ఆహార పదార్థాలు కల్తీ జరగడం అనేది ప్రస్తుతం మన దేశంలో సహజం అయిపోయింది. అసలు మనం నిత్యం తింటున్న ఆహార పదార్థాలు అసలువో, కల్తీ జరిగినవో కూడా అర్థం కాని అయోమయ పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలోనే ఇటీవలి కాలంలో ఆహార పదార్థాల కల్తీ అనే మాట ఎక్కువగా వినిపిస్తోంది. ప్రముఖ బ్రాండ్లకు చెందిన తేనె కల్తీ అయిందని ఈ మధ్యే వార్తలు వచ్చాయి. ఇక తాజాగా పోలీసులు కల్తీ మసాలాలు, పొడులు తయారు చేస్తున్న పరిశ్రమపై దాడులు చేసి పెద్ద ఎత్తున కల్తీ పదార్థాలను సీజ్ చేశారు.
ఉత్తరప్రదేశ్ లోని హత్రాస్ జిల్లా నవీపూర్ అనే ఏరియాలో ఉన్న ఓ పరిశ్రమపై పోలీసులు ఆకస్మిక దాడులు చేపట్టారు. పరిశ్రమలో కల్తీ పదార్థాలు తయారు చేస్తున్నారన్న విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు దాడులు చేసి కల్తీ జరిగిన మసాలాలు, ఇతర పొడులను పెద్ద ఎత్తున స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 300 కిలోల కల్తీ మసాలాలను వారు సీజ్ చేశారు. ఈ క్రమంలోనే 27 శాంపిల్స్‌ను సేకరించి టెస్టింగ్ నిమిత్తం పంపించారు. వాటిల్లో కల్తీ జరిగిందని అధికారికంగా తేలితే ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ చట్టం ప్రకారం పరిశ్రమ యజమానిపై కఠిన చర్యలు తీసుకోనున్నారు. కాగా పోలీసులు ఆ పరిశ్రమ యజమాని అనూప్ వర్ష్‌నేను ఇప్పటికే రిమాండ్‌కు తరలించారు.
ఇక సదరు వ్యక్తి తన పరిశ్రమలో గాడిద పేడ, కృత్రి కలర్లు, యాసిడ్, గడ్డి, హానికర పదార్థాలతో మసాలాలు, పొడులను తయారు చేస్తున్నట్లు నిర్దారించారు. నిజానికి వాటిని తినడం వల్ల తీవ్రమైన అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు తెలిపారు. కల్తీ జరిగిన వాటిలో కారం పొడి, గరం మసాలా పొడి, ధనియాల పొడి, పసుపు తదితర పదార్థాలు ఉన్నట్లు తెలిపారు. కాగా ఇటీవలి కాలంలో కల్తీ తేనె వార్తలు సంచలనం సృష్టించగా.. ఇప్పుడీ వార్త జనాల్లో ఆందోళన కలిగిస్తోంది. జనాలు తాము తింటున్న పదార్థాలు అసలువేనా, కల్తీ జరిగినవా.. అని తేల్చుకోలేకపోతున్నారు. వారిలో ఆందోళన పెరిగింది.