రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చీఫ్ బ్రిజ్ భూషణ్ తమను లైంగికంగా వేధిస్తున్నాడంటూ కొందరు మహిళా రెజ్లర్లు చేసిన ఆరోపణపై కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ తీవ్రంగా స్పందించింది. ఈ ఆరోపణలకు 72 గంటల్లోగా సంజాయిషీ ఇవ్వాలని ఈ సంస్థను ఆదేశించింది. వినేష్ ఫొగట్ వంటి రెజ్లర్లు తమను బ్రిజ్ భూషణ్ కొడుతున్నాడని, లైంగికంగా వేధిస్తున్నాడని ఆరోపిస్తూ నిన్న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన ప్రదర్శన చేశారు.
సాక్షి మాలిక్, బజ్ రంగ్ పునియా వంటి ఇతర రెజ్లర్లు కూడా ఆమెకు సంఘీభావం ప్రకటించారు. వీరంతా ఒలంపియన్ రెజ్లర్లు కూడా. భూషణ్ వేధింపులను భరించలేక తాను ఒకదశలో ఆత్మహత్య చేసుకుందామని అనుకున్నానని కూడా వినేష్ ఫొగట్ కన్నీటి పర్యంతమైంది.
వీరి ఆరోపణలను సీరియస్ గా తీసుకుంటున్నామని, అథ్లెట్ల ప్రయోజనాలు తమకు ముఖ్యమని పేర్కొన్న క్రీడా మంత్రిత్వ శాఖ.. వీటిపై 72 గంటల్లోగా సమాధానం చెప్పాలని రెజ్లింగ్ ఫెడరేషన్ ని ఆదేశించింది. ఈ డెడ్ లైన్ లోగా సంజాయిషీ ఇవ్వని పక్షంలో తదనంతర చర్య తీసుకుంటామని హెచ్చరించింది. అయితే ఈ ఆరోపణలను నిరూపిస్తే ఉరేసుకుంటానని బ్రిజ్ భూషణ్ నిన్న పేర్కొన్నారు. బీజేపీ నేత కూడా అయిన ఈయన వీటిని ఖండించారు. తన నివాసం క్యాంప్ కి 125 కి.మీ. దూరంలో ఉంటుందని, తనకు జెడ్ కేటగిరీ భద్రత కూడా ఉంటుందని ఆయన తెలిపాడు. అయితే క్రీడా శాఖ ఇతని వాదనను పట్టించుకున్నట్టు కనిపించలేదు.
రెజ్లింగ్ ఫెడరేషన్ కు, ఈ రెజ్లర్లకు మధ్య తలెత్తిన వివాదం కారణంగా లక్నోలో మహిళలకు నిర్వహించతలపెట్టిన నేషనల్ క్యాంప్ ను రద్దు చేస్తున్నట్టు క్రీడా మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ క్యాంప్ లో 13 మంది కోచ్ లతో సహా 41 మంది రెజ్లర్లు పాల్గొనాల్సి ఉంది.