అప్పట్లో… తెలంగాణ ఉద్యమం, ప్రత్యేక రాష్ట్ర భావనలు బాగా పెరుగుతున్న సందర్భం. నేను ప్రజాశక్తిలో పనిచేసేవాడిని… సీపీఎం సమైక్యవాదం లైన్ తీసుకుంది.అది పార్టీ నిర్ణయం. అందరూ పాటించాల్సిందే. ప్రజాశక్తి రిపోర్టర్లకూ తప్పదు. కానీ ఓ సందర్భం చెబుతాను. ఆంధ్రజ్యోతి ఎడిటోరియల్ బోర్డులో కీలకసభ్యుడు అల్లం నారాయణ, అప్పటికే సీనియర్ పాత్రికేయులుగా వివిధ సంస్థల్లో ఉన్న జకీర్, శైలేష్ రెడ్డి, మరో పదకొండు మందితో ఓ మీటింగు జరిగింది. వేదిక సికింద్రాబాద్ క్లబ్. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఏం చేద్దాం? ఎవరి అభిప్రాయాలు వారు చెప్పారు. బహుశా తెలంగాణ జర్నలిస్టు ఫోరం ఆవిర్భావానికి అదే నాంది.
సమైక్యవాదం స్టాండ్ తీసుకున్న సీపీఎం పార్టీకి నేను తెలంగాణ భావనలతో మీటింగులకు హాజరవుతున్నానని తెలియదా? తెలుసు! కచ్చితంగా తెలుసు. కానీ ఏ ఒక్క రోజూ ఇదేమిటని అడగలేదు. నా కొలువుకేమీ ఢోకా రాలేదు. జర్నలిస్టుల వ్యక్తిగత అభిప్రాయాలు, ఆకాంక్షలు వేరు. వాటిని ఎప్పుడూ సీపీఎం గానీ, ప్రజాశక్తి గానీ అభ్యంతరపెట్టలేదు.
అప్పట్లో సమైక్యవాద జర్నలిస్టులకు, అనగా ఆంధ్రా జర్నలిస్టులకు మా తెలంగాణ జర్నలిస్టులంటే ఓ చిన్నచూపు, ఓ వెటకారం, ఓ నవ్వులాట. ఎప్పుడు పదిమంది కలిసిన సందర్భం వచ్చినాసరే వెకిలి వ్యాఖ్యలు చేసేవాళ్లు. వెనక వెనక జోకులు వేసుకుంటూ నవ్వుకునేవాళ్లు. కడుపు రగిలిపోయేది. మనసు ఉడికిపోయేది. ఈ సందర్భంగా ఓ మాట చెప్పాలి. గాంధీ ఏమన్నాడు?
‘‘నా ఇంటిగోడల్ని బందోబస్తు చేసి, నా గది కిటికీలు అన్ని వైపులా మూసి వుండాలని నేను కోరుకోను. అన్నిరకాల గాలులూ, భావప్రకంపనలూ నా గదిలోకి ప్రసరించాలి. నేను దేన్నీ వద్దనను’’ రఫ్‌గా ఇదే గాంధీ చెప్పిన సూక్తి. అప్పట్లో చంద్రబాబు ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా నేరుగా అసెంబ్లీలో గానీ, సచివాలయంలో సీఎం పేషీ వరకూ తెలంగాణ జర్నలిస్టులు వెళ్లేవాళ్లు. తను బయటికి వచ్చినప్పుడు పలకరిస్తే ఏదో ఒకటి మాట్లాడేవాడు. నా తెలంగాణవాదం తెలుసు. ‘వాట్ కామ్రేడ్ రెడ్డీ’ అనేవాడు. తరువాత వైఎస్ హయాం స్టార్టయ్యాక మరీ సమైక్యవాదం. ఎక్కడికక్కడ కేసీయార్ ఉద్యమాన్ని విఫలం చేయాలని ప్రయత్నాలు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోళ్లు. పదే పదే ఉపఎన్నికలు, వ్యూహాలు. ఎక్కడికక్కడ కేసీయార్ తెలంగాణవాదాన్ని పలుచన చేసి, జనం మద్దతు లేదనే ముద్ర వేయటానికి బోలెడు ఎత్తుగడలు. ఐనాసరే తెలంగాణ జర్నలిస్టులు అసెంబ్లీలో సీఎం ఇన్నర్ లాబీ దాకా వెళ్లేవాళ్లు. తను నవ్వుతూ పలకరించేవాడు. ఎవరి అభిప్రాయాలు, ఎవరి వాదాలు వాళ్లవి. తను వీర సమైక్యవాది అయినా సరే ఎప్పుడు తెలంగాణ జర్నలిస్టుల పట్ల వివక్షను చూపలేదు సరికదా ఓ పిసరు తెలంగాణ జర్నలిస్టుల పట్లే ప్రేమగా ఉండేవాడు.
కానీ సమైక్య అలియాస్ ఆంధ్రా జర్నలిస్టుల వెటకారాలు, వెక్కిరింపులు, ఎత్తిపొడుపులు, వెనుక వెనుక వ్యాఖ్యలు నడుస్తూ ఉండేవి… మమ్మల్ని చూసే నవ్వేవాళ్లు. సచివాలయం చెట్టు కింద (అప్పట్లో సచివాలయం జర్నలిస్టులకు అదే అడ్డా. అందరూ అక్కడే కలిసేవాళ్లు. అక్కడే ప్రెస్ రూం ఉండేది) కలిస్తే చాలు తెలంగాణ ప్రస్తావన వచ్చేది. మాకు రోజువారీ అవమానాలు, పరాభావాలు తప్పేవి కావు.
అల్లం నారాయణ ఆంధ్రజ్యోతిలో పనిచేస్తున్నప్పుడు, తను తెలంగాణ ఫోరం ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నప్పుడు ఆంధ్రజ్యోతి యాజమాన్యానికి తెలియదా? కానీ తనకెప్పుడూ ఆ సెగ, పొగ తగల్లేదు. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ సైతం ఇదేమిటని ఎప్పుడూ ప్రశ్నించలేదు. అడ్డుకోలేదు. అంటే, తోటి జర్నలిస్టుల వెక్కిరింపులకు గురైనా సరే, సమైక మీడియా ఎప్పుడూ తెలంగాణ జర్నలిస్టులపై కక్ష సాధించలేదు. సమైక్య ప్రభుత్వాలు ఎప్పుడూ తెలంగాణ జర్నలిస్టులపై వివక్ష ప్రదర్శించలేదు. దేనికదే.
అంతెందుకు? మిలియన్ మార్చ్ జరుగుతుంటే, సమైక్య ప్రభుత్వం అడుగుకో బారికేడ్, మైలుకో పోలీస్ క్యాంపు పెట్టినా సరే, వాటిని బ్రేక్ చేసి ట్యాంక్ బండుపైకి అడుగుపెట్టింది జర్నలిస్టులే. అంత సీరియస్ వర్క్, డెడికేషన్ జర్నలిస్టుల వైపు నుంచి కనిపించింది. అది సమైక్య పత్రికా, ప్రత్యేక రాష్ట్రవాద పత్రికా జానేదేవ్. మనం మనం ఒకటి. తెలంగాణ ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడూ రాదు అనే భావన తెలంగాణ జర్నలిస్టులను మీడియా సంస్థలకు అతీతంగా, వాటి రాజకీయ వైఖరులకు అతీతంగా నడిపించింది.
మరి ఇప్పుడు?
తెలంగాణ తాత్కాలిక సచివాలయం బీఆర్‌కేఆర్ భవన్‌లోకి జర్నలిస్టుల ప్రవేశాన్ని ఈ ప్రభుత్వం… తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, మేం కొట్లాడి సాధించుకున్న తెలంగాణకు సంబంధించిన ప్రభుత్వం నిరాకరిస్తున్నది. నిషేధిస్తున్నది. చివరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సైతం నేను నిమిత్తమాత్రుడిని, నన్నేమీ అనకండి అంటూ జర్నలిస్టులను కోరుకున్నాడు. కేబినెట్ మీటింగు కవరేజీకి వెళ్తే ప్రగతిభవన్ ఎదుట, రోడ్డు మీద మంచినీళ్లు, చాయ్ నీళ్లకూ దిక్కులేకుండా గంటల తరబడీ వేసారి, చివరకు ఏమీ లేదు పొండయ్యా అనే ఛీత్కరింపులకు గురై వాపస్ వెళ్లిపోయిన దుస్థితి. ఇది మేం అభిలషించిన తెలంగాణయేనా? ఆ బీఆర్‌కేఆర్ భవన్ ఛాంబర్లలో ఏమైనా దేశరక్షణ రహస్యాలు దాగున్నాయా? ఎందుకీ ఆంక్షలు. దేశసరిహద్దుల్లో కూడా అన్ని ఆంక్షలు లేవుగా. ఎందుకు జర్నలిస్టులకు పరిమితులు?
మళ్లీ ఇప్పుడు అదే పాత సమైక్య జర్నలిస్టులు మమ్మల్ని చూసి పకపకా నవ్వుతున్నారు. మీ రాష్ట్రమోయ్, మీ ప్రభుత్వమోయ్, మీ కేసీయార్, బాగైందా అని వెక్కిరిస్తున్నారు. నవ్వెటోడి ముందు జారిపడ్డ ఫీలింగు. ఎక్కడో ఏదో తేడా కొట్టింది. మనం తెచ్చుకున్న మన సర్కారే మనల్ని నడ్డి మీద తంతున్నది. ఇదేనా మేం కోరుకున్నది? ఇక్కడ సచివాలయంలో తెలంగాణ జర్నలిస్టులు ఏదో సాధించి, శోధించి గొప్ప వార్తలు రాస్తారని, వాటికి ఇప్పటి కేసీయార్ సర్కారు నిర్బంధాల నడుమ మీడియాలో చోటు దొరుకుతుందనీ ఆశేమీ లేదు. ఎవడూ మనకు గుక్కెడు చాయ్ నీళ్లు పోయించాల్సిన అవసరం ఏమీ లేదు. కానీ మనస్సులు గాయపడుతున్నాయి. మనవాడే మనల్ని తంతున్న నొప్పి.
అప్పట్లో తెలంగాణ కలాల్ని ఏకతాటిపై నడిపించిన జర్నలిస్టులు మాట్లాడరు. గొంతు పెగలదు. కలం కదలదు. నిర్లిప్తంగా, నిస్సత్తువగా, నీరసంగా… ఎక్కడో ఏమో తాకట్టు పెట్టినట్టుగా… అంతా నిశ్శబ్దం. మాగన్నుగా నిద్రపోతే కూడా ఎవడో సమైక్య జర్నలిస్టు నన్ను చూసి పకపకా నవవుతున్నట్టు కనబడటలేదా….. మనలను మనం తడిమిచూసుకుంటే మనలను మనమే కోల్పోయామనే భావన సృషించడం లేదా….? ఇంతకీ మనమేం సాధించినట్టు? బుద్ధి జీవులుగా మనం కదలొద్దా…? ప్రజాస్వామ్యానికి ముంచుకొస్తున్న ముప్పు, నియంతృత్వ రక్కసి కాళ్ళ గజ్జెల సవ్వడి వినిపించడం లేదా….?
జర్మనీ కవి మార్టిన్ నెమోలర్ రాసిన కవితను ఒకసారి గుర్తు చేయడం సందర్భోచితమే….. ”నాజీలు మొదట కమ్యూనిస్టుల కోసం వచ్చారు. నేను కమ్యూనిస్టును కాదుకదా, నాకోసం రాలేదని ఊరుకున్నాను. తర్వాత వాళ్లు సోషలిస్టుల కోసం వచ్చారు. అప్పుడూ ఊరుకున్నాను. తర్వాత వాళ్లు ట్రేడ్ యూనియనిస్టుల కోసం వచ్చారు. నాకు సంబంధించిన విషయం కాదుకదాని ఊరుకున్నాను. తర్వాత నాజీ సేనలు యూదుల కోసం వచ్చారు. అది కూడా నేను కాదుకదాని ఊరుకున్నాను. తర్వాత నాజీ సేవలు నా ఇంటి దాకా వచ్చారు.. నా కోసం వచ్చారు. వెనక్కి తిరిగి చూస్తే నా కోసం ఎవ్వరూ కనపడలేదు”
బోరెడ్డి అయోధ్య రెడ్డి,
అధికార ప్రతినిధి మరియు మీడియా కో ఆర్డినేటర్,
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ.
(courtesy:Navatelangana)