ఢిల్లీ నుంచి జబల్ పూర్ కు వెళుతున్న జెట్ విమానాన్ని స్పైస్ జెట్ ఎయిర్ లైన్స్ అధికారులు అత్యవసరంగా ల్యాండ్ చేశారు. టెక్ ఆఫ్ అయిన కొద్ది సేపటికే స్పైస్ జెట్ విమానంలో అకస్మాత్తుగా పొగలు కమ్ముకున్నాయి. దీంతో పొగలను గమనించి సిబ్బంది అప్రమత్తమయ్యారు.
దీంతో వెంటనే విమానాన్ని పైలట్ ఢిల్లీకి సురక్షితంగా మళ్లించారు. ఆ సమయంలో ప్రయాణీకులకు ఊపిరి పీల్చుకోవడంలో ఇబ్బంది ఏర్పడింది. అయితే ప్రస్తుతం ప్రయాణీకులంతా క్షేమంగానే ఉన్నట్టు విమానయాన సంస్థ వెల్లడించింది. ఈ మేరకు సంస్థ ట్వీట్ చేసింది.
‘ 5000 మీటర్ల ఎత్తులో ప్రయాణిస్తున్న సమయంలో విమానంలో అకస్మాత్తుగా పొగలు వ్యాపించాయి. దీన్ని గమనించిన విమాన సిబ్బంది అలర్ట్ అయ్యారు. దీంతో విమానాన్ని ఢిల్లీకి మళ్లించాము. ప్రస్తుతం ప్రయాణీకులంతా సురక్షితంగానే ఉన్నారు’ అని ట్వీట్ లో పేర్కొంది.
ప్రమాదానికి గల కారణాలు ఇప్పటి వరకు ఇంకా తెలియలేదని అధికారులు తెలిపారు. ప్రాథమిక దర్యాప్తు ప్రకారం విమానంలో ఎడమవైపు ఉన్న ఇంజిన్ లో ఆయిల్ లీక్ కావడం వల్ల పొగలు వ్యాపించి ఉంటాయని అధికారులు అంచనా వేస్తున్నారు. మరోవైపు ఫ్లైట్ లో ఎంత మంది ప్రయాణికులు ఉన్నారనే విషయంపై విమాన యాన సంస్థ కూడా క్లారిటీ ఇవ్వడం లేదు.