ఒడిశా తీరంలో కొద్దిరోజులు క్రితం చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులు వారి మీదుగా పదే పదే ఓ పావురం చక్కర్లు కొట్టడం గమనించారు. అది మరింత కిందుగా పయనించడం, వచ్చి వారి బోటుపై వాలడంతో వెంటనే దాన్ని బంధించారు. ఆపై దానిని చేతులోకి తీసుకొని పరిశీలించగా కాళ్లకు కెమెరా, మెక్రోచిప్ అమర్చినట్లు గుర్తించారు.
ఇదేదో తేడాగా ఉందనుకున్న మత్స్యకారులు ఆ పావురాన్ని బుధవారం మెరైన్ పోలీసులకు అప్పగించారు. పరిశీలించిన పోలీసులు ఈ పక్షిని గూఢచర్యం కోసం ఉపయోగిస్తున్నట్లు అనుమానిస్తున్నారు. పావురం రెక్కలపై అర్థం కాని భాషలో ఏదో రాసి ఉందని, దాని కాళ్లకు చిప్, కెమెరా ఉన్నాయని జిల్లా ఎస్పీ తెలిపారు.
పదే పదే గూఢచర్యపు పావురాలు కంటపడుతుండటంతో ప్రేమకు చిహ్నాలైన వీటితో దేశానికి ముప్పు పొంచి ఉందా..? సరిహద్దుల్లో డ్రాగన్ కంట్రీ ఏమైనా వ్యూహ రచన చేస్తోందా..? అన్నట్లుగా నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి.
రెండ్రోజుల క్రితం గోవాలో పర్యటించిన రాజ్ నాథ్ సింగ్ సరిహద్దుల్లో రక్షణ దళాలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించటం గమనార్హం. ఇది జరిగిన రెండు రోజుల్లోనే గూఢచర్యపు పావురం కంటపడటం పలు అనుమానాలకు తావిస్తోంది.