నర్శింహారెడ్డి, తెలంగాణ జర్నలిస్ట్
ఎవలు నువ్వు ?
యాడినుండొచ్చినవ్ ?
రాధాకృష్ణుడు పుట్టిన్నాడే నువ్వు పుట్టినవెందుకు ?
ఇండ్ల మతలబేంది ?
“ఉపాధ్యాయ దినోత్సవం” నాడే పుట్టిన నువ్వు అదే పనిలకు ఎందుకు పోయినవ్ ?
సమాజానికి భావి భారత పౌరులనందించేందుకు నువ్వెందుకు కంకణం కట్టుకున్నవ్ ?
నాలుగు గోడల మధ్యల్నే గాక , నాలుగు దిక్కుల సుత పాఠాలెందుకు చెప్తున్నవ్ ?
కోదండరాంరెడ్డిగ ఉన్న నువ్వు కోదండరాం ఎందుకైనవ్ ?
వేరే కులపొళ్ళమీద ఘోరాలు జరుగుతే నువ్వెందుకు నీ కులం పేరు తీసేసుకున్నవ్ ?
నీ బిడ్డను సుత వేరే కులపొళ్ళకెందుకిచ్చినవ్ ?
అసలు స్వరాష్ట్ర ఉద్యమంల నీ పాత్రేంది ?
అందరు పంతుళ్ళ లెక్క నీ పని నువ్వు చేస్కొని ఇంట్ల ఉండక ఈడికెందుకచ్చినవ్ ?
నీ నౌకరి బందు వెట్టి రోడ్లమీదకెందుకచ్చినవ్ ?
ఉన్నై సాలవని లంచాల కోసం అడుక్కునే సన్నాసులున్న కాలంల నువ్వెందుకు నీ జీతంల సగం సమాజానికిచ్చినవ్ ?
ఏడ వడ్తె ఆడ షామియానాలల్లెందుక్కూసున్నవ్ ?
అధికారం కోసం నీకచ్చిన అవకాశాన్నెందుకొదులుకున్నవ్ ?
AC రూములల్ల ఉండక ప్రజానికంలకెందుకచ్చినవ్ ?
అసలు నువ్వు తెలంగాణ కోసం అడుగు మోపినప్పుడు నువ్వెవలో తెల్వని సన్నాసులు, నీ కాలి గోటికి సుత సరిపోని లఫంగి గాళ్ళు నిన్నేదో అనేటట్లు నువ్వెందుకు చేస్కున్నవ్ ?
ఏదో మంత్రి పదవిల కుర్చేసుకొని కూసుంటే ఐపోవు గద !
ప్రశ్నించే గొంతుకకు ప్రశ్నావేదికవెందుకైనవ్ ?
ఒక వేములఘాట్
ఒక గోలివాడ
ఒక నేరెల్ల
ఇట్ల బాధితుల పక్షానెందుకు నిలవడ్తున్నవ్ ?
ఎందుకంటె ముద్దసాని కోదండరాంరెడ్డివి కాదు, ఆచార్య కోదండరాం సారువి కాబట్టి !
ఎందుకంటే బాధ్యత గల పౌరుడివే కాదు , బాధ్యత గల ఉపాధ్యాయునివి కూడా కాబట్టి !
ఎందుకుంటే సిధ్ధాంతకర్త జయశంకర్ గారి అడుగులలో నడుస్తున్నరు కాబట్టి !
ఎందుకంటే కోరుకునేది ఆర్థిక అసమానతలు లేని, సస్యశ్యామల తెలంగాణా కాబట్టి !
ఎందుకంటే మీరు …….. మీరే కాబట్టి !!
ఏ అసమానతలు లేని
ఏ అసంతృప్తి లేని
ఏ దాడులు లేని
ఎలాంటి అరాచకాలు లేని
సంపూర్ణ తెలంగాణా కావాలని …
ఏ గడపకు ఆపద వచ్చినా మేమున్నాం అంటూ వచ్చే ఒక ఆపన్నహస్తం కోసం ఎదురు చూసే యావత్ తెలంగాణా ప్రజల తరపున నుంచి..
మీకు హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు సార్!