దేశంలో కరోనా కేసులు కలవర పెడుతున్నాయి. గత కొన్ని రోజులుగా కరోనా కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. గడిచిన 24 గంటల్లో 918 కొత్త కేసులు వెలుగు చూశాయి. దీంతో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 6,350కి చేరింది.
గడిచిన 24 గంటల్లో కరోనా బారిన పడి నలుగురు మృతిచెందారు. దేశంలో ఇప్పటి వరకు మొత్తం మరణాల సంఖ్య 5,30,806కి చేరుకుంది. దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 220.65 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.
నిన్న ఒక్క రోజే 1,000కి పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. 129 రోజలు తర్వాత ఈ స్థాయిలో కరోనా కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఇది ఇలా వుంటే కేరళ, మహారాష్ట్ర, గుజరాత్‌లో అత్యధిక యాక్టివ్ కేసులు నమోదైనట్లు కేంద్రం వెల్లడించింది.
వీటితో పాటు తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలను కేంద్రం హెచ్చరించింది. కొవిడ్ ను కట్టడి చేసేందుకు ముందస్తు జాగ్రత్తలు పాటించాలని సూచనలు చేసింది. మరోవైపు తాజా పరిస్థితులు, వ్యాక్సినేషన్, కొవిడ్ పరీక్షలు, వైరస్ నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించేందుకు టాప్ మెడికల్ బాడీ ఈ రోజు సమావేశం కానుంది.