తెలంగాణ పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార టీర్ఎస్ గెలుపు.. సగటు తెలంగాణవాదిలో ఆశ్చర్యాన్నే కాదు విస్మయాన్నీ కలిగిస్తోంది. కొలువుల కోసం ప్రభుత్వంపై పిడికిలి ఎత్తిన ఆ నిరుద్యోగులేనా?.. పీఆర్సీ కోసం సర్కార్‌పై పీకలదాక కోపం పెంచుకున్న ఆ ఉద్యోగులేనా గులాబీ గుర్తుకు ఓట్లు వేసింది అన్న సందేహం కలుగుతోంది.ఉద్యోగుల సంగతి సరే.. పీఆర్సీకి ఆశపడ్డారని అనుకోవచ్చు. కానీ నిరుద్యోగులకు ఏమైంది? ఇంటికో ఉద్యోగమని ఊహల పల్లకి ఎక్కించి, తీరా అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ ఉద్యోగాలపై ఆశలు పెట్టుకోవద్దంటూ చెప్పాక కూడా వారి గుండెలు మండలేదా? ఉద్యోగాలు ఎలాగూ లేవు.. కనీసం ఇస్తామన్న నిరుద్యోగ భృతిపై కూడా మీన మేషాలు లెక్కిస్తోంటే.. కడుపు రగలిపోలేదా అన్న అనుమానం తలెత్తుతోంది.
ప్రశ్నించే గొంతును నిర్దాక్షిణ్యంగా నులిమేశారు పట్టభద్రులు. నాడు తెలంగాణ ఉద్యమ సమయంలో కోదండరాం ఒక్క పిలుపునిస్తే నిరక్షరాస్యులు కూడా ఆయన వెంట వెల్లువలా తరలివచ్చారు. ఎప్పుడంటే అప్పుడు తమ పనులన్నీ మానుకుని రోడ్లెక్కారు. అలాంటిది కనీసం వారికి ఉన్న సోయి కూడా చదువుకున్నవారిలో కనిపించకపోవడం విచిత్రంగా అనిపిస్తోంది.
వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాలు అంటేనే చైతన్యానికి మారు పేరు. అణువణువునా పోరాటం, ప్రశ్నించే గుణం అక్కడివారిలో ఉంటుందని చెప్పుకుంటారు. మరి అవన్నీ ఏమయ్యాయి? అండగా ఉండాలని వచ్చిన నేతను కాదనుకునే మనసెలా వచ్చింది? అన్యాయంపై ప్రశ్నించే మనిషిని దాటి.. అన్యాయాన్ని చేసే వారివైపే నిలబడే ఆలోచన ఎలా కలిగింది? ఈ ప్రశ్నలకు సమాధానాలు దొరకడం లేదు.
పట్టభద్రుడా.. నువ్విచ్చిన తీర్పుతో ఇప్పుడు నీకే సమస్య లేదని అనుకోవాలా? లేక చదువుకున్నవాడిని కూడా డబ్బే నడిపిస్తుందని భావించాలా? లేదా కనీసం ఆ రెండు, మూడు వేలు కూడా సంపాదించలేదని దుస్థితిలో ఉండి.. అవి ఇచ్చినవారికి న్యాయంగా ఓటేశారని జాలిపడాలా? పట్టభద్రుడా నువ్వేం చేశావో నీకు అర్థమవుతోందా!