– కాస్ట్లీ ఏరియా భూములపై కన్ను
– కొత్త కంపెనీలతో ప్లాన్ అండ్ యాక్షన్
– ఆఖరికి.. సినిమా భూముల్నీ వదల్లేదు
– ఫినిక్స్ ఫిక్స్ అయితే అంతేనా?
ఇందుగలదు అందులేదని సందేహము వలదు.. ఏ భూ స్కాం వెతికినా ఫినిక్స్ అందందే కలదు.. కాస్ట్లీ ఏరియాల్లో ల్యాండ్ అంటే అంత అషామాషీ కాదు. అదేంటో నగరంలోని ఏ ఖాళీ ఏరియా చూసినా ఫినిక్స్ పేరు వినిపించకుండా ఉండదు. కొత్త కొత్త కంపెనీలు పెట్టేయడం.. లక్ష రూపాయల పెట్టుబడితో భూములు లాగేసుకోవడం.. వందల కోట్లకు అమ్ముకోవడం.. ఎన్నో ఏళ్లుగా జరుగుతున్న తంతు ఇదే. ఈ బాగోతాలన్నీ బయటపెడుతోంది తొలివెలుగు.
10 ఎకరాల చెరువులో భవనం కోసం ‘‘ఫినిక్స్ గ్లోబల్ స్పేస్ ప్రైవేట్ లిమిటెడ్’’
2018 సెప్టెంబర్ లో లక్ష రూపాయలతో ఏర్పడిన ఈ కంపెనీ.. 2019 మార్చిలో మార్కెట్ లో ఎకరం భూమి రూ.80 కోట్లు పలికే ప్రాంతంలో పదెకరాల వరకు కొనుగోలు చేసింది. అంటే.. అక్షరాలా రూ.800 కోట్లు అన్నమాట. ఇది పుప్పాలగూడలో సర్వే నెంబర్ 272, 273లోని నార్సింగ్ -2 చెరువు(హెచ్ఎండీఏ లేక్ ఐడీ 2939). హెచ్ఎండీఏ మాస్టర్ ప్లాన్ లో చెరువు అని.. అక్కడ నిర్మాణాలు చేపట్టవద్దని స్పష్టంగా ఉంది. కానీ 272/P, 273/P అని 10 ఎకరాల చెరువును కబ్జా చేసి.. టీఎస్ఐఐసీ నుంచి అక్రమంగా అనుమతులు తీసుకొని రూ.5 వేల కోట్ల బిజినెస్ చేస్తోంది. సెల్లార్ తీస్తుండగానే అమ్మకాలు ప్రారంభించింది. నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ చెన్నై బెంచ్ లో కేసు నెంబర్ ఓఏ 72/2020 కేసు విచారణ జరుగుతుండగానే ప్రభుత్వం నుంచి అన్ని అనుమతులు ఇచ్చారంటే.. అధికారులు ఎలా దాసోహమయ్యారో తెలుస్తోంది. ఈ కంపెనీలో సురేష్ చుక్కపల్లి కుమారులు అవినాష్ చుక్కపల్లి, ఆకాశ్ చుక్కపల్లి మాత్రమే ఉన్నారు. పెట్టుబడి లేకుండానే అతి తక్కువ ధరకు చెరువు శిఖం భూమి పట్టా భూమిగా రావడంతో ఎవ్వరినీ ఎంట్రీ కానివ్వడం లేదు. లేదంటే ఏ ముంబై, బెంగుళూరు పెట్టుబడుదారులను చేర్చుకునేవారని సమాచారం.
పద్మాలయా స్టూడియో భూముల కోసం ‘‘ఫినిక్స్ రెసిడెన్సీస్ ప్రైవేట్ లిమిటెడ్’’
2007లో రూ.6 కోట్లతో ఏర్పాటు చేసిన ‘‘ఫినిక్స్ రెసిడెన్సీస్ ప్రయివేట్ లిమిటెడ్’’కి చైర్మన్ సురేష్ చుక్కపల్లినే అన్నీ. కానీ.. తర్వాత అతని కుమారుల చేతిలో పెట్టడంతో.. ఎండీ గోపీ కృష్ణ పాటిబండ అన్నీ తానై చూసుకుంటున్నారు. పుష్కర్ హర్షద్ జా ఈ కంపెనీలో 2017లో డైరెక్టర్ గా జాయిన్ అయ్యారు. ఈయన ముంబైకి చెందిన వ్యక్తి. సినిమా ఇండ్రస్ట్రీ అభివృద్ది కోసం షేక్ పేట్ రెవెన్యూ ఫిలింనగర్ లో సర్వే నెంబర్ 403/Pలో పద్మాలయా స్టూడియో కోసం నామినల్ రేట్ కి ప్రభుత్వం నుంచి భూములు తీసుకుంది హీరో కృష్ణ కుటుంబం. అయితే.. ‘‘ఫినిక్స్ రెసిడెన్సీస్ ప్రైవేట్ లిమిటెడ్’’ పేరుతో 9 ఎకరాల్లో హైరేంజ్ బిల్డింగ్ లు నిర్మించి బిజినెస్ చేస్తున్నారు. భూములు తీసుకున్న సమయంలో జరిగిన ఒప్పందాలను తుంగలో తొక్కారు. 2008లో జీ టెలీఫిలిం వారికి 5 ఎకరాల 20 గుంటల భూమిని విక్రయించారు. అక్రమంగా విక్రయించారని ప్రభుత్వం నోటీసులు ఇచ్చింది. ప్రభుత్వ భూమి అని జెండాలు పాతింది. కానీ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ భూములు ఫినిక్స్ చేతికి వచ్చాయి. చకచకా బిల్డింగ్ లు పైకి లేచాయి. ఇప్పుడు తాజాగా 5 ఎకరాల్లో మళ్లీ అక్రమంగా అనుమతులు తీసుకొని నిర్మాణాలు చేపడుతోంది. అపార్ట్ మెంట్ లో ఒక్క అడుగుకు రూ.12 వేల నుంచి రూ.15 వేల వరకు విక్రయిస్తోంది. సినిమా కోసం మాత్రమే ఉపయోగించుకోవాల్సిన భూముల్లో మరో రూ.5 వేల కోట్ల బిజినెస్ చేస్తోంది. అపార్ట్ మెంట్లతో పాటు హోటల్స్ నిర్మాణం కూడా ఈ భూముల్లో జరుగుతోంది. గతంలో మంత్రి హరీష్ రావు ఈ భూములు ప్రైవేట్ పరం అవుతున్నాయని ధర్నాలు చేశారు. హైకోర్టులో కేసులు వేశారు. అదే టీఆర్ఎస్ అధికారంలోకి రాగానే రూ.800 కోట్ల భూములకు క్లియరెన్స్ వచ్చింది. ఫినిక్స్ అధికారికంగా సృష్టించిన 50 కంపెనీలకు 14లో డైరెక్టర్స్ గా ఉన్నారని ఆరోపణ.
‘‘ఫినిక్స్ ఐటీ స్పేస్ ప్రైవేట్ లిమిటెడ్’’
2013లో లక్ష రూపాయలతో ఏర్పడిన ఈ కంపనీ.. శ్రీనిధి ఇన్ఫ్రా చైర్మన్ గా ఉండే ఉమాంజ వెంకట సత్య శివ శ్రీహరి కొల్లా రిజిస్ట్రేషన్ చేశారు. ఫినిక్స్ లో ఇతను కీ డైరెక్టర్ గా ఉన్నారు. బోగి శ్రీధర్ 2019లో భాగస్వామి అయ్యారు. ఈ పేరుతో శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కి 7 కిలోమీటర్ల దూరంలో మామిడిపల్లి గ్రామ రెవెన్యూలోని సర్వే నెంబర్ 42, 43, 56, 57, 58, 60, 63 వివాదంలో ఉన్న 42 ఎకరాల ఇనామ్ భూముల్లో అక్రమంగా మ్యుటేషన్ చేయించుకున్నారు. ఓపెన్ ప్లాట్స్ చేసి ఫినిక్స్ లగ్జరీ 1 పేరుతో గజం రూ.30 వేల నుంచి రూ.50 వేలకు అమ్మకాలు జరుపుతున్నారు. హెచ్ఎండీఏ, రెరా నుంచి అక్రమంగా అనుమతులు తెచ్చుకొని ఇనామ్ దారులను బెదిరిస్తూ.. కోర్టు నుంచి కేసులు వాపసు తీసుకునేలా ఇబ్బందులకు గురిచేశారు. మరిన్ని డబ్ల్యూ.పీ.నెంబంర్ 14838/2020, 14840/14842 వరకు కొన్ని కేసులు పెండింగ్ లో ఉండగానే హెచ్ఎండీఏ, రెరా నుంచి అధికార దుర్వినియోగానికి పాల్పడి అనుమతులు తీసుకున్నారు. ఫినిక్స్ లగ్జరీ 2 పేరుతో 30 ఎకరాల్లో విల్లాలు నిర్మించి అమ్మకాలు చేస్తున్నారు. ఇక్కడ జరిగిన భూ స్కాం విలువ రూ.12 వందల కోట్లు ఉంటుంది.
2019లో ‘‘ఫినిక్స్ ఐటీ జోన్ ప్రైవేట్ లిమిటెడ్’’, ‘‘ఫినిక్స్ సెజ్ స్పేస్ ప్రైవేట్ లిమిటెడ్’’, ‘‘ఫినిక్స్ టెక్ డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్’’ పేరుతో లక్ష రూపాయలతో కంపెనీలు ఏర్పాటయ్యాయి. ఈ బినామీ కంపెనీల భాగోతాన్ని తర్వాతి కథనంలో తొలివెలుగు బట్టబయలు చేస్తుంది.