పాలమూరు కోడళ్లు.. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ఇప్పుడు ఈ పదం హట్ టాపిక్‌గా మారింది. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం కోసం ఈ ఇద్దరు నేతలకు ఈ పదం అవసరమొచ్చింది. అందుకే ఎన్నడూ లేనిది ఆ ఇద్దరికి ఇప్పుడు వారి స్థానికత గుర్తొస్తోంది. వారెవరో కాదు.. హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి ఒకరు కాగా..మరొకరు పాలమూరు పట్టభద్రుల ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్న సురభి వాణీదేవి. ఈ ఇద్దరూ ఇప్పుడు ఓట్ల కోసం పాలమూరు సెంటిమెంట్‌ను తెరపైకి తీసుకొస్తున్నారు.
గతంలో ఏ వేదికపైనా, ఏ సందర్బంలోనూ తాము పాలమూరు కోడళ్లమని ఈ ఇద్దరూ చెప్పుకున్నది లేదు. కానీ ఇప్పుడు మహబూబ్‌నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక కోసం ఓట్లను అభ్యర్థించే క్రమంలో తమది పాలమూరేనంటూ.. పట్టభద్రులకు గాలం వేసే ప్రయత్నాలు చేస్తున్నారు. స్థానికురాలైన సురభి వాణీదేవికి ఓటు వేయాలంటూ కోరుతున్నారు. దీంతో వారి మాటలు విన్నవారంతా నోరు తెరుస్తున్నారు. అభ్యర్థి సమర్థత చూసి ఓటేస్తారు.. కానీ స్థానికత చూసి ఓటు వేయడమేంటని ప్రశ్నిస్తున్నారు. అవసరం వుంటేనే పాలమూరు కోడళ్లమని చెబుతున్నారే కానీ.. మాములుగా అయితే పాలమూరు జిల్లా పేరును ఉచ్చరించడానికి కూడ ఇష్టపడేవారు కాదంటూ వారిపై విమర్శలు కురిపిస్తున్నారు.
ఇదిలా ఉంటే గద్వాల విజయలక్ష్మి గద్వాల జిల్లా ధరూర్ మండలం జాంపల్లి గ్రామానికి చెందిన కోడలు కాగా, సురభి వాణిదేవి కల్వకుర్తిలోని రఘుపతిపేట గ్రామానికి చెందిన కోడలు.