నందమూరి ఫ్యామిలీలో విషాదం నెలకొంది. ఎన్టీఆర్ కుమార్తె ఉమా మహేశ్వరి ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఒత్తిడి, అనారోగ్యమే కారణమని ప్రచారం జరుగుతోంది. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు.
ఉమామహేశ్వరి కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలోనే జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఆమె మృతితో నందమూరి కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఉమామహేశ్వరి ఇంటికి నందమూరి, చంద్రబాబు కుటుంబసభ్యులు చేరుకున్నారు. విదేశాల్లోని కుటుంబసభ్యులకు సమాచారం అందించారు.
దివంగత సీఎం ఎన్టీఆర్, బసవతారకం దంపతులకు 11 మంది సంతానం. వారిలో ఏడుగురు కుమారులు కాగా.. నలుగురు కుమార్తెలు. లోకేశ్వరి, పురంధేశ్వరి, భువనేశ్వరి తర్వాత ఉమామహేశ్వరి పుట్టారు. ఈమె భర్త కంఠమనేని శ్రీనివాస్ ప్రసాద్.
ఉమా మహేశ్వరి.. ఇటీవలే తన చిన్న కుమార్తెకు వివాహం జరిపించారు. ఇంతలోనే ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. ఆమె మృతిపై పలువురు సంతాపం తెలియజేశారు.