బోదనపల్లి వేణుగోపాల్ రెడ్డి
సీనియర్ జర్నలిస్ట్
రాజకీయ పార్టీలు అవినీతి అంశాన్ని ఎక్కువగా చర్చ చేస్తుంటాయి . కోట్లాది రూపాయల ప్రభుత్వ సొమ్మును దోచుకుందని పదే పదే అధికారపార్టీపై ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తాయి. విచారణ సంస్థలను ఆశ్రయిస్తాం.. అవినీతిని బట్టబయలు చేస్తాం.. అని గట్టి స్వరంతో గర్జిస్తాయి. ఐతే మాటలకే పరిమితమై కార్యాచరణ లేకపోతే జనంలో ఆయా పార్టీలు మనుగడ కోల్పోతాయి. ఈ అంశాలు ఎందుకు ప్రస్తావిస్తున్నాను అంటే… కేసీఆర్ మొదటి ప్రభుత్వంలో ఇరిగేషన్ ప్రాజెక్టులలో అవినీతి జరిగిందని , ఆధారాలు కూడా ఉన్నాయి.. సీబీఐ, విజిలెన్స్, కోర్టులను , రాష్ట్రపతిని కూడా కలిసి ఫిర్యాదు చేస్తామని పదే పదే అన్నారు ప్రధాన ప్రతిపక్ష కాంగ్రెస్ నేతలు. కానీ వాళ్లు ఇప్పటి వరకు కూడా కేసీఆర్ అవినీతి పై ఏ విచారణ సంస్థకు ఫిర్యాదు చేయలేదు. ఎందుకు అంటే కాంగ్రెస్ కేంద్రం, రాష్ట్రంలో అధికారంలో లేదు. జైలుకి పంపే శక్తి లేకపోవచ్చు.. నిజంగా కేసీఆర్ ప్రభుత్వంలో అవినీతి జరిగితే ప్రధాన ప్రతిపక్షపార్టీగా పార్టీ అధ్యక్షుడు, సీఎల్పీ లీడర్, పార్టీ లేజిస్లేచర్ బృందంతో ఫిర్యాదు చేసే అధికారం వారికి ఉంది. కానీ కాంగ్రెస్ చేసిన పెద్ద తప్పిదం ఇక్కడే చేసింది. అందుకే ఒక దశలో కాంగ్రెస్ నేతలు కేసీఆర్ కు అమ్ముడపోయారని నింద మోయాల్సి వచ్చింది. జనంలో కూడా పలుచన అయ్యారు.
కాంగ్రెస్ దారిలో బీజేపీ కూడా ఉంటుందా అంటే రాజకీయ పరిణామాలను కేసీఆర్ అనుకూలంగా మార్చుకుంటున్నట్లుగా అనిపిస్తోంది. ఎందుకంటే బండి సంజయ్ బీజేపీ అధ్యక్షుడు అయ్యాక బీజేపీ స్పీడ్ పెరిగింది. పెరుగుట విరుగుట కొరకు ఉండొద్దనేది జనం భావన. బండి సంజయ్ అధ్యక్షుడు ఐనప్పటి నుండి అతని వ్యాఖ్యలు తీవ్ర పదజాలంతో ఉన్నాయి .. కేసీఆర్ చేసిన అవినీతిపై జైలుకు పంపిస్తాం … తానే తీసుకెళ్లి జైల్లో వేస్తారన్న విధంగా ఉన్నాయి.. నిజంగా నేతలు మాట్లాడితే ఓట్లు రాలుతాయన్న దానికి దుబ్బాక , జీహెచ్ఎంసీ ఎన్నికలే నిదర్శనం .జనం కూడా బండి సంజయ్, అరవింద్ మాటలు విన్న తరువాత కేసీఆర్ కు ముందు ముందు కష్టాలే అని నమ్మారు. అందుకే కేసీఆర్ కు వ్యతిరేకంగా పోలరైజ్ అవుతున్న జనం బీజేపీ వైపు చూశారు. బండి సంజయ్ కూడా అధ్యక్ష బాధ్యతలు చేపట్టనప్పటి నుండి ఇరిగేషన్ , విద్యుత్తు డిపార్ట్మెంట్లలో వేల కోట్లు అవినీతి జరిగింది… కేసీఆర్ ను జైల్లో పెడతాం అంటున్నారు.. ఈ అంశాలతో బండి సంజయ్ ఇమేజ్ పెరుగుతోంది. తాజాగా జీహెచ్ ఎంసీ ఎన్నికల్లో మతం రంగుతో రెచ్చగొట్టే వ్యాఖ్యలు కారణం అని కొందరు అంటారు.. కానీ ఇది ఒక పార్ట్ మాత్రమే .. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మతపరమైన భావజాలం లేని వాళ్ళు కూడా బీజేపీ వైపు ఉన్నారు… ఇది అంతా కేసీఆర్ పాలన పై ఆగ్రహం తో ఉన్నవారు బండి దూకుడును సమర్థించారు… కొందరు నేతలు బండికి స్టేటస్ లేదు అనే వారు ఉన్నారు.. కానీ రాష్ట్రంలో ప్రభుత్వం పై ఫైట్ చేసే వారు కావాలని జనం నమ్ముతున్నారు . అయితే జీహెచ్ఎంసీ ఎన్నికల వరకు బాగానే ఉంది. మరి కేసీఆర్ అవినీతి చేసారని చెబుతున్న బండి సంజయ్, ధర్మపురి అరవింద్ లు ఇప్పటి వరకు కేసీఆర్ అవినీతిపై ఆధారాలతో కోర్టులకు కానీ కేంద్ర విజిలెన్స్ , సీబీఐ లకు ఫిర్యాదు చేయలేదు. కేసీఆర్ ను జైలుకు పంపేది బండి సంజయ్ కాదు.. విచారణ సంస్థలే అనేది జనంకు తెలుసు. కొంత సమయం వేచి చూసే ధోరణితో ఉంటారు. మరి ఇప్పటి వరకు బండి సంజయ్ విచారణ సంస్థలను ఎందుకు ఆశ్రయించలేదు? అంటే కేసీఆర్ అవినీతి బయటపెట్టడానికి ఏమి లేకపోవచ్చు. లేకుంటే ఫిర్యాదు చేయాలన్న ఆలోచన ఆయనకు కానీ వారి పార్టీ జాతీయ నాయకత్వానికి గానీ లేకపోవచ్చు..ఈ రెండు కారణలే ఉండాలి..
కానీ ఇక్కడ బీజేపీ , టిఆర్ఎస్ వ్యవహారం చూస్తుంటే…బండి సంజయ్ చెప్పినట్లు కేసీఆర్ జైలుకు పంపటం ఏమి ఉండకపోవచ్చు. కేసీఆర్ అవసరం బీజేపీకి ఉంది.. బీజేపీ అవసరం కేసీఆర్ కు ఉంది. ఢిల్లీ వెళ్ళక ముందు కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ..రైతుల ఇచ్చిన భారత్ బంద్ లో మంత్రి కేటీఆర్ షాద్ నగర్ లో పాల్గొన్నారు. అంటే బీజేపీ ని ఎండగట్టాలని డిసైడ్ అయ్యారు కేసీఆర్. ముఖ్యమంత్రి బంద్ కు మద్దతు తెలపడం వేరు.. బంద్ లో పాల్గొంటే తీవ్రత ఎక్కువగా ఉంటుంది. సౌత్ ఇండియాలో కేసీఆర్ , జగన్ , స్టాలిన్, కేరళలో కమ్యూనిస్టులు అందరూ బంద్ కు మద్దతు తెలపడం అనేది బీజేపీకి పెద్ద మైనస్ భావించింది. వెంటనే కేసీఆర్ ను ఢిల్లీకి పిలిపించుకున్నారు… దీంతో కేసీఆర్ అవసరం బీజేపీకి ఏర్పడింది. కేసీఆర్ ఢిల్లీ వెళ్లి ప్రధాని కాళ్లు పట్టుకున్నారన్న కామెంట్స్ రాష్ట్ర బీజేపీ నుండి వచ్చాయి… అలా ఉండక పోవచ్చు కేసీఆర్ అవసరం బీజేపీకి ఉంది. ప్రధాన మంత్రిని కలిసిన తరువాత కేంద్ర వ్యవసాయ చట్టాలను సమర్ధించారు. మొన్నటి వరకు ఆయస్మాన్ భారత్ పథకాన్ని విమర్శించిన కేసీఆర్ ఆ పథకాన్ని రాష్ట్రం ఆడాప్ట్ చేసుకుంది..
అంటే రాష్ట్రంలో టీఆరెస్ ను బీజేపీ ఎదురిస్తుందని… కేసీఆర్ అవినీతిని నిరూపించి జైలుకు పంపిస్తారన్న బండి సంజయ్ మాటలను టీఆర్ఎస్ వ్యతిరేకులు భావించారు. కానీ పదే పదే ఆరోపణలు చేస్తున్నారే కానీ ఆధారాలతో బయటపెట్టకపోవడం వల్ల బీజేపీ పట్ల నమ్మకం సన్నగిల్లుతుంది.. నీడతో యుద్ధం చేయడం వల్ల ఫలితం ఉండదు. గతంలో కాంగ్రెస్ నేతలు కూడా పదే పదే ఆరోపణలకు పరిమితం అయ్యారు తప్ప ఫిర్యాదులు చేయలేదు…అందుకే ఆ పార్టీ ఉనికి కోసం పోరాడుతున్న పరిస్థితి ఏర్పడింది.
బండి సంజయ్ ఆద్యక్షుడు అయినప్పటి నుండి కేసీఆర్ అవినీతిపై గల్లీలో కుస్తీ పడుతున్నారు కానీ ఆచరణలో లేకపోతే విజయాలు అసెంబ్లీ ఎన్నికల వరకు ఉండవు. బండి స్పీడ్ ఎన్నికల చివరివరకు ఉంటే జనం నమ్ముతారు… ఎందుకు అంటే కేంద్రంలో అధికారంలో ఉండి కేసీఆర్ అవినీతి పై ఆరోపణలు చేసి రుజువు చేయకపోతే బండి సంజయ్ ను డూప్ ఫైట్ ర్ గా జనం భావిస్తారు…