– భద్రాది, ములుగు జిల్లాల్లో యథేచ్ఛగా ఇసుక దందా!
– తొలివెలుగు క్రైంబ్యూరో ఇన్వెస్టిగేషన్
– వెలుగుచూసిన సంచలన నిజాలు
– బినామీల మాటున బడా దందా
– ఒత్తిడిలో కలెక్టర్లు..
– ఎమ్మెల్యేలు, మంత్రులే దొపిడీదారులు!
– ఆ బినామీల పేర్లు చెప్పే దమ్ము మాకుంది?
– అడ్డుకునే సత్తా అధికార పార్టీకి ఉందా?
క్రైం బ్యూరో, తొలివెలుగు:ఇసుకైనా? మట్టైనా? గుట్టైనా? కొండైనా? గులాబీలు కన్నేస్తే మాయం కావాల్సిందే. మూడు కబ్జాలు.. ఆరు దందాలు అన్నట్లుగా రాష్ట్రంలో సాగుతోంది వ్యాపారం. ఇసుక మాఫియాపై తొలివెలుగు క్రైంబ్యూరో ఇన్వెస్టిగేషన్ లో ఈ సంచలన విషయాలు వెలుగుచూశాయి. కాంగ్రెస్ హయాంలో ఇసుక నుంచి రూపాయి ఆముదాన్ లేదు.. మాఫియా నడిపించారని.. ఇప్పుడు వేల కోట్ల ఆదాయం వస్తుందని కేటీఆర్ చెబుతున్నారు. ఈ క్రమంలోనే ఇసుక క్వారీల్లో కేటాయింపులతో పాటు.. తవ్వకాలపై తొలివెలుగు క్రైంబ్యూరో కూపీ లాగింది. దీంతో ఆదాయం మాటున ఆరాచాకాలన్నీ బయటపడ్డాయి. ఖజానాకు వచ్చేది 25 శాతం అయితే.. దోచుకునేది 75 శాతమని తేలింది. దీనికి తోడు ఎజెన్సీ ఏరియాల్లో ఆదివాసీల హక్కులను కాలరాస్తూ.. గులాబీ బినామీలు పేట్రేగిపోతున్నట్లు తొలివెలుగు తెలుసుకుంది.
ఒక్క క్యూబిక్ మీటర్ ఇసుకకు 590 రూపాయలు సంపాదించాల్సిన సహకార సంఘాలకు.. 40 రూపాయలు మాత్రమే అందుతున్నాయి. ఫలితంగా ఆయా కుటుంబాలకు తీరని అన్యాయం జరుగుతోంది. అందుకు టీఎస్ ఎండీసీ తెరచాటు పాలసీ విధానం, అగ్రిమెంట్ల అరాచకమే కారణం. ఆరు నెలల్లో ఒక్కొక్క కుటుంబం లక్ష రూపాయల వరకు సంపాదించాల్సి ఉండగా.. నాలుగు వేలకు మాత్రమే సరిపెట్టుకుని దీనావస్థలో బతికేస్తున్నాయి. ఇసుకపై 3 వేల కోట్ల ఆదాయం తెస్తున్నామని చెబుతున్న అధికార పార్టీ.. 10 వేల కోట్ల దందా కొనసాగిస్తోంది. కాంగ్రెస్ హయంలో 50 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక అమ్మితే.. ఇప్పుడు ఏటా 5 కోట్ల 60లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుకను తోడేస్తున్నారు. గతంలో కంటే ఎంతో గిరాకీ ఉండటంతో ఈ దందాను యథేచ్ఛగా కొనసాగుతోంది.
భద్రాద్రిలో ఇసుక దందా ఇలా!
కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి టీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్న గిరిజన ఎమ్మెల్యేనే వారి కులాలకు తీవ్ర నష్టం చేసేలా వ్యవహరిస్తున్నారు. పినపాక, మణుగూర్, ఏడూళ్ల బయ్యారం, బుర్గంపాడులో ఈయన దందాలు కొనసాగుతున్నాయి. జిల్లాలు దాటి హైదరాబాద్ కి వచ్చేందుకు ఉమ్మడి జిల్లా మంత్రి అండదండలు ఉన్నాయి. ట్రాన్స్పోర్ట్ అధికారులు, ఇతరులు అడ్డురాకుండా పదవితో అడ్డుకుంటారు. మంత్రి బంధువులు నర్సపురం రిచ్, భద్రాచలం దగ్గర రిచ్ లు నడిపిస్తున్నారు. పద్మాగూడెం దగ్గర మంత్రికి కుడి భుజం అని చెప్పుకుంటూ.. లారీల అసోసియేషన్ అధ్యక్షుడు వాసు చక్రం తిప్పుతుంటారు. వారికి తోడుగా మాజీ ఎమ్మెల్సీ హవా కూడా కొనసాగుతోంది. ఆయన అనుచరుడు, కొత్త ఎమ్మెల్సీ కూడా ఇన్వాల్వ్ అవుతుంటారు. అంటే మొత్తం వ్యవహారం మంత్రితో పాటు ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్సీ, తాజా ఎమ్మెల్సీ ప్రమేయంతో నడుస్తోంది. వారి అకౌంట్స్ పై దర్యాప్తు చేస్తే ఎంత మొత్తం చేతులు మారుతున్నాయో బయటకొస్తుంది.
ములుగు జిల్లాలో ఇసుక దందా ఇలా!
ములుగు జిల్లాలో వరంగల్ కుమారుడు, ఖమ్మం అల్లుడు, నల్గొండ దత్తపుత్రుడు ఇసుక మాఫియాను ఏలుతున్నాడు. కేసీఆర్ కు తానే రైట్ హ్యాండ్ అని చెప్పుకుంటూ.. తన కనుసన్నల్లోనే దందా నడిపిస్తున్నాడు. వాజేడ్ మండలం, బొమ్మనపల్లిలో ఇసుక దందాను తన అనుచరులైన ప్రవీణ్ రెడ్డికి, మురళీధర్ రెడ్డిలకు అప్పగించాడు. ఇక ఏటూర్ నాగారం నుంచి ప్రజాప్రతినిధిగా ఎన్నికై అదే జిల్లా చైర్మెన్ గా ఉన్న నేత అక్కడ చూసుకుంటున్నారు. జిల్లా దాటిన తర్వాత గిరిజన మంత్రి అండదండలు పుష్కలంగా ఉన్నాయి. ఆమె నేరుగా కలెక్టర్స్ కి ఫోన్ చేసి చెబుతూ ఉంటారు. ఇక వెంకటాపూర్, వాజేడ్ లో దొర పేరు చెబితే అంతా హడల్. ఇక్కడ దొర ఎవరంటే లక్ష్మణ్ రావు. ఇతనికి అదే జిల్లాకు చెందిన మరో దొర మంత్రి అండదండలు ఉన్నాయి. మాజీ మంత్రిని ఓడించి.. మంత్రి అయిన మాజీ పోలీస్ బాస్ బంధువు కావడంతో అప్పటి టీడీపీ బంధాలు ఇంకా ఇసుకాసురులు కొనసాగిస్తున్నారు. ములుగులో ఇద్దరు మంత్రులు, ఎమ్మెల్సీ, జెడ్పీ ఛైర్మన్ ల బంధువులు, అనుచరుల కనుసన్నల్లో ఆదివాసీల తలరాతలు మార్చి దందా కొనసాగిస్తున్నారు.
జీఎస్టీ ఎగవేత, ఇతర జిల్లాల్లో ప్రాజెక్ట్ లు లేకుండానే పూడికతీత పేర్లతో ఎంత బొక్కారు. ఆదివాసీల ఇసుక పట్టా భూములపై అధికారుల తీరు.. తోడేసేవాడికి తోడేసినంత డబ్బు… ఎలా సంపాదిస్తారో పార్ట్-3లో చూద్దాం.