– అందినకాడికి దోచుకోవడమే లక్ష్యం
– రిపోర్టులు లేకుండానే దందా?
– తిక్నెస్ లేని చోట 4 మీటర్ల తవ్వకాలు
– అధికారికంగా రూ.3 వేల కోట్ల ఆదాయం
– అనధికారికంగా రూ.6 వేల కోట్లు మాయం
– మహిమ కమిటీ రిపోర్ట్ లో భయంకర నిజాలు
– తీర్థయాత్రలా కామేశ్వర్ కమిటీ టూర్
– సుప్రీంలో రేలా సంస్థ అప్పీల్
క్రైం బ్యూరో, తొలివెలుగు:పర్యావరణం అంటే భూమి, నీరు, గాలి, చెట్లు, జీవ జంతు జాతుల రూపంలో మన చుట్టూ ఉన్న ప్రకృతి. ఇది మానవ మనుగడకు, అభివృద్ధికి అత్యంత ఆవశ్యకం. వాటిలో దేన్ని నిర్లక్ష్యం చేసినా పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయి.. చెట్లు పెంచుతున్నాం కదా అని మట్టిని నిర్లక్ష్యం చేసినా.. కాంక్రీట్ జంగిల్ కోసం ఆరాటపడి ఇతర వాటిని నిర్లక్ష్యం చేసినా.. సరదా తీర్చేస్తాయి. టీఆర్ఎస్ పాలనలో పైకి ఎన్ని కబుర్లు చెప్పినా.. జరగాల్సిన పర్యావరణ నష్టం జరిగిపోతోంది. ఒక రకంగా చెప్పాలంటే.. ఉక్రెయిన్ పై రష్యా దాడులు చేసినట్లు.. 111 జీవో, ఇసుక అక్రమాలతో విధ్వంసం సృష్టిస్తున్నారు. కళ్లముందే ఇంత జరుగుతున్నా సరిగ్గా ప్రశ్నించే పరిస్థితి లేకపోవడంతో భవిష్యత్ భయంకరంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు పర్యావరణవేత్తలు. మేడిగడ్డ దగ్గర ఇసుక తవ్వకాలనే చూడండి.. 3 వేల ఎకరాల్లో అక్కడ సృష్టించిన ఇసుక మాఫియా ఆగడాలు అన్నీ ఇన్నీ కావు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ప్రభుత్వం చెప్పిన వ్యవహారానికి.. చేస్తున్న ఆరాచకాలకు పొంతన ఉండడం లేదు. అందుకే తొలివెలుగు క్రైంబ్యూరో అన్నీ బట్టబయలు చేస్తోంది.
ఎన్జీటీలో ఇలా..!
గోదావరిలో జరుగుతున్న ఇసుక దందాపై రేలా అనే స్వచ్ఛంద సంస్థ 2015లో ఎన్జీటీని ఆశ్రయించింది. దీంతో 2018లో టెక్నికల్ కమిటీని నియమించారు. అయితే.. ఆ కమిటీ రెండు రోజుల్లోనే ఏపీ, తెలంగాణ జిల్లాల్లో పర్యటించినట్లు పేర్కొన్నారు. బోటింగ్ చేసిన ఫోటోలతో రిపోర్టు సమర్పించారు. బేగంపేట్ లోని టూరిజం హోటల్ లో మంచి బస ఏర్పాటు చేసిన టీఎస్ ఎండీసీ అన్ని దగ్గరుండి రాచమర్యాదలు చేసింది. దీంతో రిపోర్ట్ అంతా.. తప్పుల తడకగా నివేదించారు. ఎన్జీటీ జడ్జి ఆదర్శ్ కుమార్ ఆ కమిటీకి చివాట్లు పెట్టి విహారయాత్రకు వెళ్లి వచ్చారా.. ఇసుక అక్రమాల ఆరా తీసేందుకు వెళ్లారా అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ రిపోర్టును ముఖంపై పడేసి కమిటీని రద్దు చేశారు. తర్వాత 2019లో సెంట్రల్ పొల్యూషన్ బోర్డ్ సైంటిస్ట్ అయిన మహిమ ఛైర్మన్ గా మరో నలుగురు నిఫుణులతో కమిటీ వేశారు. వారు మే నెలలో పర్యటించారు. ఈ క్రమంలోనే ఆ కమిటీ ఇచ్చిన నివేదికతో సంచలన విషయాలు బయటపడ్డాయి.
మహిమ రిపోర్ట్ లో ఏముంది?
2015లో కంతనపల్లిలో ప్రాజెక్ట్ ప్రారంభం కాకపోయినా బ్యారేజ్ పేరుతో ఇసుక తీశారు. 2016లో మేడిగడ్డ, అన్నారం బ్యారేజ్ వద్ద 5కోట్ల 70 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుకను తీసేలా టెండర్లు పిలిచారు. అందుకు ఓ కమిటీని నియమించారు. వారు జాయింట్ ఇన్స్పెక్షన్ చేసి మొత్తం 8 మీటర్ల తిక్నెస్ ఉంది.. మూడు మీటర్ల వరకు తోడుకోవచ్చని తేల్చారు. కానీ.. ఎన్జీటీ నివేదిక ప్రకారం 1.5 నుంచి 3 మీటర్ల వరకు తిక్నెస్ ఉంది. ఒక్కొక్క చోట నాలుగు మీటర్లు మాత్రమే ఉంది. మూడు మీటర్లు ఉంటే.. ఒక్క మీటర్ మాత్రమే ఇసుక తీసుకునే అధికారం ఉంటుంది. దీంతో పెద్ద ఎత్తున అక్రమాలకు తెరతీశారు. 3 వేల ఎకరాల్లో 4 మీటర్లు తోడారు. నీళ్లు వస్తే తోడవద్దని షరతులు ఉన్నాయి. కానీ.. ఎన్ని నీళ్లు వచ్చినా నదిలో గుంతల మయంతో విధ్వంసం సృష్టించారు.
కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి నీళ్లు!
దేశవ్యాప్తంగా సమగ్ర ఇసుక నియంత్రణ రూల్స్ ని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. సుప్రీంకోర్టు అదేశాల మేరకు చాలా కఠినంగా వ్యవహరించాలి. కలెక్టర్ చైర్మన్ గా మొదటగా ఏఏ జిల్లాలో ఏంత ఇసుక ఉందో.. ఎన్ని మీటర్ల తిక్నెస్ ఉందో నివేదికను ఎప్పటికప్పుడు సమర్పించాలి. కానీ.. జయశంకర్ భూపాలపల్లిలో ఇది మచ్చుకు కూడా కనిపించలేదని మహిమ రిపోర్టు తేల్చింది.
డబుల్ బెడ్రూంల పేరుతో టెండర్లు
గోదావరి నదిలో మేడిగడ్డ వద్ద ఇసుక తీసేందుకు కమిటీ ఓ నివేదిక తయారు చేసింది. డబుల్ బెడ్రూంతో పాటు మిషన్ భగీరథ, ఇతర ప్రాజెక్ట్ ల కోసం మాత్రమే వాడుతామని తెలిపింది. కానీ.. ఆన్ లైన్ ద్వారా అమ్మకం చేపట్టి 3వేల కోట్ల రూపాయల ఆదాయాన్ని సమీకరించారు. ఒక వైపు ప్రాజెక్ట్ లేకుండా పూడిక తీత అంటూ పర్యావరణాన్ని సర్వనాశనం చేసిన మాఫియా.. ఆ తర్వాత ప్రాజెక్ట్ ల నిర్మాణం, ప్రభుత్వ పథకాల కోసం కూడా వాడినట్లు కోర్టుకు తెలిపారు.
జియో ట్యాగ్స్ మచ్చుకైనా కనిపించవు!
ఇసుక టెండర్లకు జియో ట్యాగ్ చేసి.. ఎక్కడ చేయాలో అక్కడ మాత్రమే తోడివేయాలి. అందుకు సిమెంట్ పోల్స్ పర్మినెంట్ గా ఉంచాలి. కానీ.. కేవలం ఎవరైనా దర్యాప్తునకు వస్తున్నారంటే.. ఎర్రటి జెండాలు పాతి చూపిస్తారు. ఇక్కడే ఇష్టం వచ్చినట్లు.. 3వేల ఎకరాలకు అనుమతి ఉంటే.. 5 వేల ఎకరాల్లో కూడా ఇసుక తీశారని ఆరోపణలు ఉన్నాయి. రెండు మీటర్లకు లెక్కలు వేసి నాలుగు మీటర్ల వరకు అక్రమంగా తవ్వకాలు జరిపారంటే.. ఎంత దోపిడీ జరిగిందో అర్థం చేసుకోవచ్చు. 6 వేల కోట్ల అక్రమ ఇసుకను తరలించారని తెలుస్తోంది. రికార్డుల్లో కొన్ని పేర్కొన్నట్లు మహిమ కమిటీ తేల్చింది.
పనిచేయని వేయింగ్ మిషన్స్!
16 ఆటోమేటిక్ వేయింగ్ మిషన్స్ ఏర్పాటు చేసినా.. లారీలు అటు వైపు చూడవని తెలిసింది. ఎక్స్ ట్రా బకెట్ తో 10 నుంచి 15 టన్నుల ఇసుక ఒక్క లారీలోనే అక్రమంగా వెళ్తోంది. దీంతో వేయింగ్ మిషన్స్ ఉత్సవ విగ్రహాల్లా ఉంటున్నాయి.
వేల కోట్ల రూపాయల రోడ్లు నాశనం
జాతీయ రహదారులు, గ్రామీణ రోడ్లన్నీ నాశనం చేస్తున్నారు. పంట పొలాలన్నీ ఇసుకతో నిండిపోతున్నాయి. ఎన్ని ఫిర్యాదులు అందినా.. పట్టించుకునే నాథుడే లేడు. వేల కోట్ల విలువ చేసే రోడ్లను ఓవర్ లోడ్ తో గుంతలమయం చేస్తున్నారు. భూపాలపల్లి జిల్లాలో ఈ అరాచకం కనిపిస్తోంది. ఇప్పటి వరకు 300 మంది ఇసుక లారీల రోడ్డు ప్రమాదాల్లో చనిపోయారని లెక్కలు చెబుతున్నాయి. ఆ కుటుంబాలు రోడ్లపై ధర్నా చేసినా.. న్యాయం జరగడం లేదు. పోలీసులు పట్టించుకోవడం లేదు. పాలకుల మాముళ్ల మత్తులో ఊగుతున్నారు.
కామేశ్వర్ కమిటీ.. ఇలా!
ఎన్జీటీ వేసే కమిటీ.. ఫిర్యాదు దారుడికి, ప్రభుత్వానికి తెలియకుండానే వచ్చి సర్వే చేసి రిపోర్టు ఇవ్వాల్సి ఉంటుంది. కానీ.. 2020లో తెలుగు వాడైన కామేశ్వర్ రావు కమిటీ ప్రభుత్వ రాచమర్యాదలతో తిరిగింది. హైదరాబాద్ లో ఫైవ్ స్టార్ హోటల్ లో బస చేసింది. హెలికాప్టర్ లో మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలను పరిశీలించింది. నిండు కుండల్లా ఉన్న బ్యారేజీలో ఇసుక గురించి చెప్పే ప్రయత్నం కూడా చేయలేదు. ప్రభుత్వం ఎలా నిర్మాణం చేపట్టిందో గొప్పలతో కూడిన నివేదికను ఎన్జీటీకి సమర్పించారు. అసలు ఎంత ఇసుక తీశారు. ఎలా చేశారో కనీసం ఒక్క శాతం కూడా చెప్పలేకపోయింది కమిటీ. ఈ నివేదికపై సుప్రీం కోర్టులో అప్పీల్ కి వెళ్లింది రేలా సంస్థ.
ప్రభుత్వం టీఎస్ఎండీసీ అనే కంపెనీని పెట్టి దోచుకుంటోంది. ఇక్కడ కేజీఎఫ్ లా ఇసుక మాఫియాను నడిపిస్తున్న డాన్ ఉన్నాడు. ఆదాయం మాటున అరాచకం సృష్టిస్తున్న ఆ వైనం ఎలా ఉంటుందో.. ఇసుకాసురులు పార్ట్-6లో చూద్దాం.