సాయి తేజ్ ప్రమాదంపై ‘మా’ అధ్యక్షుడు నరేష్ చేసిన కామెంట్స్ పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. హీరో శ్రీకాంత్, నిర్మాత బండ్ల గణేష్ స్పందిస్తూ.. నరేష్ వ్యాఖ్యలను ఖండించారు.
ఎప్పుడేం మాట్లాడాలో తెలియదా అంటూ నరేష్ ను బండ్ల గణేష్ ప్రశ్నించాడు. జరిగింది చిన్న యాక్సిడెంట్.. దానికి గత ప్రమాదాల్లో చనిపోయినవారి పేర్లు చెప్పడం ఏంటని మండిపడ్డాడు. ఈ సమయంలో రేసింగ్ ప్రస్తావన ఎందుకన్న బండ్ల… త్వరగా కోలుకోవాలని పరమేశ్వరుడ్ని ప్రార్థించమని చెప్పాడు.
ఇదే ఇష్యూపై హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ నరేష్ అలా మాట్లాడి ఉండకూడదని చెప్పాడు. చనిపోయిన వారి పేర్లను ప్రస్తావిస్తూ బైట్ ఇవ్వడం కరెక్ట్ కాదన్నాడు. ఎవరైనా స్పందించేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలని సూచించాడు శ్రీకాంత్.
ఇక నిర్మాత నట్టి కుమార్ కూడా నరేష్ వ్యాఖ్యల్ని తప్పుబట్టాడు. ఈ సమయంలో రేసింగ్ గురించి మాట్లాడాల్సిన అవసరం ఏంటన్నాడు. ఈ నేపథ్యంలో నరేష్ కు చెందిన మరో వీడియో బయటకొచ్చింది. తేజ్, నవీన్ కలిసి వెళ్లిన మాట వాస్తవమేనని.. ఓ టీ షాప్ ఓపెనింగ్ కు వెళ్లారని.. తర్వాత ఎవరికి వారు వెళ్లిపోయారని చెప్పాడు. రేస్ జరగలేదన్న నరేష్.. తేజ్ ఓవర్ స్పీడ్ లో కూడా లేడని వివరించాడు. రోడ్డుపై ఉన్న మట్టి వల్లే కింద పడిపోయాడని చెప్పాడు.