– మేడిగడ్డలో మకాం వేసిన ఇసుకాసురులు
– కాళేశ్వరం సాక్షిగా ఇసుకంతా ఖాళీ!
– ప్రాజెక్టులు కట్టకుండానే పూడికతీత
– ఏడేళ్లుగా గులాబీల దందా
– గ్రానైట్ మాఫియాకే ఇసుక క్వారీలు
– చక్రం తిప్పిన గంగుల కమలాకర్!
– ఎన్జీటీనే ఏమార్చి దందా
– ఇసుక మాఫియా ఆగడాలపై..
– తొలివెలుగు క్రైంబ్యూరో పరిశోధనాత్మక కథనం
మాయ చేయడంలో గులాబీలను మించినవారు లేరేమో. ఆదాయ వనరుగా ఏది కనిపించినా అక్కడ వాలిపోతుంటారు. అలా.. కాళేశ్వరం సాక్షిగా మేడిగడ్డ వారికి పెద్ద ఖజానాగా కనిపించింది. ఏదైనా ప్రాజెక్ట్ ఇసుక మేటలతో నిండిపోతే.. పూడిక తీసేందుకు ఎలాంటి పర్యావరణ అనుమతులు లేకుండా జేసీబీలతో తీయవచ్చు. అసలు ప్రాజెక్ట్, బ్యారేజీలే ప్రారంభం కాకుండా ఆ పేర్లతో ఇసుక దందా చేస్తే ఏమనాలి. మూడు నుంచి 5 ఫీట్లు తీయాల్సిన చోట.. 20 ఫీట్ల ఇసుక తోడేస్తే వారిని ఏమనాలి. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పేర్లతో టీఆర్ఎస్ నేతలు ఈ ఏడేళ్లుగా చేస్తున్న ఇసుక దోపిడీ అక్షరాల రూ.6 వేల కోట్లు. అధికారికంగా ఆదాయం వస్తుందని చెబుతున్నా.. ఆదాయానికి మించిన అక్రమార్జన ఉంటోంది. పర్యావరణ, భూగర్భ జలాలను పట్టించుకునేది లేదు.
2015లోనే దందా ప్రారంభం- గ్రానైట్ మాఫియాకు రెడ్ కార్పెట్
ప్రాజెక్టుల డిజైన్ ప్రారంభం కాకముందే.. కంతనపల్లిలో మొదటగా ఇసుక టెండర్లను ప్రారంభించారు. ఇక్కడ ప్రాజెక్ట్ లేదు. ఇప్పటికీ రాలేదు. కానీ.. ఇసుక టెండర్లు మాత్రం పిలిచి గోదావరి నదిలో విధ్వంసం సృష్టించారు. కంతనపల్లిలో ప్రాజెక్ట్ వస్తుందని ఊహించుకుని ఇసుక మాఫియాకు అనుమతులు ఇచ్చారు. అయితే.. ఇక్కడి నుంచే చిన్నా చితక వ్యాపారులకు టెండర్లలో అవకాశం ఇవ్వలేదు. మైనింగ్ శాఖలో పనిచేసిన అనుభవం ఉండాలని షరతులు పెడుతూ.. కఠిన నిబంధనలతో తక్కువలో తక్కువ 5 కోట్ల పని చేయాలని టెండర్లు పిలిచారు. అయితే.. అప్పటికే ఉమ్మడి కరీంనగర్ లో పేట్రేగిపోతున్న గ్రానైట్ మాఫియాకు ఇసుక టెండర్లు వరంలా ఎదురు వచ్చాయి. గ్రానైట్ తో పొల్చుకుంటే.. ఖర్చు తక్కువ, దందాలు ఎక్కువ. అంతా బ్లాక్ మనీగా చలమణి కావచ్చు. ఇలా ఎన్నో లాభాల పంట పండించే ఇసుక బిజినెస్ లోకి ఎంటర్ అయ్యారు గ్రానైట్ వ్యాపారులు. అందుకు అప్పటి ఎమ్మెల్యే, ఇప్పటి మంత్రి గంగుల కమలాకర్ చక్రం తిప్పారు. దీంతో సామాన్య బిజినెస్ మెన్స్ కి అక్కడ చోటు లేకుండా టీఆర్ఎస్ నేతలకే పట్టం కట్టేలా టెండర్స్ పిలుచుకున్నారు. ప్రాజెక్టుల పేరుతో ఏడేళ్లుగా రూ.6 వేల కోట్ల బ్లాక్ దందా చేసినట్లు తీవ్ర ఆరోపణలు ఉన్నాయి.
అక్రమ దందాలకు అడ్డులేదు!
ఒక్క క్యూబిక్ మీటర్ ఇసుక తవ్వేందుకు ప్రభుత్వం 100 రూపాయలు కోడ్ చేస్తే.. పెరిగిన డిజిల్ ధరకు 85 రూపాయలకు కూడా తీసి ఇస్తున్నారు. అయితే.. ఇందులో అనేక అక్రమాలు జరుగుతున్నాయి. ఇసుక ఎంత చిక్కగా ఉన్నా.. 9 ఫీట్ల కంటే లోతు తీయకూడదు. కానీ.. ఇక్కడ 20 ఫీట్ల వరకు తోడేస్తున్నారు. ప్రాజెక్టులో పూడికతీత పేర్లతో గోదావరిని గుంతల మయం చేస్తున్నారు. అక్రమాలకు చెక్ పేట్టేందుకు సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. కానీ.. అవి పనిచేయవు. పని చేసినా.. ఇసుక తీసే వద్ద కాకుండా పెట్టేస్తారు. ఎంత కట్టడి చేసేలా ప్రయత్నం చేసినా మాఫియాకు లాభాలు వస్తూనే ఉంటాయి. అందుకు లారీల్లో ఎక్స్ట్రా బకెట్ కి ఓనర్లు 2 నుంచి 5 వేలు ఇస్తారు. ఇలా ఒక్కొక్క క్వారీ నుంచి 300 లారీలు బయటకు వస్తాయి. ఒక్క వే బిల్లుకి వారం రోజుల సమయం ఉంటుంది. ఆ వారం రోజుల అనుమతులతో ఒక్కొక్క లారీ మూడు సార్లు అక్రమంగా తిరిగేస్తుంది. చిన్న చిన్న పట్టణాలకు అసలు వే బిల్లు కూడా అవసరం లేకుండా రవాణా చేస్తున్నారు. ఇలా ఎన్నో రకాలుగా ఇసుక అక్రమార్జనకు పుట్టినిల్లుగా మార్చేశారు.
కొస మెరుపు ఏంటంటే..?
పూడిక పేరుతో ప్రారంభం కాని ప్రాజెక్టులకు, బ్యారేజీలకు ఇసుక అనుమతులు ఇచ్చిన సర్కార్… శ్రీరాం సాగర్ ప్రాజెక్ట్ పై శ్రద్ధ చూపకపోవడం వివాదాస్పదమౌతోంది. అక్కడ మట్టి ఎక్కవగా ఉండటంతో ఇసుక తక్కవగా దొరకడంతో.. గులాబీల ఇసుక మాఫియాకు గిట్టుబాటు కాదని టెండర్లు పిలువడం లేదు. అదే వివిధ ప్రాజెక్టుల్లో నిండిన పూడిక తీసివేత కూడా ఈ ఇసుక టెండర్లకు లింకు పెడితే.. బాగుంటుందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
మేడిగడ్డ, అన్నారం, సుందిళ్లలో ఇసుక మాఫియా ఆగడాలకు ఎన్జీటీలో ఏం జరిగింది. ఎవరెవరు లాబీయింగ్ చేసి.. మొదటి కమిటీ ఇచ్చిన నివేదికకు వెయ్యి కోట్ల ఫైన్ విధిస్తుందని.. ఏమార్చి కమిటీని మార్పించారు. మరో కమిటీ ఇచ్చిన నివేదిక ఏంటీ. ఇసుక మాఫియాకు అండగా ఉన్న ప్రభుత్వ పెద్దల గురించి ఇసుకాసురులు పార్ట్-5 లో చూద్దాం.