మాత్రమే చార్జ్ షీట్ దాఖలు చేసి చేతులు దులుపుకున్నారు. 70 కేసులు పూర్తిగా క్లోజ్ అయ్యాయి. బాధితులు తమకెప్పుడు న్యాయం జరుగుతుందా.. అని కళ్లు కాయలు కాసేలా ఎదురు చూడటం తప్ప ఏం చేయలేని నిస్సహాయత వారిది.
ఆ 130 డైరీల్లో ఏముంది..?
నయీం చనిపోగానే.. 130 డైరీలను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. దాదాపు 10 వేల కోట్ల అస్తులు ఉన్నాయని, వందల మంది మైనర్ బాలికలను అత్యాచారం చేసి అమ్ముకునే వాడని, భూ సెటిల్ మెంట్లు చేస్తూ బెదిరింపులకు పాల్పడేవాడని ఎన్నో కథనాలు వచ్చాయి. అయితే అప్పట్లో ఇంటెలిజెన్స్ చీఫ్ శివధర్ రెడ్డిని బదిలీ చేసి.. సిట్ ఎర్పాటు చేసి హాడావుడి చేశారు. అప్పుడే పోలీస్ బాస్ ల లింకులపై ఆధారాలు బయటపడ్డాయి. తాము చేయలేని పనులను నయీంతో పోలీసులు చేయించే వారని ఆరోపణలు వచ్చాయి. ప్రత్యర్థుల సెల్ ఫోన్ టవర్ లోకేషన్ ట్రాక్ చేసి నయీంకి సమాచారం ఇచ్చారని కూడా తేలింది. దానికి ప్రతిఫలంగా కోట్లాది రూపాయల భూములను నయీం గిఫ్ట్ గా ఇచ్చేవాడని డిపార్ట్ మెంట్ లోనే గుసగుసలు వినిపించాయి. ఇవన్నీ ఆ డైరీల్లో.. సెల్ ఫోన్ రికార్డుల్లో భద్రంగా ఉన్నాయి. కానీ.. అవి బయటపడితే చాలామంది పోలీసులు, రాజకీయ నాయకులు జైల్లో ఊచలు లెక్కపెట్టడం ఖాయం. అందుకే ఎక్కడా బహిర్గతం చేయకుండా నయీం అస్తులతో పాటు.. అక్రమాల వెలికితీతపై దర్యాప్తును ముగించేశారు.
ఇక నయీం ఆస్తుల చిట్టా ఎంత…ఎక్కడెక్కడ ఎన్ని కోట్లలో కూడబెట్టాడు..? ఎన్ని ఏకీ 47లను కొనుగోలు చేశాడు.. ఈ ఫుల్ డీటేల్స్ ని తర్వాతి కథనంలో తొలివెలుగు మీ ముందుకు తీసుకొస్తుంది.