“ఎవడైనా కోపంతో కొడతాడు లేదా బలంగా కొడతాడు..వీడేంట్రా చాలా శ్రద్ధగా కొట్టాడు..” అని ఆ మధ్య అతడు సినిమా కోసం రాసిన డైలాగ్ ఇది. తాజాగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ వ్యూహం చూస్తే ఆ మాటే గుర్తుకు వస్తోంది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పల్లా, వాణీదేవి గెలవనే గెలవరు.. అని సొంత పార్టీ నేతల నుంచే పెదవి విరుపులు ఎదురైనా.. వారినే పోటీలో నిలబెట్టి అనూహ్యంగా సక్సెస్ అయింది. టీఆర్ఎస్ అధిష్టానం. విచిత్రంగా ప్రత్యర్థుల బలాన్నే.. తమ గెలుపునకు మార్గంగా మలుచుకుంది. సూక్ష్మంలో మోక్షంలా వ్యతిరేకతలోనే విజయాన్ని వెతుక్కుంది. తాజా గెలుపు పక్కగా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలికతో వచ్చినదే అనడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదంటున్నారు విశ్లేషకులు.పెద్ద సంఖ్యలో అభ్యర్థులు బరిలోకి దిగడం అన్నింటికంటే కూడా ఎక్కువగా టీఆర్‌ఎస్‌కు బాగా కలిసొచ్చిందన్నది వారి మాట. విపక్షాలు, స్వతంత్రుల్లోనూ చాలా మంది బలమైన అభ్యర్థులే ఉండటంతో.. ప్రభుత్వ వ్యతిరేక ఓటు భారీగా చీలినట్టుగా ఫలితాల ద్వారా స్పష్టమవుతోంది. కౌంటింగ్‌లో మొదటి, రెండు స్థానాల్లోని అభ్యర్థుల మధ్య ఉన్న ఓట్ల తేడానే.. అటు ఇటుగా రెండు, మూడు స్థానాల్లో కొనసాగిన అభ్యర్థుల మధ్య కూడా కనిపించడం కూడా ఇందుకు బలాన్నిస్తోంది. వరంగల్-ఖమ్మం- నల్గొండ స్థానంలో స్వంతంత్ర అభ్యర్థి తీన్మార్ మల్లన్నకు గెలుపు స్థాయిలో ఓట్లు పడ్డాయంటే.. ప్రభుత్వంపై ఏ స్థాయిలో వ్యతిరేకత ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇదే సమయంలో పట్టభద్రులు, ఉద్యోగ వర్గాల్లో ఎంతో ఆదరణ ఉన్న కోదండరాం కూడా ఇదే స్థానం నుంచి పోటీ చేయడంతో.. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు ఎక్కువగా వారి మధ్యే చీలిపోయాయి.
హైదరాబాద్ స్థానంలోనూ అంతే. బీజేపీతో పాటు స్వతంత్ర అభ్యర్థి ప్రొఫెసర్ నాగేశ్వర్ మధ్య ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలిపోవడాన్ని గమనించవచ్చు. మొత్తంగా ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్‌ను విపక్షాలే పరోకంగా గెలిపించాయంటున్నారు విశ్లేషకులు.