తిరుపతి: ఆంధ్రా ప్రజల హక్కుల కోసం హస్తినలో తనదైన శైలిలో నిరసన వినిపించిన మాజీ ఎంపీ శివప్రసాద్ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడం ఈ ప్రాంత ప్రజానీకాన్ని కంట తడిపెట్టించింది. ప్రత్యేకహోదా సాధన కోసం, విభజన హామీల అమలు కోసం శివప్రసాద్ కేంద్రంపై నిప్పులు చెరుగుతూ పదే పదే నిరసనలు వ్యక్తం చేశారు. ఆ పోరాటంలో భాగంగా శివప్రసాద్ వేసిన విచిత్రమైన వేషాలు హస్తినలో హాట్ టాపిక్‌గా ఉండేది. ప్రతిరోజూ ఒక విభిన్నమైన గెటప్‌తో సహచర ప్రజాప్రతినిధులతో కలసి ఆయన చేసిన పోరాటం మిగిలిన ఎంపీలను ఆకట్టుకునేది.
కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీతో పాటు పలువురు ప్రముఖ నేతలు సైతం ఆయన వేసుకున్న వేషాల గురించి చర్చించి శివప్రసాద్‌ను అభినందించిన ఘటనలు కోకొల్లలు. విచిత్ర వేషధారణతో, ఆకట్టుకునే పద్యాలతో పార్లమెంట్ ముందు చేసిన ప్రయత్నం శివప్రసాద్‌కు దేశవ్యాప్త గుర్తింపును తెచ్చిపెట్టింది.
అంతేకాదు, టీడీపీలో సీనియర్ నేతగా వుంటూ, అధినేత చంద్రబాబు ఆదేశాలను పాటిస్తూ, నియోజకవర్గంలో తమకు ఏవైనా లోటుపాట్లు కానీ, ఇతర అవమానాలు కానీ జరిగితే వాటిపై సూటిగా అధిష్టానాన్ని ప్రశ్నించిన తీరుపై కూడా పార్టీలో చర్చ జరిగేది. కమెడియన్‌గా, విలన్‌గా ఓవైపు సినీ రంగంలో రాణిస్తూనే మరోవైపు రాజకీయాల్లో కూడా తనదైన ముద్రవేసి ఆల్‌రౌండర్ అనిపించుకున్న శివప్రసాద్ మృతికి ‘తొలివెలుగు’ ఘన నివాళి అర్పిస్తోంది.