తెలంగాణలో ఎన్నిక ఏదైనా గెలుపు తమదే అంటూ ఇన్నాళ్లు గర్వంగా చెప్పుకునేది అధికార పార్టీ టీఆర్ఎస్. మాటలే కాదు చేతలు కూడా అందుకు తగ్గట్టే కనిపించేవి. అందరి కంటే ముందే అభ్యర్థులను ప్రకటించడం మొదలు.. ఊహకందని వ్యూహాలతో విపక్షాలను ఆదిలోనే దెబ్బకొట్టేది. ఎంతటి సంక్లిష్ట పరిస్థితులనైనా సానుకూలంగా మార్చుకోవడంలో సక్సెస్ అయ్యేది. మొన్నటి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల దాకా కూడా ఎన్నికల పేరు చెబితే టీఆర్ఎస్‌లో ఒక రకమైన దూకుడు కనిపించేది. కానీ విచిత్రంగా నాగార్జుసాగర్ ఉప ఎన్నిక విషయంలో.. నెలలు గడుస్తున్నా ఇంకా చప్పుడే చేయడం లేదు.
దుబ్బాకలో రామలింగారెడ్డి మరణం తర్వాత.. వారం కూడా తిరక్కుండానే ఆయన సతీమణిని ఉప ఎన్నిక అభ్యర్థిగా నిలబెట్టబోతున్నట్టు సంకేతాలు ఇచ్చింది టీఆర్ఎస్. ఆ లెక్కన ఇప్పటికే సాగర్‌లో తమ అభ్యర్థిని ప్రకటించి ఉండాల్సింది కానీ.. ఇప్పటికీ ఆ విషయంలో ఎలాంటి స్పష్టత లేకుండాపోయింది. ఉప ఎన్నిక అభ్యర్థి ఎవరయితే బాగుంటుందని నిర్ణయించడం కోసం సర్వేల మీద సర్వేలు చేయిస్తోంది. ఎన్ని లెక్కలు వేసుకున్నా.. నర్సింహయ్య కుమారుడు భగత్, ఎమ్మెల్సీ తేరా చిన్నపరెడ్డి, ఆ పార్టీకే చెందిన మరో నే ఎంసీ. కోటిరెడ్డిలలో ఎవరిని ఎంపిక చేయాలనేది అధిష్టానానికి అంతుబట్టడం లేదు.
దుబ్బాకలో ఇప్పటికే సానుభూతి వర్కవుట్ కాపోవడంతో.. నోముల కుటుంబానికా లేకా.. బయటి వారికా తేల్చుకోలేకపోతోంది. ఉపఎన్నిక ఫలితం ఏ మాత్రం తేడా కొట్టినా.. భారీ మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితులు నెలకొనడంతో ఇంకా కసరత్తుల దగ్గరడే కష్టపడుతోంది ఆ పార్టీ.