టీఆర్ఎస్ స్థానిక ప్రజా ప్రతినిధుల్లో ( గ్రామ, మండల స్థాయి ) అసంతృప్తి పెల్లుబికుతోంది. ఎంతో కష్టపడి, మరెంతో ఖర్చుపెట్టి గెలిస్తే.. పదవితో కనీస ఆదాయం లేకుండాపోతోందని ఆఫ్‌ది రికార్డు ఆవేదన చెందుతున్నారు. గతంలోలా ప్రభుత్వ పనుల్లో అంతో, ఇంతో వెనకేసుకుందామంటే.. అవి కాస్తా ఎమ్మెల్యేలు, మంత్రుల ఖాతాల్లోనే జమైపోతున్నాయంటూ తెగ బాధపడిపోతున్నారు. ఇదే విషయంపై మండల సమావేశాల్లో ఎమ్మెల్యేలను బండబూతులు తిడుతూ… వారు ఎదురైనప్పు మాత్రం సలాం కొట్టి సైడైపోతున్నారు.
గతంలో ప్రభుత్వం పనులకు సంబంధించిన టెండర్లు దక్కించుకునే కాంట్రాక్టర్లు. స్థానిక ఎంపీటీసీలు, సర్పంచ్‌లకు కూడా కొంత కమిషన్ ఇచ్చేవారట. అయితే రెండోసారి అధికారంలోకి వచ్చాక పైసా ఇవ్వడం లేదని… ఏదైనా ఉంటే నేరుగా ఎమ్మెల్యేనో, మంత్రితోనే మాట్లాడుకుని, ఇవ్వాల్సిన పర్సంటేజీని వారి ఖాతాలోకి వెస్తున్నారట. దీనికి తోడు స్థానికంగా ఏదైనా ప్రభుత్వ వ్యాపారంలోకి దిగుదామంటే.. తమ అనుచరులను తప్ప.. మరెవరినీ ఎమ్మెల్యేలు అడుగుపెట్టనివ్వడం లేదట.
టీఆర్ఎస్ తరపున గెలిచేందుకు.. గ్రామాలు, మండలాల్లో కూడా అప్పుగా తీసుకొచ్చి మరీ కోట్లాది రూపాయలనే ఖర్చుపెట్టారు చాలా మంది నేతలు. ప్రభుత్వం తమదే కదా.. సంపాదించుకోవచ్చులేనని ముందూ, వెనకా చూడకుండా పంచేశారు. తీరా ఎమ్మెల్యేలు ఇస్తున్న ఝలక్‌లతో.. అప్పులు తీరే మార్గం తర్వాత.. ఉన్న ఆస్తులు ఎలా కాపాడుకోవాలో తెలియక కుమిలిపోతున్నారట. ఇంత జరిగినా.. ఎమ్మెల్యేలు ఎదురుతై మాత్రం.. ఆహో, ఓహో అంటూ కీర్తిస్తూ మళ్లీ లేని ప్రేమను నటించకతప్పడం లేదట పాపం.