నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్‌కు ప్రమాద ఘంటికలు మోగుతున్నట్టే కనిపిస్తున్నాయి. ఎంపీగా గెలిచి ఏడాదిన్నర కావొస్తున్నా పసుపు బోర్డు తీసుకురావడంలో విఫలమయ్యారంటూ.. రైతులు మరోసారి ఉద్యమాన్ని లేవదీస్తున్నారు. పది రోజుల్లో పసుపుబోర్డు తేవాలని ఎంపీకి డెడ్‌లైన్ పెట్టి...కాని పక్షంలో పదవికి రాజీనామా చేయాల్సిందేనంటూ తాజాగా ఓ అల్టీమేటం జారీ చేశారు. దీంతో గత ఎన్నికల నాటి ముందు పరిస్థితులే కళ్లముందు కదులుతున్నాయి.
పసుపు బోర్డు ఏర్పాటు, మద్దతు ధర కోసం పసుపు రైతులు దశాబ్దాలుగా పోరాడుతున్నారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఏకంగా ప్రధాని మోదీకి వ్యతిరేకంగా నామినేషన్ వేసి దేశవ్యాప్తంగా చర్చకు నిలిచారు. అలాగే నిజామాబాద్‌లో 178 మంది రైతులు పోటీకి నిలబడి సంచలనం సృష్టించారు. ఇదే కమ్రంలో పసుపు బోర్డు తీసుకొస్తానని హామీ ఇచ్చిన అర్వింద్‌ను అనూహ్యంగా గెలిపించి, ముఖ్యమంత్రి కూతురు కవితకు షాకిచ్చారు.
ఇక ఎంపీగా గెలిచిన అరవింద్ పుసుపు బోర్డు పేరుతో.. గత జనవరిలో స్పైసిస్‌బోర్డు రీజినల్ కార్యాలయం నిజామాబాద్‌కు తీసుకొచ్చారు. పసుపు బోర్డును మించి ప్రయోజనాలు ఉంటాయని రైతులకు చెప్పారు. అయితే స్పైసిస్‌బోర్డుపై రైతులు ఏమాత్రం సంతృప్తిగా లేరు. తమకు కావాల్సింది పసుపు బోర్డు, మద్దతు ధర మాత్రమేనని అంతకు మించి ఏదీ అవసరం లేదని తెగేసి చెప్తున్నారు. దీంతో ఎంపీ అర్వింద్‌కు పసుపు బోర్డు ఇష్యూ రానున్న రోజుల్లో పెద్ద తలనొప్పిగానే మారే అవకాశముందని విశ్లేషకులు చెప్తున్నారు. సరిగ్గా డీల్ చేయకపోతే కవికు ఎదురైన పరిస్థితే అర్వింద్‌కు తప్పదని హెచ్చరిస్తున్నారు.