అంగట్లో అన్నీ ఉన్నా అల్లుని నోట్లో శని అన్న చందంగా మారింది అన్నాడీఎంకే బహిష్కృత నేత, జయలలిత సన్నిహితురాలు శశికళ పరిస్థితి. అసెంబ్లీ ఎన్నికల్లో చక్రం తిప్పాలని.. అవకాశం ఉంటే ముఖ్యమంత్రి కావాలని కూడా కలలుకంటున్న శశికళ ఆశలు తీరేట్టు లేవు. శశికళ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అర్హురాలు కారని న్యాయ నిపుణులు చెబుతున్నారు.
ప్రజాప్రాతినిధ్య చట్టం-1951లోని సెక్షన్ 8 ప్రకారం.. ఎవరైనా ఒక వ్యక్తి ఏదైనా ఒక నేరం కింద, జైలుశిక్ష అనుభవిస్తే ఎన్నికలలో పోటీకి అనర్హులు. అలాగే1988 సెక్షన్ 8(1)ఎం అవినీతినిరోధక చట్ట ప్రకారం ఎన్నికల్లో పోటీ చేసేందుకు అస్సలు అవకాశం లేదు. ఆ చట్టం ప్రకారం శిక్షార్హమైన తేదీ నుంచి 6 ఏళ్లపాటు ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హులే. ఈ లెక్కన మరో ఆరేళ్లు ఆమె ఎన్నికల్లో పోటీ చేయలేరు.
ఈ ఏడాది ఏప్రిల్ లేదా మేలో తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశముంది. ఇప్పుడే కాదు మళ్లీ ఐదేళ్లకు అంటే 2026 ఏప్రిల్‌లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఆమె పోటీ చేసేందుకు చాన్స్ లేదు. దీంతో శశికళ కింగ్‌మేకర్ కావచ్చు.. కింగ్ మాత్రం కాలేరని అంటున్నారు న్యాయ నిపుణులు