స్పైస్ జెట్ విమానాల్లో ఇటీవల వరుసగా ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఘటనలు ఆందోళనలు కలిగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సురక్షితమైన, సమర్థవంతమైన, నమ్మకమైన విమాన సేవల్ని అదించడంలో స్పైస్ జెట్ ఎయిర్ లైన్స్ విఫలమైనట్టు డీజీసీఏ అభిప్రాయ పడింది.
స్పైస్ జెట్ వరుస ఘటనలపై డీజీసీఏ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ క్రమంలో విమానాల భద్రతా ప్రమాణాలు తగ్గిన అంశంపై స్పైస్ జెట్ ను వివరణ కోరింది. ఈ మేరకు స్పైస్ జెట్ కు డీజీసీఏ షోకాజ్ నోటీసులు జారీ చేసింది.
గత 15 రోజుల్లో ఆరు సార్లు స్పైస్ జెట్ విమానాల్లో సాంకేతిక లోపాలు తలెత్తాయి. తాజాగా చైనాకు వెళ్లాల్సిన కార్గో విమానంలో సాంకేతిక సమస్య ఏర్పడింది. దీంతో విమానం దారిని అధికారులు మళ్లించారు.
ఇటీవల దుబాయ్ కు వెళుతున్న స్పైస్ జెట్ విమానంలో ఫ్యూయల్ ఇండికేటర్ లోపం తలెత్తింది. దీంతో ఆ విమానాన్ని దారి మళ్లించి కరాచీలో ఎమర్జెన్సీ ల్యాండ్ చేశారు. అంతకు ముందు ఢిల్లీ నుంచి జబల్ పూర్ వెళుతున్న విమానంలో పొగలు కమ్ముకున్నాయి.