కర్ణాటక హిజాబ్ అంశం ఎటూ తేలలేదు. ఈ వివాదంలో సుప్రీంకోర్టుకు చెందిన ఇద్దరు న్యాయమూర్తులు వేర్వేరు తీర్పులు వెలువరించారు. ఏకాభిప్రాయం కొరవడడంతో ఈ వివాదాన్ని విస్తృత ధర్మాసనానికి నివేదించే అవకాశం ఉంది. . రాష్ట్రంలోని విద్యా సంస్థల్లో హిజాబ్ నిషేధం సరైనదేనని జస్టిస్ హేమంత్ గుప్తా సమర్థించగా .. జస్టిస్ సుధాంశు ధూలియా మాత్రం దీనికి వ్యతిరేకంగా తీర్పునిచ్చారు. నిషేధాన్ని ఎత్తివేయాలని ఆయన అభిప్రాయపడ్డారు.
ప్రస్తుతానికి ఈ అంశాన్ని చీఫ్ జస్టిస్ ముందు ఉంచాలని కోర్టు నిర్ణయించింది. విద్యాసంస్థల్లో హిజాబ్ అన్నది ఇస్లాం లో తప్పనిసరి ప్రాక్టీసు కాదని, నిషేధాన్ని అనుమతించాలని కర్ణాటక హైకోర్టు లోగడ తీర్పునిచ్చింది. ఈ తీర్పును వ్యతిరేకిస్తూ దాఖలైన 26 అప్పీళ్లనూ జస్టిస్ హేమంత్ గుప్తా కొట్టివేశారు. తాను 11 ప్రశ్నలను లేవనెత్తుతున్నానని వాటికి సమాధానాలు కావాలని ఆయన అన్నారు.
అయితే జస్టిస్ సుధాంశు ధూలియా .. హైకోర్టు తీర్పును కొట్టివేస్తూ…. కోర్టు తప్పుడు నిర్ణయం తీసుకుందన్నారు. ఇది వారి వారి చాయిస్ ప్రకారం ఉంటుందని, ఈ విషయంలో ఆర్టికల్ 14ని, ఆర్టికల్ 19 ని పరిగణనలోకి తీసుకోవాలని అన్నారు. ఫిబ్రవరి 5 నాటి కర్ణాటక ప్రభుత్వ ఉత్తర్వులను తాను తోసిపుచ్చుతున్నానని, హిజాబ్ పై ఆంక్షలను తొలగించాలని ఆదేశిస్తున్నానని ఆయన పేర్కొన్నారు.
తరగతి గదుల్లో విద్యార్థులు హిజాబ్ ధరించడాన్ని నిషేధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గత ఫిబ్రవరిలో ఉత్తర్వులు జారీ చేసింది. దీన్ని సవాలు చేస్తూ కొందరు హైకోర్టుకెక్కగా .. కోర్టు నిషేధాన్ని సమర్థించింది. మళ్ళీ దీన్ని కూడా సవాలు చేస్తూ పలువురు సుప్రీంకోర్టులో అపీళ్ళు దాఖలు చేశారు. అపీళ్ళను తాను అనుమతిస్తున్నట్టు జస్టిస్ ధూలియా స్పష్టం చేశారు.ఏమైనప్పటికీ ఈ వివాదంపై అత్యున్నత న్యాయస్థానం ఎలాంటి తుది తీర్పునూ ఇవ్వలేదు.