– పీవోటీ యాక్ట్ ప్రకారం చర్యలు ఏవి..?
– ప్రభుత్వ భూముల క్లియరెన్స్ చుట్టే రాజకీయం?
– ఏడేళ్లలో వందల కోట్లు సంపాదించిన ఎమ్మెల్యే?
– ఇన్నాళ్లూ ఓఆర్ఆర్ చుట్టూ..
– ఇప్పుడు ట్రిపుల్ ఆర్ పక్కన పాగా..?
– అసైన్డ్ భూముల పాపంలో..అన్నిపార్టీల నేతలు?
– సంగారెడ్డిలో వేల కోట్ల అసైన్డ్ భూముల యవ్వారంపై..
– తొలివెలుగు క్రైం బ్యూరో స్పెషల్ స్టోరీ- పార్ట్ 4
తెలంగాణలో అసైన్డ్ భూములను..ఎవరెవరు ఎంతెంత కబ్జా చేశారో..ఎలా మాయ చేసి తెగనమ్ముకున్నారో వంటి సంగతులు చెప్పుకుంటూ పోతే..ఎంత చెప్పినా ఒడవని ముచ్చటే అవుతుంది. బడాబాబులు నయాన భయాన పేదలను దారికి తెచ్చుకుని.. వేల ఎకరాలు కొనుగోలు చేశారు.గతంలో నారాయణ రావు అనే వ్యక్తి సృష్టించిన భూ మాఫియాకు ఇప్పటి టీఆర్ఎస్ నాయకులు వారి అనుచరులు తోడై వందల కోట్లు సంపాదిస్తున్నారు. దాంతో ఆయన వెంచర్లు బంగారు బాతులా తయారయ్యాయి.
సంగారెడ్డి అసైన్డ్ భూముల చెర 1980లోనే..!
నారాయణ రావు..ఈ పేరు పటాన్ చెరువు ప్రాంతంలో తెలియని వారు ఉండరు.1980 లో ఇండ్రస్టియల్ ఎంప్లాయిస్ హౌజింగ్ కో ఆపరేటివ్ సొసైటీ అని ఏర్పాటు చేసి నగర శివార్లలో 10 వేల ఎకరాలతో 7 వెంచర్లు చేశారు.కొండాపూర్ లోని రాఘవేంద్ర కాలనీ, బొటానికల్ గార్డెన్ వద్ద శ్రీరాం నగర్ కాలనీ, అమీన్ పూర్ లో మల్లికార్జున్ నగర్, తెల్లాపూర్ లో సాయిబాబా నగర్, పటాన్ చెరువులో శ్రీరంగానగర్ కాలనీల్లో.. నెలకు కొంత చొప్పున చెల్లించి ప్లాట్స్ రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు.కొల్లూర్ లోని ఒక వెంచర్ లోనే ఒక్కొక్క ప్లాట్ ఎకరం ఉండేలా చేశారు. అప్పటి రూల్స్ ప్రకారం రెవెన్యూ అధికారుల నుంచి అన్నిఅనుమతులు తీసుకున్నారు.అసైన్డ్ భూముల్లో బై నెంబర్స్ తో రిజిస్ట్రేషన్స్ కూడా చేయించుకున్నారు.1996లో చంద్రబాబు ప్రభుత్వం జీ.వో. 1077 తెచ్చారు. నారాయణ రావు వేసిన ఏడు వెంచర్లలో ప్రభుత్వ భూమి ఉంది. మొత్తం భూమి డిస్ట్రిక్ట్ రెవెన్యూ ఆఫీసర్ కస్టడిలోనే ఉండాలన్నారు. దీంతో ప్లాట్ ఓనర్స్ హైకోర్టుకు వెళ్లారు.2014లో కామన్ ఆర్డర్ వచ్చింది. దీంతో తలా కొంచెం అమౌంట్ కట్టి అసైన్డ్ భూమినంతా రిజిస్ట్రేషన్ చేయించారు.మధ్యతరగతి కుటుంబాలు కొనుగోలు చేశాయి కాబట్టి ప్రభుత్వానికి డబ్బులు చెల్లించి రెగ్యులరజైషేన్ చేసుకొమ్మన్నారు. ప్రయివేట్ భూమిని డీ.ఆర్.ఓ. కస్టడి నుంచి తొలగించాలని ప్రభుత్వానికి అదేశాలు జారీ చేశారు. కాని ఇప్పటికీ కొండాపూర్ లోని రెండు వెంచర్లు మాత్రమే క్లియర్ అయ్యాయి. మిగతా వేల కొట్ల విలువ చేసే 5 వెంచర్ల భూమి పై టీ.ఆర్.ఎస్. ప్రభుత్వంలోని పెద్దల కన్నుపడటంతో.. తమ కాసుల వేట మొదలు పెట్టేశారు. అక్కడ భూముల్లో దర్జాగా కబ్జా పెట్టేశారు.
గులాబీ గ్యాంగ్ కు.. వరంగా నారాయణరావు లే-అవుట్స్!
అటు.. 45 యేళ్లు అయినా వేల మంది బాధితులకు న్యాయం జరగడం లేదు.అమీన్ పూర్ లే అవుట్ లో 170 ఎకరాల ప్రభుత్వ భూమి 80 ఎకరాల పట్టా భూమి ఉంది.కోర్టు కేసులు ఉండటంతో ఎవ్వరికి తోచినట్టు వారు పట్టా భూమి తమదే అంటూ టీ.ఆర్.ఎస్. నేతల అండదండలు, పటాన్ చెరువు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి, అమీన్ పూర్ మున్సిపాల్టీ చైర్మన్ పాండురంగారెడ్డిలతో కలిసి ఇష్టాను సారంగా కబ్జాలు పెట్టారు. ఎవరైనా వస్తే..కట్టిన ఇళ్లు చూపించి..రెండు లక్షలు ఇస్తాం ఒరిజినల్ పేపర్స్ ఇచ్చి వెళ్లండి అని తమ ఖాతాలో వేసుకుంటూ..కబ్జాపర్వాన్ని యధేచ్ఛగా కొనసాగిస్తున్నారు.
తెల్లాపూర్ లో కార్పోరేట్ డీల్!
తెల్లాపూర్ లో 223 ఎకరాల్లో నారాయణారావు లే అవుట్ ఉంది. 1600 మంది ప్లాట్ ఓనర్స్ ఉన్నారు.1996 నుంచి ప్రభుత్వ అధీనంలో ఉన్నభూమికి 2014లో విముక్తి కల్గింది. కాని వై.ఎస్.ఆర్. హయంలో కార్పొరేట్ కంపెనీలకు మొత్తం 400 ఎకరాలను 1600 కోట్లు సెజ్ ఏర్పాటు చేసి ఇస్తామని హామీ ఇచ్చారు. అందుకు ప్లాట్ ఓనర్స్ హైకోర్టు నుంచి స్టే తెచ్చుకున్నారు.అప్పటికే 400 కోట్లు అడ్వాన్స్ కింద హిందూస్తాన్ కన్సస్ట్రక్షన్,టీష్మాన్ స్పెయిర్ కంపనీ చెల్లించారు. కోర్టు ఉత్తర్వులతో ఆడ్వాన్స్ డబ్బుని ప్రభుత్వం తిరిగి చెల్లించిందని సమాచారం.అయితే తెలంగాణ వచ్చిన తర్వాత తమకు కేటాయించిన డబ్బులు వద్దు తమకు అక్కడ భూమి కావాలని 100 ఎకరాలకు పైగా టీష్మాన్ స్పెయిర్ ల్యాండ్స్ టీ.ఆర్.ఎస్. ప్రభుత్వం నుంచి తీసుకుంది. అదికూడా అప్పటి రేట్ల ప్రకారమే తీసుకుంది. ఇప్పడు ఆ భూమి విలువ 8 వేల కోట్లు. ఇందులో మైహోం కంపెనీ నిర్మాణాలు చేపడుతోంది.అయితే పక్కనే ఉన్న 223 ఎకరాల పై కన్నేసిన కార్పొరేట్ సంస్థలు క్లియర్ చేసుకోని కొట్టేసే ప్రయత్నం చేస్తున్నారు. అమీన్ పూర్ ల్యాండ్స్ కబ్జా అవుతున్నాపట్టించుకోవడం లేదు.తెల్లాపూర్ ల్యాండ్స్ కబ్జాలు కావడం లేదు. కాని హెచ్ఎండీఏ ఎవరికి అంటకడుతుందోననే భయం వెంటాడుతోంది. పటాన్ చెరువు భూములు కలెక్టర్ కనుసన్నల్లో ఉన్నా..కబ్జాదారులు తమదే అంటూ దొంగపట్టాలు సృష్టించుకున్నారు.
కందిలో 55 ఎకరాల అసైన్డ్ ఖతం
సంగారెడ్డి,కంది మండలాల్లో 55ఎకరాల అసైన్డ్ భూమి అమ్మకం జరిపారు.దీని విలువ 300 కోట్లు.38 యేళ్ల క్రితం ఇందిరాగాంధీ పేదలకు పట్టాలు ఇచ్చింది.సర్వే నెంబర్ 656 లో 245 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది.అధికార బలంతో 22 ఎకరాలు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు.అయితే టీ.ఆర్.ఎస్. నేతల గొడవతో బయటకు పొక్కింది. మాస్టర్ ప్లాన్ లో గ్రీన్ జోన్ అయినా గులాబీ నేతలు దర్జాగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకున్నారు. ముంబాయి హైవేకు దగ్గరలో ఉండటంతో ఎకరా 5కోట్లు పలుకుతోంది. అసైన్డ్ దారులకు కొత్త పాస్ బుక్ లు ఇవ్వకుండా.. పాత రికార్డుల ఆధారంగా ఎకరం 50 లక్షలకు గాను కొనుగోలు చేస్తున్నారు. చుట్టూ ప్రహారీ నిర్మించేశారు. దీంతో 30 కోట్లు పెట్టి 300 కోట్ల బిజినెస్ చేస్తున్నారు టీఆర్ఎస్ నేతలు. ముంబాయి హైవేకు అనుకుని ఉండటంతో ఎంతో కొంత చెల్లించి 22 ఎకరాలు రిజిస్ట్రేషన్.. చుట్టూ గోడ కట్టారు. కొత్త పాస్ బుక్ లు ఇవ్వకుండా సతాయిస్తున్నారు.
ఉస్మాన్ నగర్ లో హుష్ కాకీ..!
మహానగరానికి కూతవేటు దూరంలో ఉన్నరామచంద్రాపురం మండల పరిధిలోని ఉస్మాన్నగర్లో ప్రస్తుతం ఎకరం ధర రూ.25 కోట్ల వరకు పలుకుతోంది. దీంతో అసైన్డ్ భూమి పై కన్నుపడింది. పెద్దల అండదండలతో కబ్జా చేస్తున్నారు. కోర్టు కేసులు ఉన్నా తమకేమి సంబంధం లేదనీ.. చుట్టూ రేకులు పాతి సి.సి. కెమెరాలతో బౌన్సర్స్ ని పెట్టి ఎవ్వరిని రానివ్వకుండా అడ్డుకుంటున్నారు. సర్వే నంబరు 9లో 76 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. నాలుగు దశాబ్ధాల క్రితం ఈ భూమిని సాగు చేసేకునేందుకు పేదలకు కేటాయించారు.ప్రభుత్వం పట్టాలను కూడా జారీ చేసింది. 2002-2003 లో అసైన్డ్ రూల్స్ అతిక్రమించిన వారి నుంచి ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకుంది. 2018లో కోర్టు రైతులకు ఇవ్వాలని సూచించింది.అయితే ఇదంతా ప్రభత్వ భూమి అని తేల్చింది. కోర్టు తీర్పు ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నప్పటికీ రియల్టర్లు మాత్రం ఇవి పట్టా భూములంటూ హైకోర్టును ఆశ్రయించారు.మంత్రి హరీష్ రావు ఒత్తిళ్లతో ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకోడానికి గట్టి ప్రయత్నం చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. వందల కోట్ల విలువ చేసే భూమిని రియల్టర్లు తమ ఆధీనంలోనే ఉంచుకున్నారు. మరో 16 ఎకరాలకు సంబంధించి 19 కేసుల్లో వాదనలు జరుగుతున్నాయి. మరోవైపు రియల్టర్లు 25 ఎకరాలను తమ కబ్జాలోకి తీసుకున్నారు.
జిన్నారంలో కళ్లు జిగేల్ మనేలా అమ్మకాలు..!
సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలంలో 310 ఎకరాలు కబ్జాకు గురైనట్లు అంచనాలున్నాయి. ఓఆర్ఆర్ కి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్నాఈ భూములు ఎకరం 3 నుంచి 7 కోట్ల వరకు పలుకుతున్నాయి. అసైన్డ్ చట్టానికి తూట్లు పొడుస్తూ 140 ఎకరాలకు యాజమాన్య హక్కులు మార్చేశారు. ప్రభుత్వ, మిగులు, అసైన్డ్ భూముల కోసం రికార్డులను మార్చేంత స్థాయికి టీ.ఆర్.ఎస్. నాయకులు ఎదిగారు.కిష్టాయిపల్లిలో 42వ సర్వే నంబరులో 40 ఎకరాలు ఆక్రమణదారుల పరమయ్యాయి. 166వ సర్వే నంబరులోని 327 ఎకరాల్లో 180 ఎకరాల అసైన్డ్,20 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జాకు గురైంది.ఈ భూముల హక్కులు అన్నీఇతరుల పేర్ల మీదికి ఎక్కించేశారు.సర్వే నంబరు 166/ఆ2లో 3.24 గుంటల భూమి బైండ్ల లక్ష్మయ్యకు ప్రభుత్వం అసైన్డ్ చేసింది. ఇప్పుడది మరో వ్యక్తి పేరుపై మారింది. పట్టా పాసుపుస్తకాలూ జారీ అయ్యాయి.166/2ఇలో మాదారం రాజయ్యకు 2.24 ఎకరాలను ప్రభుత్వం ఇచ్చింది. అందులో నగరానికి చెందిన ఓ వ్యక్తిపేరుపై 2.04ఎకరాలు, ఓ ప్రజాప్రతినిధి బంధువు పేరుపై 12గుంటలు,మరో ఎకరా భూమి మారింది.166/2ఈలో బ్యాగరి సత్తెమ్మకు 3.24 గుంటల అసైన్డ్ భూమి ఉంది. ఇప్పుడది ఓ ప్రజాప్రతినిధి బంధువు పేరుపై మార్చారు. 16 గుంటలు మరో మహిళ పేరున చూపుతోంది.166/ఉ సర్వే నంబరులోని 3.24 ఎకరాల అసైన్డ్ భూమిని ఓ పేద రైతుకు ఇవ్వగా పదేళ్ల క్రితం మరో వ్యక్తి పేరుపైకి మారింది. రెండేళ్ల క్రితం దానిలో 1.32 ఎకరాలు మరో వ్యక్తి పేరుమీదికి మార్చేశారు. 166/3అ2ని 28 గుంటలను ములుగు నర్సింహులుకు అసైన్డ్ చేశారు. ఇందులో ప్రస్తుతం 35 గుంటలు ఉన్నట్లు చూపుతున్నారు. యాజమాన్య హక్కులు నగరానికి చెందిన వ్యక్తి పేరుతో ఉన్నాయి. 166/3ఆ1 సర్వే నంబరులో పుల్లగరి శివయ్యకు ప్రభుత్వం ఇచ్చిన 13 గుంటల భూమి, 166/3ఆ2 సర్వే నంబరులో పుల్లగరి నర్సింహులుకు ఇచ్చిన 32 గుంటలూ నగరానికి చెందిన వ్యక్తి పేరుతోనే ఉన్నాయి.166/11లో ఓ రైతుకు 7 ఎకరాలను అసైన్డ్ చేయగా.. రెవెన్యూ దస్త్రాలను దిద్ది 17.36 ఎకరాలుగా మార్చారు. ఓ మాజీ ప్రజాప్రతినిధి పేరుపై ఈ విస్తీర్ణం మారింది. 166/39 సర్వే నంబరులో నీరుడి సత్తెమ్మ అనే మహిళా రైతుకు ప్రభుత్వం మూడు ఎకరాల ఎసైన్డ్ భూమి ఉండగా ఓ ప్రజాప్రతినిధి పేరుపైకి మార్చారు. 166/40 సర్వే నంబరులోని కుమ్మరి ఆండాలుకు 1.20 ఎకరాలు అసైన్డ్ భూమి ఉండగా ఒక ఎకరం మండలానికి చెందిన స్థానిక ప్రజాప్రతినిధి పేరుపైకి మారింది.
గడ్డ పోచారంలో పేదల గడ్డి తింటున్న నేతలు..!
గడ్డ పోచారం పరిధిలో 79వ సర్వే నంబరులో 134 ఎకరాల సీలింగ్ భూమిని గతంలో దిల్ సంస్థకు కేటాయించారు. ప్రభుత్వం తిరిగి తీసుకోగా దీనిలో 34 ఎకరాలను కొందరు దొంగ పత్రాలతో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఆలీనగర్లోని 42వ సర్వే నంబరులో 36 ఎకరాలు కనుమరుగు అయింది.
అసైన్డ్ భూములను కబ్జా చేస్తే ఆర్నెల్ల జైలు శిక్ష
ఎవ్వరైనా అసైన్డ్ భూములను కబ్జా చేస్తే 6 నెలల జైలు శిక్ష లేదా 2 వేల జరిమానా విధించే అవకాశం ఉంది. అయితే ఇందుకు మెజిస్ట్రేట్ పవర్ ఉన్న అధికారి పిర్యాదు చేయాలి. లబ్దిదారులు కాకుండా వారసులు అనుభవించకుంటే.. పిఓటీ చట్టం ప్రకారం క్రిమినల్ ప్రొసీడింగ్ ద్వారా శిక్షలు ఖరారు చేయవచ్చు. కాని అధికారులే కుమ్మక్కు కావడంతో ఎక్కడా ఒక్క కేసు కూడా కాలేదు. ప్రభుత్వం కక్ష కడితే.. మాజీ మంత్రి ఈటల రాజేందర్ లాంటి వ్యవహారం బయటకు వస్తేనే బెదిరింపులకు పాల్పడుతున్నారు తప్ప లీగల్ గా వెళ్లడం లేదు.
యాద్రాది జిల్లాలో 90 వేల ఎకరాల అసైన్డ్, మిగులు భూములు ఏమయ్యాయి. తెలంగాణ వచ్చాక ఏ లీడర్ కి ఎంత చేరింది. అడ్డగోలుగా వెనకేసిన నేతలకు టీ.ఆర్.ఎస్. హై కమాండ్ వార్నింగ్ లు ఏంటో పార్ట్- 5లో చూద్దాం.