వైసీపీలో రచ్చ మొదలైంది. నంద్యాలలో గజ్జల లక్ష్మి ఎపిసోడ్, విశాఖలో ధర్మశ్రీ వర్సెస్ విజయసాయిరెడ్డి ఎపిసోడ్, తూర్పుగోదావరిలో మంత్రి కన్నబాబుపై ఎమ్మెల్యే చిట్టిబాబు కామెంట్స్.. చీరాలలో కరణం వర్సెస్ ఆమంచి.. గన్నవరంలో వంశీ వర్సెస్ యార్లగడ్డ అండ్ కో.. వరుసగా లిస్టు వేసుకుంటూ పోతే.. చిన్నా పెద్ద తగాదాలన్నీ తీసుకుంటే.. రాష్ట్రమంతా రచ్చ నడుస్తోంది. వైసీపీ నేతల్లో కోఆర్డినేషన్ లేదు.. మంత్రుల్లో అసలే లేదు. మంత్రులకు, ఎమ్మెల్యేలకు పడటం లేదు. సంపాదనలో పోటీపడలేనివారు అసంతృప్తితో మాట్లాడుతున్నారు. సంపాదించుకునేవారు గమ్ముగా ఉంటున్నారు. కార్యకర్తలైతే.. ఇంకా కసిగా ఉన్నారు. ఇంత కష్టపడి పార్టీని అధికారంలోకి తెస్తే.. తమను పట్టించుకునేవారే లేరని మండిపడుతున్నారు.
పరిస్ధితి ముదిరిందనే విషయాన్ని సీఎం జగన్ గమనించినట్లున్నారు.. అందుకే దానిపై దృష్టి పెట్టాలని ఇప్పటికే సజ్జల రామకృష్ణారెడ్డికి అప్పచెప్పినా.. పని కావటం లేదని.. నేరుగా రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. ఇప్పటికే విశాఖ ఎపిసోడ్ గురించి నేతలను రమ్మని కబురు పెట్టారు. విజయసాయిరెడ్డితో సహా అందరినీ రమ్మన్నారు. విజయసాయిరెడ్డికి కూడా క్లాసు తీసుకుంటారనే ప్రచారం జరుగుతోంది.
అంతే కాదు.. ఇప్పటికే ఇసుక వ్యవహారంలో రాష్ట్రం మొత్తం నెట్ వర్క్ పెట్టుకుని సంపాదించేసుకుంటున్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి కూడా .. కాంట్రాక్టు శేఖర్ రెడ్డికి ఇవ్వాలనే నిర్ణయం ద్వారా చెక్ పెట్టారని చెప్పుకుంటున్నారు. అప్పటినుంచే జగన్ జైలుకెళితే.. సీఎం పోస్టు కోసం పెద్దిరెడ్డి అవసరమైతే వైసీపీని చీలుస్తారనే ప్రచారం కూడా జరుగుతోంది.
వైసీపీ నేతలు, జగన్ గుర్తించాల్సింది ఏంటంటే.. ప్రజల్లో పెరుగుతున్న అసంతృప్తిని గుర్తించి.. వ్యూహాలు మార్చుకుంటే.. ఆటోమేటిక్ గా పార్టీలో పరిస్ధితులు కూడా చక్కబడతాయి. ప్రజలకు ఏం కావాలో ఆలోచించకుండా.. కేవలం నవరత్నాలతో అందరి జీవితాలు మారిపోతున్నట్లుగా ఫీలయిపోతూ.. మిగతా అన్ని వ్యవహారాల్లో సంపాదనలో పడిపోతే.. డబ్బులు ఎక్కువైతే తగాదాలు సహజంగానే వస్తాయి.
ఇప్పుడు జరుగుతున్న తగాదాలన్నీ కూడా.. ఆ కోవలోవే. ప్రతి చోటా.. ఎవరో ఒకరు డామినేట్ చేయడం.. వారే వన్ సైడుగా సంపాదించుకోవడం నడుస్తోంది. అవకాశం రాని మిగతావారు.. ఆ విషయంలో హర్ట్ అయి ఛాన్స్ దొరికినప్పుడు విరుచుకుపడుతున్నారు. ఇక కార్యకర్తలకీ అదే సమస్య. వీరు సంపాదన కోరుకోవడం లేదు.. గుర్తింపు కోరుకుంటన్నారు. కాని నేతలు వీరిని పట్టించుకోవడం లేదు. ఎవరికైనా సాయం చేద్దామనో.. ఏదైనా పని చేసిపెడదామనో నాయకుల దగ్గరకు వెళితే వారు ఇంత కూడా లెక్క చేయడం లేదు కార్యకర్తలను. గజ్జల లక్ష్మి వ్యవహారంలో వైవీ సుబ్బారెడ్డి ఆఫీసులో ఎదురైన అనుభవం అదే.
మరి జగన్మోహన్ రెడ్డి ఇంకా విజయసాయి, సజ్జల, వైవీ లాంటివారి మీదే ఆధారపడతారా.. లేక నేరుగా రంగంలోకి దిగి సమస్యలను పరిష్కరించుకుంటారా అనేది.. చూడాలి.