– టీఆర్ఎస్ నేతలు ఎప్పటికీ మారరా?
– ఫ్లెక్సీల విషయంలో రూల్స్ ఎందుకు పాటించరు?
– మీడియా చెప్పే దాకా అధికారులు కళ్ళు తెరవరా?
– పైకి వద్దంటూనే.. కేటీఆర్ ప్రోత్సహిస్తున్నారా?
– వరంగల్ లోనూ అదే సీన్
– తొలివెలుగు ఎఫెక్ట్ తో కదిలిన అధికారులు
ఫ్లెక్సీలు వద్దు మొక్కలు నాటండి.. ఇది ప్రతీసారి టీఆర్‌ఎస్ నేతలకు కేటీఆర్ ఇచ్చే పిలుపే. కానీ.. ఆయన మాటను గులాబీలు విన్న దాఖలాలు లేవు. స్వామిభక్తిని నిరూపించుకునేందుకు ప్రతీసారి పోటీ పడుతూనే ఉంటారు. మామూలుగా రూల్స్ అంటే అందరూ ఫాలో అవుతారు. కానీ.. గులాబీలకు అవేవీ పట్టవు. దానికి చక్కటి ఉదాహరణే ఫ్లెక్సీల ఏర్పాటు.
ఏదైనా ప్రోగ్రామ్ ఉండి.. ప్రగతి భవన్ నుంచి కేటీఆర్ కాలు బయట పెడుతున్నారంటే చాలు అడుగడుగునా గులాబీమయం అయిపోతుంటుంది. అది హైదరాబాద్ అయినా.. జిల్లాల పర్యటన అయినా.. పరిస్థితిలో ఎలాంటి మార్పు ఉండడం లేదు. తాజాగా వరంగల్ పర్యటనకు వెళ్లారు కేటీఆర్. అయితే.. మేయర్ సుధారాణి చేసిన పని చర్చనీయాంశంగా మారింది. ఎలాంటి అనుమతి లేకుండా పెద్ద పెద్ద ఫ్లెక్సీలు, కటౌట్లు ఏర్పాటు చేశారు.
నగరానికి మేయర్ అయి ఉండి.. రూల్స్ పాటించాల్సింది పోయి ఆమె బ్రేక్ చేసింది. ఈ విషయాన్ని తొలివెలుగు హైలెట్ చేయడంతో అప్పటికి గానీ అధికారులు కళ్లు తెరవలేదు. మేయర్ కు రూ.2 లక్షల జరిమానా వేశారు. ఇతర నాయకులకు రూ. 50వేల వరకు ఫైన్ విధించారు. హైదరాబాద్ లో అయితే.. ఇలాంటివి తరచూ జరుగుతూనే ఉంటాయి. అయితే.. ఇక్కడ వినిపిస్తున్న ప్రశ్న ఏంటంటే. ఫ్లెక్సీలు ఏర్పాటు చేయకూడదని తెలుసు.. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా వద్దని చెబుతున్నారు. కానీ.. గులాబీలు మాత్రం ఏర్పాటు చేస్తూనే ఉంటున్నారు.
అంటే.. పైకి వద్దని చెబుతున్న కేటీఆర్.. సైలెంట్ గా వారిని ప్రోత్సహిస్తున్నారా? ఫైన్ వేస్తారని తెలిసి కూడా ఫ్లెక్సీలు కడుతున్నారంటే ఏమనాలి? తెలిసి తప్పు చేస్తున్న గులాబీలను ఏం చేయాలి? అదే ఓ సామాన్యుడు ఇంటికి టు లెట్ బోర్దు తగిలిస్తే వెంటనే వచ్చి ఫైన్ వేసే అధికారులు.. టీఆర్‌ఎస్ నేతల విషయంలో మీడియా కలగజేసుకునే దాకా ఎందుకు మౌనం వహిస్తున్నారు? ఇలాంటి ఎన్నో ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
త్వరలో హైదరాబాద్ లో టీఆర్‌ఎస్ ప్లీనరీ సమావేశం జరగనుంది. అప్పుడు కూడా యథావిధిగానే సీన్ కనిపిస్తుందని అంటున్నాయి ప్రతిపక్షాలు. ఇష్టం వచ్చినట్లు నగరమంతా ఫ్లెక్సీలు కట్టినా అధికారులు పట్టించుకోరని.. తర్వాత తీరిగ్గా ఫైన్లు వేస్తారని చెబుతున్నాయి. గత ప్లీనరీ సమయంలో జరిగిన సంఘటనలను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాయి.