ఒకే తల్లి కడుపులో పుట్టిన తోబుట్టువులు కొంతకాలం వరకు మాత్రమే కలిసి ఉంటారు.. కానీ.. కట్టుకున్న భార్య అయినా.. భర్త అయినా.. కాటికి పోయే వరకు తోడుంటారు అంటారు. ముమ్మాటికి అది నిజం అనేలా ఓ వృద్ద దంపతులు కాటిలోనూ కలిసి పయణించారు.
భర్త మృతిని తట్టుకోలేక తీవ్ర మనస్తాపానికి గురైన భార్య.. 15 నిమిషాల వ్యవధిలోనే తానూ ప్రాణాలు విడిచింది. ఈ ఘటన వరంగల్ జిల్లా సంగెం మండలం నార్లవాయి గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన బూర కట్టయ్య(75)- కమలమ్మ(65) కమలమ్మ దంపతులు. వీరికి ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
అనారోగ్యంతో కొంత కాలంగా మంచానికే పరిమితం అయిన తన భార్యకు కొన్నాళ్లుగా సపర్యలు చేస్తున్నాడు కట్టయ్య. ఇద్దరు అనారోగ్యంతో బాధపడినప్పటికీ.. ఇన్నాళ్లు ఒకరికొకరు ఉన్నారనే దైర్యంతో కలిసి జీవించారు. కానీ శనివారం వృద్ధాప్య సమస్యలతో కట్టయ్య కన్నుమూశాడు.
భర్త మరణాన్ని చూసి జీర్ణించుకోలేకపోయింది కమలమ్మ. భర్తను తలుచుకుంటూ తీవ్ర మనస్తాపానికి గురైంది. ఆయన మరణించిన పావుగంట వ్యవధిలోనే కమలమ్మ కూడా కన్నుమూసింది. భార్యాభర్తలు ఒకే రోజు మృత్యువాత పడటంతో వారి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. దీంతో గ్రామంలో విషాద వాతావరణం ఏర్పడింది. బంధువులు, గ్రామస్థులు వృద్ధ దంపతులకు అశ్రునయానాలతో అంతిమ యాత్ర నిర్వహించి ఒకే చితిపై మృతదేహాలను పేర్చి అంత్యక్రియలు నిర్వహించారు.