ప్రపంచాన్ని మునుపెన్నడూ లేని విధంగా వణికించిన కరోనా వైరస్ తెలంగాణలో వెలుగుచూసి సరిగ్గా ఏడాది అవుతోంది. హాంగ్‌కాంగ్ నుంచి బెంగళూరు…అటు నుంచి హైదరాబాద్ చేరుకున్న ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగిలో సరిగ్గా ఇదే రోజు మొదటి కేసు బయటపడింది. అది మొదలు ఆ మాయదారి మహమ్మారితో రాష్ట్రమంతా ఇప్పటికీ వణికిపోతూనే ఉంది. తొలినాళ్లలో.. వైరస్ గురించి పూర్తి అవగాహన లేకపోవడంతో హైదరాబాద్ వాసులైతే హడలెత్తిపోయారు. వైరస్ కేసు బయటపడిందంటే చాలు.. ఆ ప్రాంతాన్ని మొత్తం ఖాళీ చేసి వెళ్లిపోయే సన్నివేశాలు కనిపించేవి.
మరోవైపు ప్రజలను అప్రమత్తం చేయాల్సిన, జాగ్రత్తలు చెప్పాల్సిన రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్.. మొదట్లో చాలా నిర్లక్ష్యంగా మాట్లాడి విమర్శలు మూటగట్టుకున్నారు. కరోనా వైరస్ గురించి ప్రస్తావించిన కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్కను అసెంబ్లీ వేదికగా చులకన చేసి మాట్లాడారు. పైగా జస్ట్ పారసిటమల్ వేసుకుంటే సరిపోతుంది.. ఎండకు వైరస్ కాలిపోతుంది, పేలిపోతుంది అంటూ రాష్ట్రాన్ని తప్పుదోవ పట్టించారు. అవసరమైతే తాను, ఎమ్మెల్యేలందరూ కలసి కరోనా వైరస్ రాష్ట్రంలోకి రాకుండా అడ్డుకొంటామని విపత్తును చిన్నదిగా చూపేందుకు ప్రయత్నించారు. ప్రజల ప్రాణాలను రిస్క్‌లో పెట్టారు. చూస్తుండగానే వైరస్ రాష్ట్రం మొత్తాన్ని కమ్మేయడంతో ఆలస్యంగా దిద్దుబాటు చర్యలు తీసుకున్నారు. కానీ అప్పటికే పరిస్థితి చేయిదాటిపోయింది. విపరీతమైన కేసులు పెరిగాయి. మరణాలు కూడా భారీగానే సంభవించాయి. కానీ ప్రభుత్వం మాత్రం తమ తప్పులని బయటపడనీయకుండా.. ఎప్పుడూ తప్పుడు లెక్కలనే చూపిస్తూ వచ్చింది. జిల్లా అధికారులు, రాష్ట్ర అధికారులు చెప్పే గణాంకాలను అసలు పొంతనే ఉండేది కాదు. ప్రభుత్వం చెప్తున్న అసత్యాలపై స్వయంగా హైకోర్టు కూడా మండిపడిన సందర్భాన్ని రాష్ట్రం చూసింది.
ఏడాది పూర్తయినా.. ఇప్పటికీ కరోనా గురించి రాష్ట్ర ప్రభుత్వం చెప్పే లెక్కలపై ఎవరికీ పెద్దగా నమ్మకం లేకుండాపోయింది. ఇక టెస్టులు పెంచాలని హైకోర్టు పదే పదే ఆదేశించినా.. కేసీఆర్ సర్కార్ లెక్క చేయలేదు.ఇటీవల ఏకంగా కరోనా హెల్త్ బులెటిన్ ప్రకటించడం కూడా ఆపేస్తున్నట్టు ప్రకటించి… నవ్వులపాలైంది. మళ్లీ హైకోర్టు జోక్యంతో కేసుల వివరాలను ప్రకటిస్తోంది.