తెలంగాణలో కాంగ్రెస్‌ను దెబ్బకొట్టేందుకు ప్రత్యర్థులు పెద్దగా శ్రమించాల్సిన అవసరమే లేకుండా పోతోంది. బుర్ర బద్దలు కొట్టుకొని, రాత్రిళ్లూ కూర్చొని స్కెచ్‌లు వేయాల్సిన కష్టమూ తప్పుతోంది. టీఆర్ఎస్ నేతలు హాజరయ్యే ఏదో ఓ కార్యక్రమానికి కాంగ్రెస్ నేతలని పిలిస్తే చాలు.. ఆ వేదిక కిందే పెద్ద గొయ్యి తీసి తమ పార్టీని పాతరేస్తారు హస్తం నేతలు. తాము ఏ పార్టీలో ఉన్నామోనన్న విషయం కూడా మరిచిపోయి అధికార పార్టీని వేన్నోళ్ల పొగుడుతారు.
నిన్న వీహెచ్.. మొన్న ఉత్తమ్‌కుమార్ రెడ్డి.. అంతకుముందు జానారెడ్డి, మరికొందరు.. ఇలా తరచూ ఎవరో ఒక నేత తమ వంతుగా తెలంగాణలో కాంగ్రెస్‌ను ముంచేయడానికే కంకణం కట్టుకుంటున్నట్టుగా కనిపిస్తున్నారు. తాజాగా మున్నూరు కాపు సంక్షేమ సంఘం నిర్వహించిన ఓ కార్యక్రమానికి హాజరైన ఆ పార్టీ సీనియర్ నేత వీహెచ్ కేసీఆర్‌పై ప్రశంసలు కురిపించి ఆశ్చర్యపరిచారు. బీసీల కోసం ఎన్నో చేస్తున్నారంటూ ఆకాశానికెత్తారు. అదేంటని అడిగితే.. పొగడితే తప్పేముందని పాత్రికేయులకే ఎదురు ప్రశ్న వేశారు. అంతేకాదు గతంలో హుజూర్‌నగర్‌లో సభలో స్వయానా పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కేటీఆర్‌కు డైనమిక్ లీడర్ అని పొగడలేదా అని గుర్తు చేసి.. తనను తాను సమర్థించుకున్నారు .
గతంలో జానారెడ్డి అంతే.. సరిగ్గా జీహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో 5 రూపాయల భోజనం పథకం చాలా బాగా అమలు చేస్తున్నారంటూ కేసీఆర్‌ని కొనియాడారు. ఆయన అన్న మాటకు.. నాటి గ్రేటర్ ఎన్నికల్లో తగిన మూల్యమే చెల్లించుకుంది. వీరే కాదు అప్పుడప్పుడు జగ్గారెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మరికొందరు నేతలు కూడా తాము ప్రతిపక్షంలో ఉన్నామనే సంగతి కూడా మరిచిపోయిన కేసీఆర్‌పై వల్లమాలిన ప్రేమ కురిపిస్తారు. అంతే..అంతే.. కాంగ్రెస్‌కు ఎవరో ప్రత్యేకంగా ప్లాన్ చేసి చంపాల్సిన అవసరమే లేదు.. స్వయంగా ఆ పార్టీ నేతలే దగ్గరుండి పార్టీకి ఊరి వేస్తుంటారు ఇలాగా!