ఇందిరా శోభన్ టీపీసీసీ అధికార ప్రతినిధి
తెలంగాణలో 50 శాతం జనాభా ఉన్నటువంటి మహిళలకు ఆర్థిక పరిపుష్టత కల్పించాలనే సదుద్ధేశంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ సెల్ఫ్ హెల్ప్ గ్రూపులకు పెద్దపీట వేసి.. వడ్డీలేని రుణాలు, స్త్రీ నిధి పథకాలతో పాటు జనశ్రీ బీమా యోజన, ఆమ్ ఆద్మీ బీమా యోజన లాంటి ఇన్సూరెన్స్ పథకాలను ప్రారంభించింది.అంతేకాకుండా.. అభయహస్తం లాంటి పథకానికి చట్టబద్ధత కల్పించిన ఘనత కాంగ్రెస్ దే. కానీ.. నేడు స్వపాలనలో ఈ పథకాలు పూర్తిగా నిర్వీర్యం చేయబడ్డాయి. దీనికి సంబంధించి సమాచార హక్కు చట్టం కింద నేను సేకరించిన సమాచారం ప్రకారం.. వడ్డీలేని రుణాల కింద తెలంగాణలో 6 లక్షల 72 వేల 623 మంది సభ్యులకు.. 2014 నుంచి 2020 వరకు రూ.3,422.30 కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉండగా.. రూ.1760.36 కోట్ల రూపాయలు మాత్రమే చెల్లించడం జరిగింది. ఇంకా రూ.1661.94 కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉంది. ప్రభుత్వం సకాలంలో వడ్డీ చెల్లించకపోవడం వల్ల పలు బ్యాంకులు.. కరోనా సమయంలో కూడా మహిళల నుంచి ముక్కుపిండి మరీ వడ్డీలను వసూలు చేశాయి. తక్షణమే.. వడ్డీ పైసలను చెల్లించి మహిళలకు ఆర్థికంగా అండగా నిలబడాలి. మహిళలో ఉన్నటువంటి పొదుపు గుణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. ఈ జనవరి 20న ఎంపీ జగదాంబికాపాల్ నేత్రుత్వంలోకేంద్ర పట్టణాభివృద్ధి పార్లమెంటరీ స్థాయి సంఘం సమావేశం హైదరాబాద్ లో జరిగినప్పుడు తెలంగాణలో 74.11 శాతం మహిళా స్వయం సహాయక సంఘాలకు రుణాలు అందించడంలో రాష్ర్టం 216.47 శాతం లక్ష్యాన్ని సాధించిందని పొగడటం ఎంత వరకు సమంజసం.
మరోవైపు.. బీజేపీ తెలంగాణ ఇంచార్జ్ తరుణ్ చూగ్ మహిళా మోర్చా మీటింగ్ లో.. మహిళా సంఘాలను ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్వీర్యం చేస్తున్నారని దుమ్మెత్తిపోసిన విషయం తెలిసిందే. పై రెండు స్టేట్ మెంట్లను ఒకసారి గమనిస్తే.. కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు.. తెలంగాణ ప్రజలను ఎలా మోసం చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. ప్రభుత్వ అధికారిక సమావేశాల్లో అహో..హోహో అనడం.. రాజకీయ కోణంలో మాత్రం విమర్శలు గుప్పించుకోవడం పరిపాటిగా మారడం సిగ్గుచేటు. టీఆర్ఎస్, బీజేపీలు తోడుదొంగల్లా వ్యవరిస్తున్నారని చెప్పడానికి ఇంతకంటే రుజువు ఏం కావాలి. అటు.. అభయహస్తం విషయానికి వస్తే..2018లో సమాచార హక్కు చట్టం కింద నేను తీసుకున్న సమాచారం ప్రకారం.. అభయహస్తం కో కాంట్రిబ్యూటరీ పెన్షన్ యాక్ట్ కింద 20 లక్షల మంది సభ్యులు 934 కోట్ల రూపాయలు ఎల్ఐసీ వారి దగ్గర ఉన్నట్లు తెలిపారు. ఆర్టీఐ కింద తాజాగా తీసుకున్న సమాచారం ప్రకారం.. అభయహస్తం పథకం అసలు అమల్లోనే లేదని యాక్ట్ నెం.6 ఆఫ్ 2020.. మార్చి 21, 2020న రద్దు చేశామని తెలపడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ 2018 నుంచి ప్రభుత్వానికి పలు సందర్భాల్లో ఈ యాక్ట్ ను యథావిధిగా కొనసాగించాలని కోరినా.. ప్రభుత్వం మాత్రం పెడచెవిన పెట్టింది. రద్దు చేసి ఏడాది కావస్తున్నా.. ఇప్పటి వరకు వాటాదారుల మొత్తాన్ని, వడ్డీని తిరిగి చెల్లించకపోవడం గర్హనీయం. ఈ మొత్తాన్ని సత్వరమే చెల్లించాలని కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికైనా.. తెలంగాణ ప్రభుత్వం మహిళలకు చెల్లించాల్సిన వడ్డీ బకాయిలను, అభయహస్తం కింద వాటాదారులకు రావాల్సిన మొత్తాన్ని సత్వరమే విడుదల చేయాలని.. లేనిపక్షంలో మహిళాశక్తిని కూడగట్టుకుని మీ కోటను బద్ధలు కొడతామని హెచ్చరిస్తున్నాం.