దేశంలో మరో కొవిడ్ టీకా అందుబాటులోకి రానుంది. రష్యాకు చెందిన గమలేయా రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్, రష్యా ప్రత్యక్ష పెట్టుబడి నిధి (ఆర్‌డీఐఎఫ్) సంస్థలు అభివృద్ధి చేసిన స్పుత్నిక్ లైట్ టీకా.. అత్యవసర వినియోగానికి భారత ఔషధ నియంత్రణ సంస్థ (డీసీజీఐ) ఆదివారం ఆమోదం తెలిపింది. ఈ వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి అనుమతివ్వాలంటూ.. సెంట్రల్ డ్రగ్ అథారిటీ నిపుణుల బృందం డీసీజీఐకి వారం క్రితం సిఫార్సు చేసింది.
పరిశీలించిన డీసీజీఐ.. ఆదివారం అంగీకారం తెలిపింది. దేశంలో కొవిడ్ నిరోధానికి అనుమతులు లభించిన 9వ టీకాగా స్పుత్నిక్ లైట్ నిలవనుంది. ఇది సింగిల్ డోసు టీకా. అంతేగాక సార్వజనీన బూస్టర్ డోసుగానూ ఇవ్వొచ్చు. అంటే గతంలో ఏ టీకా రెండు డోసులు తీసుకున్నా.. స్పుత్నిక్ లైట్ ను బూస్టర్ గా వాడొచ్చు. ఈ టీకా పంపిణీ సులభమని పేర్కొంది.
బూస్టర్ గా వేయడం ద్వారా ఇతర టీకాల రోగ నిరోధక ప్రభావశీలతను మరికొంత కాలం పొడిగిస్తుందని ఆర్డీఐఎఫ్ పేర్కొంది. స్పుత్నిక్ లైట్ 30 పైగా దేశాల్లో వినియోగంలో ఉందని వివరించింది. ఒమైక్రాన్ కు వ్యతిరేకంగా గణనీయ సంఖ్యలో యాంటీబాడీలను పెంపొందిస్తుందని వెల్లడించింది.
భారత్ లో స్పుత్నిక్ టీకాల పంపిణీలో డాక్టర్ రెడ్డీస్ సంస్థ ఆర్‌డీఐఎఫ్‌కు భాగస్వామిగా వ్యవహరిస్తోంది. స్పుత్నిక్ లైట్ కు అత్యవసర అనుమతి ఇచ్చేందుకు గత ఏడాది జూలై 1న డీసీజీఐ నిరాకరించింది. మరోవైపు ఈ టీకాకు అనుమతులు రావడం పట్ల కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ మన్ సుఖ్ మాండవీయ స్పందిస్తూ.. మహమ్మారిపై భారత్ చేస్తున్న పోరాటానికి నిర్ణయం ఉపకరిస్తుందన్నారు.