– గులాబీ లిమిటెడ్ కంపెనీగా టీఎస్ఎండీసీ
– అక్రమార్కుల అడుగులకు మడుగులొత్తుతున్నఎం.డీ
– సీనియర్ ఐఏఎస్ లకు బదులు..సహకార శాఖ ఉద్యోగి
– టీఆర్ఎస్ గ్యాంగ్ ఏదడిగినా..మన్సూర్.. జీ హుజూర్!
– ఆదాయం కంటే మూడింతల అక్రమార్జనే ధ్యేయం
– కలెక్టర్లు చట్టాలు,రూల్స్ అంటే..బదిలీ చేయించే సత్తా..?
– ఆదాయం మాటున అరిచేతిలో స్వర్గం..అక్రమంగా అనేకం
– ఇసుకాసురులకే అగ్రతాంబూలం అంటున్న…
– టీఎస్ఎండీసీపై క్రైం బ్యూరో ప్రత్యేక కథనం
– ఇసుకారులు పార్ట్ – 6
తెలంగాణ రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ దందా మూడు టెండర్లు..పది క్వారీలుగా వెలిగిపోతోంది. ప్రభుత్వానికి ఆదాయం పేరుతో 500 కోట్ల నుంచి 3 వేల కోట్ల వరకూ ఈ యవ్వారాన్నిలాక్కొచ్చినట్టు కలరింగ్ ఇస్తున్నారు. కానీ ఆ మూడు వేల కోట్ల వెనుక 10 వేల కోట్ల అక్రమ దందా నడుస్తుందంటే ఎవ్వరైనా నోరెళ్లబెట్టాల్సిందే. ఇదంతా గులాబీ పార్టీ నేతల జేబులు నింపేందుకు మాత్రమే అన్నట్టుగా పని సాగుతుంటుంది.ఎక్కడా ఎలాంటి అక్రమాలకు తావు లేకుండా నడవాల్సిన కార్పోరేషన్ అవినీతి, అక్రమాలకు అడ్డాగా మారింది. ఈ ఇసుక దోపిడీ యవ్వారంపై తొలివెలుగు క్రైం బ్యూరో ఇప్పటికే 5 ప్రత్యేక కథనాలను ప్రజల ముందు ఉంచింది. ఇప్పుడు ఆదివాసుల హక్కులను కాలరాస్తూ..తీసుకున్ననిర్ణయాలపై సమాధానం రాదు.అగ్రిమెంట్ల పై దర్యాప్తు చేయ్యరు. తోడేళ్లలా ఎంత తోడుకున్నా పట్టించుకునే నాథుడే ఉండడు. శాండ్ అంశంలో శాడిస్టుల్లా వ్యవహరించినా నోరెత్తరు. పైగా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు..ఎంపీలు,ఎమ్మెల్సీల అడుగులకు మడుగులు ఒత్తుతూ ఇసుక దందాతో వేల కోట్ల అక్రమార్జనకు తెరలేపారు.
మన్సూర్ మాటే వేదం
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఎస్.ఎస్.రావత్ లాంటి సీనియర్ ఐఏఏస్ లు..తెలంగాణ వచ్చిన కొత్తలో లోకేష్ కుమార్,ఎలంబర్తి లాంటి ఆఫీసర్స్ పనిచేశారు. ప్రభుత్వ ఆదాయ మార్గంలో ఆలోచిస్తూనే.. అనధికారిక కార్యక్రమాలకు బ్రేక్ లు వేశారు.దీంతో ..వెటర్నరీ డిగ్రీ చదివి.. సహకార శాఖలో ఉద్యోగం పొంది..ఇరిగేషన్ శాఖకు డిప్యుటేషన్ పై వచ్చి..ఐఏఏస్,ఐఎఫ్ఎస్ అధికారులు ఉండాల్సిన ఆయకట్టు అభివృద్ది సంస్థకు ప్రాజెక్ట్ డైరెక్టర్ గా చక్రం తిప్పి.. ప్రపంచ బ్యాంక్ అప్పులు 4444 కోట్లను నాగార్జున సాగర్ ఆయకట్టుకు ఖర్చు చేసి.. అందరి దృష్టిని అకర్షించారు మన్సూర్. రూల్స్ , చట్టాలు,నిబందనలు,కోర్టులు అంటూ వెనకడుకు వేసే ఐఏఏస్ లు చేయలేని పనిని ..ఏ చట్టాన్ని,రూల్స్ ని పట్టించుకోకుండా కేవలం జీహుజీర్ అంటూ..అక్రమ ఆదాయ మార్గాల ద్వారనే ఈ పోస్టింగ్ తీసుకున్నారని ఐఏఏస్ అధికారులే ఆరోపిస్తున్నారు. ఆదాయాన్నిఅక్రమాలను ఒకే ఒరలో చేర్పించిన టీఎస్ ఎండీసీ,ఎండీ మన్సూర్ ఆడిందే ఆటగా మారిందని తన కార్యాలయానికి వెళ్లి చూస్తే ఇట్లే తెలిసి పోతుంది.
ఇక జనరల్ మేనేజర్స్ అక్రమాలకు అడ్డాగా ఉండేవారు. లూజ్ టాక్ తో పాటు.. ఇసుక మాఫియాతో హోటల్స్ లో పార్టీలు చేసుకోవడంతో రాజశేఖర్ రెడ్డిని బదిలీ చేశారు. సహకార శాఖ నుంచి రాజా రెడ్డి వచ్చినా..ఎండీ అక్రమాలు,ఎన్జీటీ కేసులు..ఇలా నాకెందుకు వచ్చిన గొడవ అని వెళ్లిపోయేలా చేశారు. ఇక అదే సహకార శాఖ నుంచి రాజేందర్ రెడ్డి వచ్చారు.టీఎస్ఎండీసికి ఛైర్మెన్ గా ఉన్న శేరి సుభాష్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉంటూ..కోట్లాది రూపాయలు సంపాదించారనే ఆరోపణతో బదిలీ అయ్యారు. ఇలా మన్సూర్ తన కనుసన్నల్లోనే ఇసుక మాఫియాను పెంచిపోషించారని విమర్శలు ఉన్నాయి.ఛైర్మన్ కంటే మన్సూర్ మాటే అక్కడ ఫవర్ ఫుల్..అక్కడికి ఎవ్వరు ఛైర్మన్ గా వచ్చినా.. అధికార పార్టీ నేతలైనా వారికి విలువ ఎంతో అందరికీ తెలుసు. అంతా ఎండీయే నడిపించడంతో..ఇప్పుడున్న శ్రీశాంక్ కూడా ఉత్సవ విగ్రహంలాగానే తప్పా..పెద్దగా పనేమి ఉండదని ఉద్యోగులే గుసగుసలాడే పరిస్థితి. ఇక జిల్లాల్లో ఐఏఏస్ లకు సైతం ఫోన్ చేసి..ఇసుక అక్రమ మాఫియా పై పట్టు పెంచుకుంటున్నారంటే.. మన్సూర్ మహా ముదురు బాబు అంటూ ఐఏఎస్ లే సణుక్కుంటున్నారు.
బల్క్ మాఫియా..!
ఇసుక మాఫియాలో ఇప్పటి వరకు క్వారీలు,రీచ్ లు,కమిటీల రిపోర్టులు,అధికారుల తీరు చూశాం. ఇసుకాసురులు ఎపిసోడ్ -7 లో హైదరాబాద్ లో టీఎస్ఎండీసీ బల్క్ మాఫియా, ప్రజల ఆన్ లైన్ కష్టాలేంటో చూద్దాం.